'తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి' | PM Modi Video Conferrence With State Chief Ministers In Delhi | Sakshi
Sakshi News home page

'తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి'

Published Thu, Apr 2 2020 4:08 PM | Last Updated on Thu, Apr 2 2020 7:17 PM

PM Modi Video Conferrence With State Chief Ministers In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ.. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాలని పేర్కొన్నారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలు ధార్మిక సంస్థల నేతలతో చర్చించాలన్నారు.
(ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసల వర్షం)

రెండో దశలో వేగంగా విస్తరించే అవకాశం ఉంది :
రెండో దశలో కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాలని తెలిపారు. దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్, ఎన్ఎస్ఎస్, ఆయుష్ డాక్టర్లను రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిధులు వస్తున్న నేపథ్యంలో బ్యాంకుల వద్ద గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  రైడ్ షేరింగ్ అప్లికేషన్ ద్వారా ధాన్యాలను సేకరించే అవకాశం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పంట కోతల సమయం కనుక రైతులకు కొన్ని మినహాయింపులతో వారు పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారిని గుంపులుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.
(‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం)

ఈ సందర్భంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ద్వారా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లను గుర్తించి వాటిని ఎన్‌ సర్కిల్‌ చేయాలన్నారు. ఏంచుకొన్న హాట్‌స్పాట్స్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సీఎంలు తెలిపారు. దేశంలో ఉన్న వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విన్నవించారు. దీంతోపాటు ఆర్థిక వనరుల అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నాయ‌క‌త్వానికి ప్రస్తుత సంక్షోభ స‌మ‌యంలో వారి మ‌ద్దతు,  నిరంత‌ర మార్గనిర్దేశనం చేసినందుకు సీఎంలు కృత‌జ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ వంటి సాహ‌సోపేత నిర్ణ‌యాన్ని స‌కాలంలో తీసుకోవడం మంచి పరిణామంటూ అభినందించారు. ఈ నిర్ణయం దేశంలో వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టడానికి ఉప‌క‌రించింద‌న్నారు.

సామాజిక‌దూరం పాటించేలా చేయ‌డం, అనుమానిత కేసుల గుర్తింపు, నిజాముద్దీన్ మ‌ర్కజ్‌ ప‌రిణామాల నేప‌థ్యంలో అనుమానిత కేసుల గుర్తించి వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించేలా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. క‌మ్యూనిటీ స్థాయిలో వైర‌స్ వ్యాపించ‌కుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు కృషిని వారు వివ‌రించారు. అలాగే వైద్య మౌలిక స‌దుపాయాల పెంపు, వైద్య సిబ్బంది పెంపు,టెలి మెడిసిన్ స‌దుపాయం, మాన‌సిక వైద్య కౌన్సిలింగ్ స‌దుపాయం, ఆహారం, ఇత‌ర నిత్యావ‌స‌రాల‌ను అవ‌స‌ర‌మైన  వారికి పంపిణీ, వ‌ల‌స‌కూలీల ర‌క్షణకు తీసుకుంటున్న చర్యలను వారు వివ‌రించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎద‌ర్కొనేందుకు ఆర్థిక‌, వైద్య‌, త‌దిత‌ర వ‌న‌రులను స‌మీకరించాల్సిన ప్రాముఖ్యత గురించి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీ వద్ద ప్రస్తావించారు.

భౌతిక దూరం పాటించడమే లక్ష్యం :
భౌతిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడగలమన్నారు. కోవిడ్-19 పై పోరాటంలో స‌మ‌న్వయంతో కూడిన చ‌ర్యల ప్రాధాన్యతను ప్రధాన‌మంత్రి వివ‌రించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ విభాగాలు ఒకే ప‌నిని ప‌లువురు చేసే ప‌రిస్థితుల‌ను నివారించేందుకు జిల్లాల‌లో సంక్షోభ  నియంత్రణ గ్రూప్‌ల‌ను, జిల్లా నిఘా అధికారుల‌ను  ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రధాని తెలిపారు. ప‌రీక్షల నిర్వహణకు గుర్తింపు క‌లిగిన సంస్థల నుంచి గణాంకాలు తీసుకోవాల‌ని సూచించారు. దీనివ‌ల్ల ఆయా జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్ర గ‌ణాంకాల మ‌ధ్య ఏక‌రూప‌త ఉంటుంద‌న్నారు.

ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన ద్వారా కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement