పట్నా: బీహార్ సంక్షోభానికి తెరపడ్డట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో తన తన మెజార్టీ నిరూపించువాల్సిన మాంఝీ రాజీనామా చేసిన నేపథ్యంలో నితిష్ తిరిగి ఫామ్ లో కొచ్చారు.
రాజీనామా చేసి తప్పు చేశాను క్షమించండి అంటూ బీహార్ ప్రజలను వేడుకొన్నారు. మళ్ళీ ఇలాంటి తప్పుచేయను.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవచేస్తానన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి నివ్వాల్సిందిగా గవర్నర్ కోరామని, ఆయన ఆహ్వానం కోసం చూస్తున్నామని నితీష్ వెల్లడించారు.
మరోవైపు మొత్తం పరిణామాలకు బీజేపీ వైఖరే కారణమంటూ మండిపడ్డారు నితీష్. తమ పార్టీని విచ్ఛిన్నం చేసి, బీహార్ లో తమ పార్టీని లేకుండా చేయాలని చూసిందని మండిపడ్డారు. కానీ బీజేపీ ఎత్తులు పారలేదన్నారు. అసలు మాంఝీ ముందే రాజీనామా చేసి ఉంటే.. బీజేపీ బండారం ఇంకా బాగా బట్టబయలయ్యి ఉండేదన్నారు. . అంతేకాదు.. మాంఝీని బలపరుస్తూ బీజేపీ తప్పుచేసిందటూ వ్యాఖ్యానించి, తమకు మద్దతిచ్చిన శివసేనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.