గాంధీనగర్: గుజరాత్ శాసనసభ గురువారం రణరంగంగా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభలోనే బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఒక మహిళా మంత్రి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. అనంతరం ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులను స్పీకర్ రమణ్‌లాల్ ఓరా బడ్జెట్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు.రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జునాగఢ్, అమ్రేలి జిల్లాల్లో గత రెండేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులెందరో చెప్పాలని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ధనాని కోరారు.
ఆ కాలంలో ఈ జిల్లాల్లో రైతులెవరూ ఆత్మహత్యలే చేసుకోలేదని వ్యవసాయ మంత్రి చిమన్ చెప్పారు. ఈ సమాధానంతో విభేదించిన ధనాని వెంటనే లేచి మంత్రి సీటు వద్దకు వెళ్లారు. మంత్రి అబద్ధం చెబుతున్నారనీ, రాష్ట్ర హోం శాఖ లెక్కలప్రకారం 400 మంది రైతులు చనిపోయారని అన్నారు. చిమన్ మంత్రితో గొడవ పడుతుండగానే, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్‌దేవ్‌జీ ఠాకూర్ మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం జరిగిన తోపులాటలో ఇద్దరు ఎమ్మెల్యేలు, మహిళా మంత్రి నిర్మలా వాధ్వానీ గాయపడ్డారు.