సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిపిన సమావేశం ఎన్నికల వైపే మొగ్గుచూపినప్పటికీ తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో ఈ అంశంపై బీజేపీ మరోమారు సమావేశం కానుంది. ప్రధానమంత్రి నిర్వహించిన సమావేశంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలన పరిగణనలోకి తీసుకోవాలనేఅభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా ? అనే అంశంపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు అమిత్ షా సలహా మేరకు తీసుకోవాలని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఈ నెల జూలై 25న బీజేపీ మరోమారు ఈ విషయాన్ని చర్చించనుందని అంటున్నారు.
అయితే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకుండా సమావేశాల పేరుతో తాత్సారం చేస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు కంటే ఎన్నికలు జరిపించడమే మేలని అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చినప్పటికీ దానిని బహిరంగంగా ప్రకటించడం లేదని వారంటున్నారు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చిచెప్పినట్లయితే వెంటనే శాసనసభను రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాలతో పాటు అక్టోబర్‌లో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీలో రాజకీయ వాతావరణం తమకు అంత అనుకూలంగా లేదని, విద్యుత్, నీటి సమస్యల కారణంగా ప్రజలు బీజేపీ పట్ల కొంత కినుకతో ఉన్నారని, అందువల్ల ఢిల్లీలో రాష్ట్రపతిపాలనను మరికొంతకాలం పొడిగించి వచ్చే సంవత్సరారంభంలో ఎన్నికలు జరిపించాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఏమిజరగనుందనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
25న బీజేపీ సమావేశం
Published Wed, Jul 23 2014 10:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement