
జార్ఖండ్‌లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు పాదపూజ చేస్తున్న కార్యకర్త
పాదపూజను సమర్ధించుకున్న బీజేపీ ఎంపీ
రాంచీ : జార్ఖండ్‌కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు పార్టీ కార్యకర్త ఓ కార్యక్రమంలో పాదపూజ చేయడం వివాదాస్పదమైంది. వేలాదిమంది చూస్తుండగా పవన్ సింగ్ అనే కార్యకర్త ఎంపీ దూబే కాళ్లు కడిగి, ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తూ తాగడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనను సదరు ఎంపీ ఘనకార్యంలా తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వైఖరిని ఎంపీ సమర్ధించుకున్నారు. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతారని ప్రశ్నించారు. అతిధుల పాదాలను కడగటంలో తప్పేముందని అంటూ మహాభారతంలోని కథలను వినిపించారు. చవకబారు ఆలోచనలు చేయడం తగదని విమర్శకులకు చురకలు అంటించారు. కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ తప్పులేదని ఇది చరణామృతమని వ్యాఖ్యానించారు.