పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..! | BJP releases poster in UP depicting Yogi Adityanath as lord Ram on his 44th birthday | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..!

Published Sun, Jun 5 2016 3:41 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..!

పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..!

గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం మరోసారి వివాదాస్పద పోస్టర్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను రాముడిగా చూపిస్తూ, ఇతర పార్టీల నేతలను రావణుడి తలలుగా ప్రదర్శిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయనడంలో సందేహమే లేదు. బీజేపీ టౌన్ హాలులో కేక్ కట్ చేసి ఎంపీ పుట్టినరోజు నిర్వహించి, ఆ వెంటనే వివాదాస్పద పోస్టర్ ను విడుదల చేశారు.

ఎంపీ యోగి ఆదిత్య నాథ్ రాముడి రూపంలో ఉండగా, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్, ఏఐఎంఐఎం, జేడీయూ, ఎస్పీ పార్టీలను రావణుడిగా పేర్కొనేలా తలలపై పార్టీల పేర్లు ముద్రించారు. యూపీ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. నేడు ఎంపీ ఆదిత్య నాథ్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాం, కేక్ కట్ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ పరిస్థితి ఏంటన్నది గ్రహించాలని, వచ్చే ఎన్నకల్లో విజయం బీజేపీదేనని తెలియజేసేందుకు ఆయా పార్టీలను రావణుడితో పోల్చి చూపించామని పేర్కొన్నారు.

ఇటీవల రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం ఒకటి గోడ పత్రికలు అంటించింది. ఒక్క రాహులే కాదు.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొంటూ..  బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణిస్తూ పోస్టర్ విడుదల చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement