బ్లూవేల్ చాలెంజ్..ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: ప్రమాదకర ఆన్‌లైన్ గేమ్ 'బ్లూవేల్ ఛాలెంజ్'కు విద్యార్థులను దూరంగా ఉంచాలని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందాయి. ఈ గేమ్ ఆడుతూ పలువురు టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజ్య శిక్షా కేంద్రం(ఆర్‌ఎస్‌కే) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు ఈ మేరకు సోమవారం ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది.
రేడియేషన్ కారణంగాను, ఇతర అనర్థాలు జరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు వాడటాన్ని ఈ సంస్థ నిషేధించింది. బ్లూవేల్ చాలెంజ్ ను నేర ప్రవృత్తిగల వ్యక్తులు రూపొందించారని, ఇది ఆడడం అలవాటు ఉన్నవారు అందులోంచి బయటపడడం కష్టమని, ఈ గేమ్ బారిన పడి కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని ఆర్‌ఎస్కే తెలిపింది. విద్యార్థులు ఫోన్లు వాడకుండా చూడడం, వారి ఫోన్లలో బ్లూవేల్ గేమ్ లాంటివి ఏమైనా ఉంటే.. వెంటనే వాటిని తొలగించడం ఉపాధ్యాయుల బాధ్యత అని సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైనప్పుడు తమ పిల్లలపై నిఘా ఉంచి 'బ్లూవేల్ గేమ్'కు దూరంగా ఉంచాలని సూచించాలని నిర్దేశించింది.