సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం రాజకీయ పార్టీల ఆస్తులపై ఏమాత్రం పడలేదు. ఆయా పార్టీలు వెల్లడిస్తున్న ఆస్తుల చిట్టా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. 2004-05లో బీజేపీ ప్రకటించిన ఆస్తులు రూ 122.93 కోట్లు కాగా 2015-16 నాటికి అవి రూ 893.88 కోట్లకు పెరిగాయి. కాంగ్రెస్ వెల్లడించిన ఆస్తులు రూ 167.35 కోట్ల నుంచి రూ 758.79 కోట్లకు చేరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎలెక్షన్ వాచ్‌లు తెలిపాయి. పదకొండేళ్ల వ్యవధిలో తృణమూల్ కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ 25 లక్షల ఏనుంచి ఏకంగా రూ 44.99 కోట్లకు ఎగబాకడం గమనార్హం. ఇక బీఎస్‌పీ ఆస్తులు సైతం భారీగా ఎగిశాయి.
ఈ పార్టీ ఆస్తుల విలువ పదకొండేళ్లలో రూ 43 కోట్ల నుంచి రూ 559 కోట్లకు పెరిగింది. ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీలు వెల్లడించిన డిక్లరేషన్‌ల ఆధారంగా వాటి ఆస్తుల విలువను ఈ సంస్థలు విశ్లేషించాయి.ఇదే కాలంలో సీపీఐ(ఎం) మొత్తం ఆస్తుల విలువ దాదాపు నాలుగు రెట్లు పైగా పెరిగింది. సీపీఐ(ఎం) ఆస్తుల విలువ రూయ 90.55 కోట్ల నుంచి రూ 437.78 కోట్లకు చేరిందని ఏడీఆర్ జాతీయ సమన్వయకర్త అనిల్ వర్మ చెప్పారు.
ఆస్తుల విలువ పెరుగుదల తక్కువగా నమోదైన రాజకీయ పార్టీల్లో సీపీఐ ముందువరసులో ఉంది. ఈ వ్యవధిలో సీపీఐ ఆస్తులు రూ 5.56 కోట్ల నుంచి రూ 10.18 కోట్లకు పెరిగాయని వర్మ పేర్కొన్నారు. ఈసీకి సమర్పించిన డిక్లరేషన్‌ల ఆధారంగా ప్రస్తుతం రూ 868 కోట్లతో బీజేపీ, రూ 557 కోట్లతో బీఎస్‌పీ, రూ 432 కోట్లతో సీపీఐ(ఎం) ఆస్తుల విలువలో టాప్ 3 పార్టీలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment