రైతులపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబయి: రైతుల ఆత్మహత్యలపై ఓ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఓ ఫ్యాషన్ ట్రెండ్గా మారిపోయిందని అన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన రైతు కుటుంబాలకు పోటీలుపడి నష్టపరిహారం చెల్లిస్తుంటే ఆత్మహత్యలు చేసుకోరా అన్నతీరుగా ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పలు కార్యక్రమాల ఆవిష్కరణ కోసం ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయి.
ఉత్తర ముంబయి నుంచి ఎంపీగా ఎన్నికైన గోపాల్ శెట్టి అనే వ్యక్తి మీడియాతో మాట్టాడుతూ 'అన్ని రైతు ఆత్మహత్యలు ఆకలితోనో, పనిలేకనో చోటుచేసుకున్నవి కాదు. అదొక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య రైతు కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. మరో రాష్ట్రం రూ.7లక్షలు, ఒంకో రాష్ట్రం 8.లక్షలు.. ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కుటుంబాలకు డబ్బులు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి' అని అన్నారు.
మహారాష్ట్రలోని సెహోర్లో ప్రధాని మోదీ నేడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఈ పథకానికి గత జనవరిలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమం కోసమే జరగనున్న నేటి ప్రధాని పర్యటనకు ముందు రైతుల గురించే ఆ పార్టీకి చెందిన ఎంపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది.