సాక్షి, న్యూఢిల్లీ : మహా ఉప్పెనలా నాసిక్ నుంచి ముంబై నగరానికి 35 వేల మంది రైతులు తరలివచ్చిన ఆ మరుసటి రోజే అంటే సోమవారం నాడు వారంతా రైతులు కాదని, వారిలో 95 శాతం మంది ఆదివాసీలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అయితే వారికి అటవి భూములపై హక్కులు కల్పించాల్సి ఉందన్నారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ అదే అసెంబ్లీలో మాట్లాడుతూ.. రైతులు స్వచ్ఛందంగా ఈ నిరసన ప్రదర్శన జరపలేదని, అదంతా ‘అర్బన్ మావోయిజం’ ప్రభావం అని అన్నారు. అంటే మవోయిస్టుల ప్రోద్బలంతో రైతులు నాసిక్ నుంచి ముంబై నగరానికి ప్రదర్శన జరిపారన్న మాట.
దేశంలోని పలు నగరాల్లో ఈ అర్బన్ మావోయిజం ఎక్కువ ఉందని, ఆయా నగరాల్లో దీన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు లేదా ఎఫెక్టెడ్ ఏరియా అని పిలుస్తున్నారని కూడా పూనమ్ తల్లి విడమరిచి చెప్పారు. నాసిక్, థానే ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేదన్న విషయం ఆమెకు తెలియదు పాపం! ఈ విషయం గ్రహించని సంఘ్ పరివారం సోషల్ మీడియాలో పూనమ్, ఫడ్నవీస్ వ్యాఖ్యలకు తెగ ప్రచారం కల్పించారు.
రైతుల సమ్మె వల్ల ముంబై నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని కూడా ఆరోపించారు. గతేడాది రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ముంబై నగరంలో ప్రదర్శనలు జరిపారు. ఆ నాడు వారి వెనక నక్సలైట్లు ఉన్నారా? నిన్న రైతుల సమ్మెలో కూడా మరాఠాలు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఆదివాసీలు కూడా ఉన్నారు.
కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా 2007 నుంచి రైతులు రాష్ట్రంలో దుర్భర జీవితాలను అనుభవించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏటా కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతేడాది జనవరి ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు రాష్ట్రంలో 2,414 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని ఆరు డివిజనల్ కమిషనరేట్లే ఈ ఆత్మహత్యలను లెక్కగట్టాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గత జూన్ 24వ తేదీన రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో రుణాల మాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 46,52 లక్షల మందని, వారి రుణాల మాఫీకి 34,022 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు 35 లక్షల మంది రైతుల రుణాల మాఫీకి విడుదల చేసిన మొత్తం 13,530 కోట్ల రూపాయలు మాత్రమే. ఆధార్ కార్డు లేదని కొందరికి, ఇద్దరు ముగ్గిరికి ఒకే ఆధార్ నెంబరుందన్న ఆరోపణలపై మరికొందరు రైతుల రుణాల మాఫీకి ప్రభుత్వం నిరాకరించింది. భార్యా పిల్లలను రోడ్డున పడేసిన రైతుల అత్మహత్యలను భరించలేక, కడుపు తరుక్కుపోయి రోడ్డెక్కారు. ఎక్కువ మంది రైతులు మార్గమధ్యంలో చేరడం చూస్తుంటేనే వారంతా స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు స్పష్టం అవుతోంది. అన్న దాతల పట్ల వ్యర్థ మాటలు అనర్థం.
Comments
Please login to add a commentAdd a comment