సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటింబోమని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న బీజేపీ నాయకులు ఆందోళనలో పడిపోయారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నందుకు ఆ పార్టీ నాయకులందరూ ఆనందంలో ఉన్నారు. శాసనసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. కాని మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికలకు ముందు ప్రకటించబోమని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రకటనతో ముఖ్యమంత్రి పదవి కోసం ఉవ్విళూరుతున్న నాయకులంతా అవాక్కయ్యారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో శివసేన, బీజేపీ కూటమిలో బీజేపీకే అత్యధిక స్థానాలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్నికలకు ముందే బీజేపీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇదే తరహాలో శాసన సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని స్థానిక బీజేపీ నాయకులు అధిష్టానానికి సూచించారు.
గోపినాథ్ ముండే అకాల మరణంతో బీజేపీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే వారి సంఖ్య మరింత అధికమైంది. అంతేగాక కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ మద్దతుదారుల పేర్లు ప్రకటించడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ బయటకు తెలియకుండా పోటీపడుతూనే ఉన్నారు. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో పర్యటించారు. ఆ సమయంలో కొందరు కీలక నాయకులతో శాసన సభ ఎన్నికల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి పదవి రేసులో పలువురు ఉన్నట్లు తనకు తెలిసిందని మోడీ అన్నారు.
అయితే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు చేయబోమని కుండ బద్దలు కొట్టారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకుంటామని ఆ తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేశారు. త్వరలో నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మహారాష్ట్ర ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిచి తీరాల్సిందే. లేనిపక్షంలో మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే ప్రమాదం ఉంది. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బీజేపీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల తర్వాతే..
Published Fri, Jul 25 2014 11:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement