ఒవైసీ దేశద్రోహి.. నాలుక కట్ చేస్తే కోటి ఇనాం
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన నాలుక కట్ చేస్తే రివార్డు ఇస్తామని ప్రకటించిన ఏబీవీపీ నేతకు.. మరో బీజీపీ నేత తోడయ్యారు. భారతమాతకు జై అని పలకడానికి నిరాకరించిన అసద్ నాలుకను ఎవరైనా కట్ చేస్తే వారికి కోటి రూపాయల ఇనాం ఇస్తానని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది ప్రకటించారు.
భారతమాతకు జై పలకడానికి అభ్యంతరమున్న ఒవైసీ ఒక దేశద్రోహి అని అభిప్రాయపడ్డారు. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పని చేసినవారికి ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తానంటూ వ్యాఖ్యానించి మరో సంచలనం సృష్టించారు. మరోవైపు ఢిల్లీ అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ నివాసం దగ్గర 'దేశద్రోహి' అనే పోస్టర్లు వెలిశాయి.
'నా పీకపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను' అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. లాతూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కొత్త తరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలన్న ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మాటలు అన్నారు. అటు 'భారత్ మాతాకీ జై' అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది.