లక్నో: బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు, ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో ఒకటి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. హంతకులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వివరాలు.. బులంద్‌షహర్‌లోని ఓ సంస్థ జూలై 14 న ‘ప్రధాన్ మంత్రి జాన్ కళ్యాంకరి యోగి జాగ్రుక్తా అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ముఖ్య అతిథిగా బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు అనిల్ సిసోడియాను ఆహ్వానించింది. అనంతరం సంస్థ సభ్యులకు సిసోడియా చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ క్రమంలో శిఖర్ అగర్వాల్ అనే వ్యక్తికి కూడా సిసోడియా సర్టిఫికెట్ అందజేశారు. 2018లో యూపీలో సంచలనం సృష్టించిన పోలీసు అధకారి హత్య కేసులో శిఖర్ అగర్వాల్ నిందితుడిగా ఉన్నాడు. సిసోడియా, అగర్వాల్‌ను సంస్థకు జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సర్టిఫికెట్ అందజేసిన ఫోటో సోషల్ మీడయాలో తెగ వైరలయ్యింది. దాంతో నేరస్తులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూన్నాయి. (పరిమళించిన మానవత్వం)
వివాదం కాస్తా పెద్దది కావడంతో సిసోడియా దీనిపై స్పందించారు. ఓ స్థానిక సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని.. ఈ కార్యక్రమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష‍్టం చేశారు. 2018లో బులంద్‌షహర్‌లో గోహత్య పుకార్ల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. దాంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌పై నిందితులు దాడి చేశారు. ఆయన చేతి వెళ్లను నరికి.. తలపై కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసు వాహనంలో వేసి.. పొలాల్లో వదిలేశారు.. ఈ దారుణానికి పాల్పడిన వారిమీద కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో శిఖర్ అగర్వాల్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. సర్టిఫికెట్ అందుకోవడం వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment