కారు వాడకంపై వెనక్కుతగ్గిన మాజీ సీఎం
బెంగళూరు:
ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే.. లగ్జరీ కారులో పర్యటనలేంటని తీవ్రవిమర్శలు రావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెనక్కు తగ్గారు. మాజీ మంత్రి, తన విధేయుడు, వ్యాపారవేత్త మురుగేష్ నిరాణి తనకు అందజేసిన లగ్జరీ కారును తిరిగి ఇచ్చేశారు. ట్రైన్ లలో ప్రయాణించి కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు.
కర్ణాటక బీజేపీ చీఫ్గా ఇటీవల పగ్గాలు చేపట్టిన బీఎస్ యడ్యూరప్ప కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు మురుగేష్ నిరాణి రూ.1.15కోట్ల ఖరీదైన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. 73 ఏళ్ల యడ్యూరప్ప రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఖరీదైన కారును సమకూర్చానని నిరాణి తెలిపారు.