
కేజ్రీవాల్ కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాన్ని చేజిక్కించుకునే దిశగా కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాన్ని చేజిక్కించుకునే దిశగా కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఫోన్ చేసిన మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే మిమ్ముల్ని కలుస్తానని మోదీతో అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లతో ముందంజలో ఉంది. దాదాపు 62 స్థానాల్లో ఆప్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా.. ఆరు స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం ఆప్ వైపే మొగ్గుచూపింది. గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీ అవతరించినా.. ఈసారి మాత్రం ప్రతికూల ఫలితాలను చవిచూసింది.