
ఎన్నికల కోసం బీజేపీ ‘వార్’ రూమ్
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాల సమన్వయం కోసం బీజేపీ ‘వార్’ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాల సమన్వయం కోసం బీజేపీ ‘వార్’ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీన్ని సోమవారం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ నాయకత్వంలో ఈ కేంద్రం రోజుకు 24 గంటలూ పనిచేస్తుంది. బీజేపీకి ఇదే తొలి వార్ రూం. కాంగ్రెస్ ఇప్పటికే నగరంలో ఇలాంటి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కాగా, యూపీఏ సర్కారు పాలనలో ధరల పెరుగుదల, కుంభకోణాలపై ప్రచార పుస్తకాలను వెంకయ్య.. వార్ రూమ్ ప్రారంభ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సీఎం కిరణ్‌పై చర్యలేవీ? జవదేకర్
ఆంధ్రప్రదేశ్ విభజనపై సంప్రదాయాలను పాటించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు పంపి క్రమశిక్షణను ఉల్లంఘించిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రకాశ్ జవదేకర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సొంత పార్టీ సీఎం లేఖలు పంపినా చర్యలు తీసుకునేవారే లేరని, కాంగ్రెస్ సంస్కృతికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని పునరుద్ఘాటించారు.