
బీజేపీకి వ్యతిరేకంగా ఇళ్లకు పోస్టర్లు
తిరువనంతపురం : జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో బాలికపై జరిగిన హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా నిరసన సెగలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో బీజేపీపై పూర్తి వ్యతిరేకత మొదలైంది. ఎంతలా ఉంటే.. మా ఇంటికి ఓట్లు అడిగేందుకు రావొద్దు.. అసలే బాలికలు, అమ్మాయిలు ఉన్నారని నేరుగా ఇంటికే బోర్డులు తగిలించారు.
కేరళలోని ఛెగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సీపీఐ (ఎం) ఎమ్మెల్యే కేకే రాంచంద్రన్ నాయర్ మృతిచెందడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కశ్మీర్, కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారికి కొన్ని మృగాలు డ్రగ్స్ ఇచ్చి కొన్నిరోజులపాటు అత్యాచారం చేయడంతో పాటు దారుణహత్య చేయడం కలకలం రేపుతోంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ భాగస్వాములుగా జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు జరుగుతాయని కేరళ ప్రజలు భగ్గుమంటున్నారు.
'మా ఇంట్లో బాలికలున్నారు. బీజేపీ నేతలు ఓట్లు అడిగేందుకు మాత్రం మా ఇంటికి రావొద్దు. మీకు ఓట్లడిగే అర్హతే లేదని' ఛెగన్నూర్ స్థానికుల ఇళ్ల వద్ద, సీపీఐ (ఎం) కార్తకర్తల నివాసాలకు ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆత్మరక్షణధోరణిలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు కసరత్తులు చేస్తున్నాయి. ఛెగన్నూర్ ఉప ఎన్నికే తమకు తొలి పరీక్షగా భావిస్తున్నాయి. అలప్పుఝాలోని ఛెగన్నూర్‌ను టెంపుల్ టౌన్‌గా ప్రసిద్ధి.
Comments
Please login to add a commentAdd a comment