మెట్రో చార్జీలపై కదంతొక్కిన కమలం
ముంబై : మెట్రో రైలు చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు బుధవారం ఇక్కడి ఎంఎంఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బీజేపీ నగర అధ్యక్షుడు ఆశిష్ శేలార్ నాయకత్వంలో అనేకమంది బీజేపీ కార్యకర్తలు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎంఎంఆర్‌డీఏ) కార్యాలయం ఎదుట ధర్నాకు జరిపారు.
ప్రభుత్వం, రిలయెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఫలితంగానే చార్జీలు పెరిగాయని శేలార్ ఆరోపించారు. మెట్రో రైల్వేకు ఇటు ఎంఎంఆర్‌డీఏ, అటు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వాహక సంస్థలుగా ఉన్న సంగతి తెల్సిందే. రిలయన్స్ సంస్థ మొదటి నుంచీ చార్జీల పెంపును డిమాండ్ చేస్తోందని, ఇప్పుడు ప్రభుత్వం దానికి తలొగ్గిందని శేలార్ విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఇదివరకే భారీగా పెంచారని, నిజానికి ప్రభుత్వం రిలయన్స్ ఖాతాల తనిఖీకి ఆదేశించాలని సూచించారు.
ఈ వ్యాఖ్యను రిలయన్స్ ప్రతినిధి ఖండించారు. బీజేపీ కార్యకర్తలు ఎంఎంఆర్‌డీఏ కార్యాలయంలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, అందుకే వారిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వారిని హెచ్చరించి విడుదల చేశామని బీకేసీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కుండలిక్ నిగాడే చెప్పారు.
మెట్రో రైలు ప్రారంభమైన నాటి నుంచే చార్జీల వివాదం మొదలైంది. రాయితీ ఒప్పందం మేరకు చార్జీలు రూ.9-13 మధ్యనే ఉండాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కాగా ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చార్జీలను రూ.10 నుంచి రూ.40 మధ్య ఖరారు చేసింది. దీనిపై ఎంఎంఆర్‌డీఏ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. చార్జీల ఖరారుకు చార్జీల నిర్ధారణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని హైకోర్టు సూచించింది.