న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నెహ్రూ ప్లేస్ ప్రాంతంలోని బీఎస్‌ఈఎస్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఎస్‌ఈఎస్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఎస్‌ఈఎస్ సంస్థ గంటల తరబడి విద్యుత్ సరఫరాలో కోత విధిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాగా ఎండ తీవ్రంగా ఉండడంతో జాతీయ రాజధానిలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 5,925 మెగావాట్లకు చేరుకుంది.
ఈ నెల 11వ తేదీన ఇది 5,810 మెగావాట్లు మాత్రమే. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.డిమాండ్ పెరిగిన కారణంగా కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి దాదాపు నాలుగు గంటలమేర కోత విధించామన్నారు. వాస్తవానికి విద్యుత్ కొరత లేదని, బీఎస్‌ఈఎస్ డిస్కం నెట్‌వర్క్‌లో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అన్నారు.అయితే ఈ విషయమై స్పందించేందుకు బీఎస్‌ఈఎస్ అధికారులు నిరాకరించారు. మరోవైపు విద్యుత్ బిల్లుల విషయంలో నగరవాసులకు ఊరట కలిగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సోమవారం కలిసింది. దీంతోపాటు కోతల విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. దిగువ, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీ ఇవ్వాలని విన్నవించింది. సబ్సిడీ కోసం నిధులు కేటాయిస్తామన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం తొందరపాటుతనంతో గద్దె దిగిందని, దీంతో సామాన్యులు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదని తెలిపింది. వేళాపాళా లేకుండా డిస్కంలు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నాయని, ఇకమీదట ఆవిధంగా జరగకుండా చూడాలని విన్నవించింది.
బీఎస్‌ఈఎస్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Published Tue, Jul 15 2014 10:22 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement