బీజేపీపై అమెరికా నిఘా!
2010లో ఎన్‌ఎస్‌ఏకు
అనుమతినిచ్ఛిన ఆ దేశ కోర్టు
193 దేశాలు, ప్రఖ్యాత సంస్థలపైనా..
వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా పెద్దన్న పోకడ మరోసారి బహిర్గతమైంది. ప్రపంచదేశాలపై ఆధిపత్యం కోసం ఏమైనా చేసే అమెరికా.. ఆయా దేశాల ప్రభుత్వాల పైననే కాదు.. అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలపైన కూడా ‘దృష్టి’ పెడ్తుందన్న విషయం తాజాగా వెల్లడైంది. భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీతో పాటు ఇతర దేశాల్లోని మరో ఐదు రాజకీయ పార్టీలపై నిఘా పెట్టేందుకు 2010 సంవత్సరంలో అమెరికా జాతీయ భద్రత సంస్థ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ-ఎన్‌ఎస్‌ఏ)కు అక్కడి ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ కోర్టు అనుమతించిందంటూ తాజాగా వెల్లడైన వార్త సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, భారత్ సహా 193 దేశాల ప్రభుత్వాల పైన.. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ అణుశక్షి సంస్థ(ఐఏఈఏ)ల వంటి అంతర్జాతీయ సంస్థలపైనా నిఘా పెట్టేందుకు ఎన్‌ఎస్‌ఏకు ఆ కోర్టు అనుమతించింది.
కోర్టు అనుమతి ద్వారా తమ మిత్రదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాల సమాచారం సేకరించేందుకు ఎన్‌ఎస్‌ఏకు అధికారం లభించినట్లైంది. అమెరికా దుశ్చర్యలను ఇప్పటికే పలుమార్లు ‘లీక్’ చేసి యూఎస్ కంటిలో నలుసుగా మారిన ఎడ్వర్డ్ స్నోడెన్‌నే ఈ తాజా సమాచారం వెనక ఉండటం విశేషం. స్నోడెన్ అందించిన వివరాలతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం.. బీజేపీతో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ముస్లిం బ్రదర్‌హుడ్(ఈజిప్ట్), నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్(ఈజిప్ట్), అమాల్(లెబనాన్), బొలివరియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్ ఆఫ్ వెనుజులా పార్టీలపై నిఘా పెట్టడానికి ఎన్‌ఎస్‌ఏ అనుమతి పొందింది. ఈ వార్తలపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో చేపట్టనున్న అమెరికా పర్యటన పైనా ఈ వార్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. సెప్టెంబర్‌లో మోడీ అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
బీజేపీ పైనే ఎందుకు?
2010లో కాంగ్రెస్ అధికార పార్టీ. అంతకుముందు ఏడాదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. కానీ, కాంగ్రెస్‌ను కాదని, ఇతర పార్టీలన్నింటినీ వదిలేసి అధికారంలో లేని, అధికారంలోకి వస్తుందనే ఆలోచన కూడా ఎవరికీ లేని బీజేపీని అమెరికా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.