
శ్రీనగర్ : జమ్మూ బస్టాండ్ సమీపంలో ఓ బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. బస్సులో బాంబు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, బాంబు పేలుడు ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.
బస్సుపై గ్రనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ బస్టాండ్‌లోని బస్సులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, పోలీసు సిబ్బంది పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment