
కిరణ్ బేడీ ఎంపిక బీజేపీ చేసిన తప్పా?
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది.
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వచ్చే వరకూ బీజేపీ పరిస్థితి బాగానే కనిపించనప్పటికీ.. కిరణ్ బేడీ ఎంపికతోనే పార్టీ ఢీలా పడిందనేది ప్రధానంగా వినిపిస్తోంది.
ఆ పార్టీ చేసింది చిన్నపాటి తప్పుగానే కొందరు చెబుతున్నప్పటికీ.. వెనక్కి తీసుకోలేనంత తప్పుగా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లాంటి చిన్న ఎన్నికను బీజేపీ భారీగా ఎంచుకోవడం ఆ వ్యూహాలు బెడిసి కొట్టాయనే ప్రధానంగా వినిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడ్డ దళిత, మైనార్టీల ఓట్లను ఈసారి ఆప్ దక్కించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ఓట్లను బీజేపీ దక్కించుకోవడంలో పూర్తిగా విఫలం కావడంతోనే సర్వేలు ఆప్ కు అనుకూలంగా వచ్చాయనేది సర్వేల సారాంశం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఆప్ 31-39 వరకూ సీట్లు గెలుచుకునే ఆస్కారం ఉందని టైమ్స్ నౌ తన సర్వేలో పేర్కొంది. బీజేపీ 27-35 సీట్లను గెలుచుకుని రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలపగా, కాంగ్రెస్ పార్టీ 2-4 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 36 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంది.