మాల్యాకు రుణాలిప్పించింది వారే..
మన్మోహన్, చిదంబరంలపై బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ సంచలన అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీకి యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరంలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సాయం చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలను మన్మోహన్, చిదంబరంలు కొట్టిపడేశారు.
మన్మోహన్‌కు మాల్యా లేఖలు
కింగ్‌ఫిషర్‌కు అప్పులు ఇప్పించేందుకు జోక్యం చేసుకోవాలంటూ మాల్యా.. మన్మోహన్‌కు లేఖలు రాశారని, తర్వాత ఆ కంపెనీకి రుణాలు అందాయని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ‘2011 నవంబర్ 14న అలాంటి ఒక లేఖ రాసిన తర్వాత.. కింగ్‌ఫిషర్ ఇబ్బందులనుంచి గట్టెక్కేందుకు మార్గాలు అన్వేషించాలని మన్మోహన్ మీడియాతో చెప్పారు.. బ్యాంకుల నుంచి నిధులు విడుదల చేయించాలని మాల్యా మరో లేఖ రాశారు. కింగ్‌ఫిషర్.. డియాజియో కంపెనీతో ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నప్పుడు.. ఎస్‌బీఐ నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు జోక్యం చేసుకోవాలని మాల్యా 2013 మార్చిలో చిదంబరానికి లేఖ రాశారు. మాల్యాకు అప్పులు ఇప్పించేలా చేసిన అవినీతి చేతులు చిదంబరం, మన్మోహన్‌లవే. ఇందులో 10, జన్‌పథ్(సోనియా నివాసం) పాత్ర కూడా ఉందా?’ అని పాత్రా అన్నారు.
ఆర్థిక వ్యవస్థ బాగా లేదు
భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిశోధన విభాగం తయారు చేసిన ‘రియల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ 2017’ డాక్యుమెంట్‌ను ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విడుదల చేసి ప్రసంగించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో లేదన్నది స్పష్టం. ఐఎంఎఫ్ కూడా మన స్థూల జాతీయోత్పత్తి(జడీపీ) వృద్ధి రేటును తగ్గించింది. అది 7.6 శాతంగా కాకుండా 6.6 శాతం కంటే తక్కువగా నమోదవనుంది’ అని అన్నా రు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్న జీడీపీ లెక్కలు సందేహాస్పదమన్నారు.