నల్లధనంపై పోరాడండి
యువతకు ప్రధాని పిలుపు
రోహతక్ (హరియాణా): నల్లధనం దేశాన్ని సర్వనాశనం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ నొక్కి చెప్పారు. కుల వివక్ష, అస్పృశ్యత, మహిళలపై వేధింపుల వంటి సామాజిక రుగ్మతలతో పాటు నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. సమాజానికి ఎంతో సాయం అందించిన యువతకు అభినందనలు తెలిపారు. యువతకు ఉన్న అపారమైన శక్తిని సరైన మార్గంలో నడపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత తప్పుదారి పట్టకుండా చూడాలన్నారు. నిరక్షరాస్యత అంతం, జడత్వం, వక్ర ఆలోచనలు, కులం, మహిళలపై వివక్ష, పర్యావరణంపై నిర్దయ వంటి ఆరు సామాజిక పరమైన అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘నల్లధనం దేశాన్ని ఎంతో నాశనం చేసింది.
ఇటీవలే దీనిపై పోరాటానికి పెద్ద నిర్ణయం తీసుకున్నాం. యువత కూడా దీనిపై తమ శక్తిని ధారపోయాలి’ అంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్కొన్నారు. గురువారం 21వ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ యువతకు తన సందేశాన్ని ఇచ్చారు. 35 ఏళ్ల లోపు ఉన్న దాదాపు 80 కోట్ల మంది దేశంలో సామాజిక మార్పులకు ఎంతో సాయం చేయగలరని పేర్కొన్నారు. సమష్టితత్వం (కలెక్టివిటీ), సంధాయకత (కనెక్టివిటీ), సృజనాత్మకత (క్రియేటివిటీ) (3సీ)లపై దృష్టి సారిస్తూనే సామాజిక రుగ్మతలపై పోరాడాలని చెప్పారు. సమష్టితత్వంతోనే వివక్షను రూపుమాపగలుగుతామన్నారు. కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ.. సాంకేతికత దూరాలను ఎంతగానో తగ్గించిందని, కొత్త ఆలోచనలు, కొత్త దృక్కోణాలు అవసరమని నొక్కి చెప్పారు.