‘నల్లధనం’పై చర్యలేవీ?
కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
ఈ విషయంలో 65 ఏళ్లుగా ప్రభుత్వం విఫలమవుతోంది
ఆదేశించి మూడేళ్లయినా సిట్‌ను ఏర్పాటు చేయలేదేం?
మీరు చర్యలు తీసుకోనందుకే..
మేం కల్పించుకుంటున్నాం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ అంశంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేయాలని ఆదేశించి మూడేళ్లయినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లధనాన్ని వెనక్కితీసుకురావడంలో ప్రభుత్వం 65 ఏళ్లుగా విఫలమవుతోందని వ్యాఖ్యానించింది. అందువల్లే తాము కల్పించుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకొనేందుకు నిరాకరిస్తూ... కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కొట్టివేసింది.
విదేశీ బ్యాంకుల్లో రూ. 70 లక్షల కోట్ల నల్లధనాన్ని కొందరు భారతీయులు దాచిపెట్టారంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ 2009లో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన సుప్రీంకోర్టు నల్లధనాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని 2011 జూలైలో ఆదేశించింది.
ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నల్లధనం అంశంపై ఇప్పటికే విచారణ జరిపిస్తున్నామని, అందుకోసం ప్రత్యేకంగా సిట్ అవసరం లేదని పేర్కొంది.
దానిపై తాజాగా బుధవారం మరోసారి సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
నల్లధనం అంశంపై దర్యాప్తు కోసం ఇద్దరు విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో సిట్‌ను ఏర్పాటు చేయాలని తాము ఆదేశించి మూడేళ్లు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని రప్పించడానికి గత అరవై ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడింది. అంతేకాకుండా విదేశీ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నవారి పేర్ల బయటపెట్టడంపై దృష్టిసారించలేదని పేర్కొంది