బీజేపీకి 705 కోట్లు.. కాంగ్రెస్‌కు 198 కోట్లు
గత నాలుగేళ్లలో కార్పొరేట్ కంపెనీల విరాళాలు
న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో బీజేపీ పార్టీకే అత్యధికంగా కార్పొరేట్ కంపెనీల విరాళాలు అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. దేశంలోని జాతీయ పార్టీలకు నాలుగేళ్లలో రూ. 956.77 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు విరాళాలుగా ఇవ్వగా.. ఇందులో అత్యధికంగా 73 శాతం (రూ. 705.81 కోట్లు) నిధులు బీజేపీకే అందాయని పేర్కొంది. 2012–13 నుంచి 2015–16 వరకు ఈ మొత్తం ఆయా పార్టీలకు చేరినట్లు తెలిపిన ఏడీఆర్.. బీజేపీకి 2,987 కార్పొరేట్ సంస్థల నుంచి ఈ మొత్తం అందిందని వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీకి 167 సంస్థల నుంచి రూ. 198.16 కోట్లు అందినట్లు.. ఎన్నికల సంఘం అందించిన వివరాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఎన్సీపీకి రూ. 50.73 కోట్లు, సీపీఎంకు రూ.1.89కోట్లు, సీపీఐకి రూ. 18 లక్షలు విరాళాలుగా అందాయి. 1,546 మంది దాతల నుంచి జాతీయ పార్టీలకు వచ్చిన 355.08 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరు విరాళాలు ఇచ్చారనే వివరాల్లేవు. ఇలాంటి వాటిలో బీజేపీకి వచ్చిన వాటిలో రూ. 159.59 కోట్ల విరాళాల్లో 99 శాతం నిధులకు పాన్ నంబర్లు, చిరునామాలు వెల్లడించలేదని ఏడీఆర్ తెలిపింది. ఏ ఒక్కరి నుంచి కూడా రూ. 20వేల కన్నా ఎక్కువ మొత్తం స్వచ్ఛంద విరాళంగా అందనందున బీఎస్పీని ఈ జాబితాలో చేర్చలేదని ఏడీఆర్ తెలిపింది.
‘గత నాలుగేళ్లలో ఐదు జాతీయ పార్టీలకు రూ.1,070.68 కోట్ల విరాళం అందింది. ఇందులో రూ. 956.77 కోట్లు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిందే’ అని సంస్థ పేర్కొంది. 2004–05 నుంచి 2011–12 వరకు (ఎనిమిదేళ్లలో) జాతీయ పార్టీలకు రూ. 378.89 కోట్ల విరాళం అందిందని ఏడీఆర్ గుర్తుచేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి రూ.20వేల కన్నా ఎక్కువగా చేసే విరాళాల వివరాలు ప్రకటించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ దాతల వివరాలను, అందిన మొత్తాన్ని ఈసీకి అందజేశాయి. 2014–15 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ పెద్దమొత్తంలో జరిగిందని కూడా ఏడీఆర్ వెల్లడించింది. ఆ సమయంలోనే బీజేపీకి ఎక్కువ విరాళాలు అందాయని పేర్కొంది.