నల్లధనంపై సుప్రీంకు సిట్ తొలి నివేదిక
న్యూఢిల్లీ: నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తొలి నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. నివేదికపట్ల సుప్రీంకోర్టు సంతృప్తిని కూడా వ్యక్తంచేసింది. తనకు అప్పగించిన బాధ్యతమేరకు సిట్ మరో రెండు నెలలు నల్లధనంపై దర్యాప్తును కొనసాగించి నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, నివేదిక పరిశీలనకు అనుమతించాలంటూ పిటిషనర్, సీనియర్ న్యాయవాది, రాంజెఠ్మలానీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, నివేదిక పూర్తిగా రహస్యమని స్పష్టంచేసింది. విదేశీ బ్యాంకులనుంచి నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించేందుకు మార్గాలను, పద్ధతులను సూచించేందుకు రాంజేఠ్మలానీ, ఆయన తరఫున న్యాయవాదులు సిట్‌తో స్వేచ్ఛగా సంప్రదింపులు జరపవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
కాగా, జర్మనీలోని బ్యాంకుల్లో న ల్లధనం దాచుకున్నవారి జాబితాలో ఒక మాజీ ప్రధాని పేరు ఉందని ఆరోపిస్తూ జేఠ్మలానీ రాసిన లేఖలకు సంబంధించి, జర్మనీ అధికారుల స్పందనపై కేంద్రం ప్రతిస్పందించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జెఠ్మలానీ తాను జర్మనీ అధికారులకు రాసిన లేఖలను అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్‌కే కౌల్‌కు అందజేయాలని కోరింది. నవంబర్ 11న తదుపరి విచారణ సందర్భంగా, ఈ లేఖలపై కౌల్ కోర్టుకు వాంగ్మూలం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నల్లధనాన్ని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జెఠ్మలానీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని గతంలోఏర్పాటు చేసింది.