Blue Whale Challenge
-
బ్లూవేల్ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!
పుణె : బ్లూవేల్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. స్వేచ్ఛా జీవిగా మారుతున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఉరిపోసుకున్నాడు. ఈ ఘటన పుణెలోని లోనిఖండ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాలు.. లోనిఖండ్లో కుటుంబంతోపాటు నివాసముండే దివాకర్ మాలి (20) ఆన్లైన్ గేమ్ బ్లూవేల్కి అడిక్ట్ అయ్యాడు. గంటల తరబడి గేమ్‌లోనే మునిగిపోయేవాడు. గేమ్‌లో భాగంగా టాస్క్‌ని పూర్తి చేసే క్రమంలో ఉరివేసుకుని బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్లో.. ‘బందీగా ఉన్న నల్ల చిరుతను విడిపించాను. దానికిక ఎటువంటి ఆంక్షలు ఉండవు. స్వేచ్ఛగా బతికేయొచ్చు.ఇది ముగింపు’ అని రాసి పెట్టాడు. మరో పేజీలో చిరుత బొమ్మ కూడా గీసి ‘సూర్యుడు మళ్లీ కాంతివంతమవుతాడు’అని మరాఠీ, ఇంగ్లిష్‌లలో రాశాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ‘బ్లూవేల్ చాలెంజ్’పూర్తి చేసే క్రమంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని చెప్పారు. తనను తాను నల్ల చిరుతగా భావించి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు. ఇంకెవరూ చావొద్దు.. ప్రపంచంతో సంబంధం లేకుండా దివాకర్ గంటల తరబడి మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడని ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు మొబైల్ వాడకానికి బానిసయ్యాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులందరికి విఙ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలు సెల్ ఫోన్ వాడకానికి అడిక్ట్ కాకుండా జాగ్రత్త పడండి. నా కొడుకులా ఇంకెవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దు’అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ‘బ్లూవేల్ చాలెంజ్’లో ఆటగాళ్లకు వివిధ టాస్క్‌లు ఇచ్చి నిర్ణీత సమయంలో పూర్తి చేయమంటారు. ఒంటికి గాయాలు చేసుకోవడం వంటి ప్రమాదకర టాస్క్‌లు కూడా ఉంటాయి. మరికొన్ని టాస్క్‌లు ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రేరేపిస్తాయి. మొబైల్ గేమ్‌లకు అడిక్ట్ అవడం ‘మానసిక రుగ్మత’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
డెడ్లీ గేమ్‌పై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ సూసైడ్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్' పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారులతోపాటు, యువత ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్‌ను నిషేధించలేమని కేంద్రం సోమవారం సుప్రీకోర్టుకు తెలిపింది ఎన్క్రిప్టెడ్ లింక్స్ ద్వారా ఒకరి-నుంచి మరొకరికి కమ్యూనికేట్ అవుతోందని..కనుక దీన్ని బ్యాన్ చేయడం కష్టమని సుప్రీం ముందు నివేదించింది. ఫేస్బుక్, గూగుల్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ఈ విషయంలో నిస్సహాయతను ప్రకటించాయని తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖాన్ వికార్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ముందు కేంద్ర తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపించారు. అనేకమంది యవతీ యువకుల ప్రాణాలను బలిగొన్న గేమ్‌ను బ్లాక్ చేయలేమంటూ కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేసింది. అనేకమంది శాస్త్రవేత్తలు, టెక్ నిపుణులు, ఇంటర్నెట్ , సోషల్ మీడియా కంపెనీలతో తీవ్రంగా చర్చించినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం అంతు చిక్కలేదని స్పష్టం చేసింది. ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ కమ్యూనికేషన్స్ లింక్స్ ద్వారా ఇది విస్తరిస్తోందని అందుకే ఈ గేమ్‌ను గుర్తించడం, అడ్డగించడం, విశ్లేషించడం కష్టంగా ఉందని తెలిపింది. రష్యాలో పుట్టి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్‌పై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. దీంతో ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం నిషేధ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. అలాగే ఈ డెడ్లీ గేమ్‌పై పూర్తి అవగాహన కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
'బ్లూవేల్' అలర్ట్: విద్యార్థులను దూరంగా ఉంచండి!
భోపాల్: ప్రమాదకర ఆన్లైన్ గేమ్ 'బ్లూవేల్ ఛాలెంజ్'కు విద్యార్థులను దూరంగా ఉంచాలని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందాయి. ఈ గేమ్ ఆడుతూ పలువురు టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజ్య శిక్షా కేంద్రం(ఆర్ఎస్కే) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు ఈ మేరకు సోమవారం ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. రేడియేషన్ కారణంగాను, ఇతర అనర్థాలు జరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు వాడటాన్ని ఈ సంస్థ నిషేధించింది. బ్లూవేల్ చాలెంజ్ ను నేర ప్రవృత్తిగల వ్యక్తులు రూపొందించారని, ఇది ఆడడం అలవాటు ఉన్నవారు అందులోంచి బయటపడడం కష్టమని, ఈ గేమ్ బారిన పడి కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని ఆర్ఎస్కే తెలిపింది. విద్యార్థులు ఫోన్లు వాడకుండా చూడడం, వారి ఫోన్లలో బ్లూవేల్ గేమ్ లాంటివి ఏమైనా ఉంటే.. వెంటనే వాటిని తొలగించడం ఉపాధ్యాయుల బాధ్యత అని సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైనప్పుడు తమ పిల్లలపై నిఘా ఉంచి 'బ్లూవేల్ గేమ్'కు దూరంగా ఉంచాలని సూచించాలని నిర్దేశించింది. -
'బ్లూవేల్' నిషేధంపై మీ వైఖరేంటి?
కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: బాలలు, యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ ‘బ్లూవేల్ చాలెంజ్’ ను పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మూడువారాల్లోగా 'బ్లూవేల్'ను నిషేధించే విషయమై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 'బ్లూవేల్' గేమ్‌పై న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ప్రతిని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు అందజేసింది. బ్లూవేల్ ఆట దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ వ్యక్తి బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్లైన్ గేమ్‌ను రూపొందించాడు. ఈ ఆటలో పాల్గొనే వారు 50 రోజుల పాటు వివిధ టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి టాస్క్‌గా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు బాలలు ఈ ఆట ప్రభావానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. -
బ్లూ వేల్ దెబ్బ.. అమ్మాయిలు పారిపోయారుగా...
సాక్షి, భోపాల్: మోస్ట్ డేంజరస్ గేమ్ బ్లూవేల్ మరోసారి భారత్‌లో తన ప్రభావాన్ని చూపించింది. అయితే ఈసారి అదృష్టవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. పోలీసులు అప్రమత్తం కావటంతో ఇద్దరు యువతులు సురక్షితంగా బయటపడ్డారు. ఆగ్రాలో తొమ్మిదో తరగతి ఇద్దరు విద్యార్థినిలు (14 ఏళ్లు) గత కొంతకాలంగా బ్లూవేల్ ఛాలెంజ్‌కు బానిసలయ్యారు. ఇప్పటికే రెండు లెవెల్స్ పూర్తి చేసిన ఆ ఇద్దరు.. తరువాతి లెవల్లో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. అదే ఇంటి నుంచి పారిపోవటం. మంగళవారం ఇద్దరు ఎంచక్కా తమ బ్యాగులు సర్దుకుని ఉదయం 8 గంటలకు పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ను ఎక్కేశారు. సెల్ ఫోన్ ట్రేస్ చేయటానికి వీల్లేకుండా స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారు. సాయంత్రం స్కూల్ సమయం ముగియటంతో తల్లిదండ్రులు కంగారుపడిపోతారని భావించిన ఓ యువతి తన ఫోన్ ను ఆన్ చేసి సోదరుడికి అసలు విషయం చెప్పేసింది. వెంటనే అతను వారిద్దరిని తర్వాతి స్టేషన్లో దిగిపోవాలని సూచించాడు. దీంతో ఇద్దరు బాలికలు మధ్యప్రదేశ్ లోని హోషంగబాద్ రైల్వే స్టేషన్లో దిగి, అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో వారిని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్‌కి సమాచారం అందించారు. వెంటనే శిశు సంరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని తమ వెంట తీసుకెళ్లి అసలు విషయాలను ఆరాతీశారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చాక వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేస్తామని సీడబ్యూసీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. గత నెలలో జైపూర్‌కు చెందిన ఇలాగే బ్లూవేల్ దెబ్బకు ఇంటి నుంచి పారిపోగా.. అతని సెల్ ఫోన్ ఆధారంగా ముంబై పోలీసులు అతన్ని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. -
బ్లూహె(వే)ల్: మరోసారి అఘాయిత్యం
జోధ్‌పూర్: ‘బ్లూవేల్’ భూతం సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రమాదకర బ్లూవేల్ ఇంటర్నేట్ గేమ్ యువత ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీని సవాల్‌కు స్పందించి ఇప్పటికే పలువురు చిన్న పిల్లలు, యువత ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి రెండోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోబోయింది. సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచింది. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ జవాను కూతురైన ఈ అమ్మాయి ‘బ్లూవేల్’ టాస్క్ పూర్తి చేసేందుకు సోమవారం అర్ధరాత్రి ఆమె చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడటంతో ఆపద తప్పింది. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ఈ ఉదంతం తర్వాత కూడా ‘బ్లూవేల్’ నుంచి ఆమె పూర్తిగా బయట పడకపోవడంతో తాజాగా మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. -
మళ్లీ పంజా విసిరిన బ్లూవేల్..!
సాక్షి, చెన్నై: ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ 'బ్లూవేల్ చాలెంజ్' ఈసారి తమిళనాడులో పంజా విసిరింది. చెన్నై తిరుమంగళానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి విగ్నేష్ బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మదురైలోని మన్నార్ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్న అతని చేతిపై వేల్ (తిమింగళం) గుర్తువేసి ఉంది. దానికింద బ్లూవేల్ అని రాసి ఉందని పోలీసులు ధ్రువీకరించారు. సాయంత్రం 4. 30 గంటల సమయంలో ఉరేసుకొని కనిపించిన విగ్నేష్ రాసిన లేఖ కూడా సంఘటనాస్థలంలో దొరికింది. 'బ్లూ వేల్.. ఇది గేమ్ కాదు ప్రమాదం. ఒక్కసారి ఎంటరైతే.. నువ్విక బయటపడలేవు' అని రాసి ఉంది. విగ్నేష్ తన ఫోన్లో బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం ప్రయత్నిస్తూ కనిపించేవాడని అతని స్నేహితులు తెలిపారు. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం యాప్కానీ, వెబ్సైట్ కానీ లేని నేపథ్యంలో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా అతను బ్లూవేల్ ఆడేందుకు ప్రయత్నించాడని, క్యూరేటర్ ద్వారా అతని టాస్కులు అందేవని స్నేహితులు అంటున్నారు. ఈ సమాచారాన్ని బట్టి తమిళనాడు తొలి బ్లూవేల్ మరణమని అనుమానిస్తున్నారు. బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌పై తమిళనాడు పోలీసులు ఇప్పటికే తల్లిదండ్రులను హెచ్చరించారు. కంప్యూటర్లు, మొబైల్ఫోన్లు వాడే పిల్లలపై ఓ కంట నిఘావేసి ఉంచాలని సూచించారు. ఏమిటీ బ్లూవేల్! బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఓ ఆన్లైన్ గేమ్. దీన్ని రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు. చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. క్రమంగా యూరప్, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. చదవండి: ‘బ్లూ వేల్ ఛాలెంజ్’కు బలవుతున్నారా? చదవండి: వామ్మో.. బ్లూ వేల్.! చదవండి: పెను సవాల్: 'బ్లూ వేల్'ను ఆపడం సాధ్యమేనా? -
బ్లూవేల్ గేమ్.. ఓ మృత్యు క్రీడ
అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్ - ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తున్న డేంజర్ - ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్య - 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ప్రభావం - తాజాగా భారత్‌లోనూ పంజా విసురుతున్న మృత్యు క్రీడ - గేమ్ ఆడుతూ ముంబైలో భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి - షోలాపూర్, ఇండోర్లలో మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం - గేమ్ సృష్టికర్త రష్యాకు చెందిన ఓ సైకాలజీ విద్యార్థి - పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్న నిపుణులు ముంబైలోని అంధేరీలో మన్‌ప్రీత్ సహాన్ అనే 14 ఏళ్ల విద్యార్థి ఓ భవనంపై నుంచి దూకేశాడు.. షోలాపూర్‌లో మరో 14 ఏళ్ల విద్యార్థి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి సుధీర్ స్కూల్ భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.. మూడూ వేర్వేరు ఘటనలు.. వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కారణం మాత్రం ఒకటే.. అదే ‘బ్లూవేల్ చాలెంజ్’.. ఓ సోషల్ మీడియా గేమ్.. సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ ఇది.. 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట చిన్నారులను హిప్నటైజ్ చేస్తుంది. భావోద్వేగాలతో పిల్లలను మృత్యుఒడిలోకి తోసేస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో ఇప్పటికే వందలాది మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న ఈ ఆట.. ఇప్పుడు భారత్‌లో పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ ప్రమాదకరమైన గేమ్ నుంచి రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ఏమిటి, పర్యవసానాలు, ప్రమాదాలు, జాగ్రత్తలపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్.. -సాక్షి, ముంబై/తెలంగాణ డెస్క్ ముంబైలోని అంధేరీకి చెందిన మన్‌ప్రీత్ సహాన్ అనే 14 ఏళ్ల బాలుడు బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ఆడుతూ జూలై 30న బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా శనివారం పశ్చిమబెంగాల్లో అంకన్ డే అనే విద్యార్థి తలకు ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. నిషేధించాలని ప్రధానికి లేఖ.. అత్యంత ప్రమాదకరమైన బ్లూవేల్ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అమాయక పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం లేఖ రాశారు. రాజ్యసభలోనూ పలువురు సభ్యులు బ్లూవేల్ అంశాన్ని లేవనెత్తారు. అందులోని టాస్క్‌లను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముంబైలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని ఎంపీ అమర్ శంకర్ సబ్లే వివరించారు. ఆన్లైన్లో ఇలాంటి డెత్ గేమ్స్ మరిన్ని ఉన్నాయని, వాటన్నింటినీ నిషేధించాలని మరో ఎంపీ వికాశ్ మహాత్మా పేర్కొన్నారు. బ్లూవేల్ గేమ్ కారణంగా మహారాష్ట్రలో ఓ విద్యార్థి మరణించడం, మరో విద్యార్థి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. దాంతో ఆ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో జూలై 31న చర్చ కూడా జరిగింది. ఆ గేమ్ వివరాలు పూర్తిగా సేకరిస్తామని.. దాన్ని నిలిపేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. వందల మంది పిల్లలు బలి బ్లూవేల్ చాలెంజ్ గేమ్ వల్ల రష్యాలో 130 మంది, అమెరికాలో ఇద్దరు టీనేజర్లు మృతిచెందారు. అర్జెంటీనా ఎంటర్ రోస్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 27న బెంజమన్ (16)అనే టీనేజర్ ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను మే 31న బ్లూవేల్ గేమ్ ఆడుతూ ఆసుపత్రి పాలైనట్లు విచారణలో వెల్లడైంది. లాప్లాటాలో 12 ఏళ్ల బాలిక బ్లూవేల్ గేమ్ ఆడుతూ చేతిపై బ్లేడుతో కోసుకుందని ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాన్జాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఈ గేమ్ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక బూర్కడీ మెసీడో బ్రిడ్జిపై నిలబడి దూకుతుండగా.. అక్కడే ఉన్న కొందరు గమనించి పట్టుకున్నారు. ఓ 17 ఏళ్ల బాలుడు తన ఫేస్బుక్ టైమ్‌లైన్‌లో ‘బ్లేమ్ ఇట్ ఆన్ ది వేల్’అని రాసి నీటిలో దూకేశాడు. ఇలాంటివి చాలా దేశాల్లో చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పిల్లల్ని కాపాడుకోండి.. బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రాణాంతక ఆటల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి. అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. ఈ గేమ్ జోలికి పిల్లల్ని వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రుల్ని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా సైట్లు కూడా తమ యూజర్లను ఈ గేమ్ బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. ఫేస్బుక్లో టీనేజ్ యూజర్ ఎవరైనా బ్లూవేల్ చాలెంజ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వెతికితే వెనువెంటనే.. ‘మీరు ఓకే కదా? మీకేమైనా సహాయం కావాలా?’అనే ప్రశ్న తెరమీద ప్రత్యక్షమవుతుంది. ఇక ఇన్‌స్ట్రాగామ్‌లో టంబ్లర్లో బ్లూవేల్ చాలెంజ్ అని టైప్ చేయగానే ఓ నీలిరంగు పేజీ ప్రత్యక్షమై అంతా ఓకేనా? అని అడుగుతుంది. చెప్పి మరీ దూకేశాడు జూలై 31న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి మన్‌ప్రీత్ సహాన్ బ్లూవేల్ చాలెంజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని ఆడిన మన్‌ప్రీత్.. ఎలాగైనా గేమ్ గెలవాలని భావించి.. చివరి టాస్క్‌గా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అసలు జూలై 31న తాను పాఠశాలకు రావడం లేదని 28వ తేదీనే సహాన్ తన స్నేహితులకు చెప్పాడు. గేమ్ చివరి రోజు (31వ తేదీ)న భవనంపై కూర్చుని.. తాను దూకేయబోతున్నానంటూ స్నేహితులకు వాట్సాప్‌లో సందేశాలు పెట్టాడు. దానిని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాసేపటికే సహాన్ కిందికి దూకేశాడు. అంతకు రెండురోజుల ముందు నుంచే ‘భవనం పైనుంచి దూకడం ఎలా?’అని గూగుల్‌లో సెర్చ్ చేశాడని పోలీసులు గుర్తించారు. స్కూల్ భవనంపై నుంచి దూకబోయి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చదువుతున్న పాఠశాల భవనంలో మూడో అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు. సమయానికి తోటి విద్యార్థులు గమనించి ఆ విద్యార్థిని పట్టుకుని వెనక్కి లాగారు. అలా దూకేందుకు కారణమేమిటని పరిశీలిస్తే.. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కారణమని తేలింది. ఆ విద్యార్థి తన తండ్రికి చెందిన స్మార్ట్‌ఫోన్‌లో కొద్దిరోజులుగా బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. ఒక్కో టాస్క్ పూర్తి చేస్తూ.. ఆట చివరి 50వ టాస్క్‌కు వచ్చాడు. అందులో ఏదైనా భవనం పైనుంచి దూకేయాలని ఉండడంతో.. స్కూల్ భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. గేమ్ ఆడుతూ పారిపోయాడు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే 14 ఏళ్ల విద్యార్థి కొద్దిరోజులుగా సరిగా నిద్రపోకుండా ముభావంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్ పట్టుకుని కనిపించాడు. ఏదో స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇటీవల సుధీర్ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, వెతికే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిపెట్టాడు. దీంతో సుధీర్ తల్లిదండ్రులు హతాశులై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుధీర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లడంతో.. పోలీసులు ఆ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో అతడిని పట్టుకున్నారు. ఎందుకిలా వెళ్లావని ప్రశ్నిస్తే.. అంతా ‘బ్లూవేల్ గేమ్’ఆడడం వల్లేనని బయటపడింది. తలకు ప్లాస్టిక్ బ్యాగు తొడుక్కుని.. పశ్చిమబెంగాల్లోని పశ్చిమమిడ్నాపూర్ జిల్లా ఆనంద్‌పూర్‌లో 15 ఏళ్ల వయసున్న మరో విద్యార్థి కూడా ‘బ్లూవేల్’కు బలైపోయాడు. తలపై నుంచి ప్లాస్టిక్ బ్యాగు తొడుక్కుని.. దానికి నైలాన్ తాడు చుట్టుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అంకన్ డే.. శనివారం స్కూలు ముగించుకుని ఇంటికి వచ్చాడు. టిఫిన్ చేయడానికని తల్లి పిలిస్తే.. స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్లాడు. చాలా సేపయినా బయటికి రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా చనిపోయి కనిపించాడు. బ్లూవేల్ గేమ్‌లో భాగంగానే అంకన్ డే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏమిటీ బ్లూవేల్ చాలెంజ్..? బ్లూవేల్ చాలెంజ్.. ఓ సైకో గేమ్. 50 రోజులపాటు రోజుకో టాస్క్ (ఏదైనా పని) ఇచ్చి చేయమంటుంది. మెల్లమెల్లగా పిల్లల భావోద్వేగాలను లొంగదీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడడం ప్రారంభించాక మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసినట్లు రుజువుగా సంబంధిత టాస్క్‌ల ఫొటోలను గేమ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటార్ (అడ్మినిస్ట్రేటర్) ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది! ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని.. భయం గొలిపే హర్రర్ సినిమాలను చూడాలని.. చేతిపై బ్లేడుతో గానీ, కత్తితో గానీ ఏమైనా బొమ్మల ఆకారాలను గీయాలని.. అర్ధరాత్రి లేచి బిల్డింగ్‌పైకి వెళ్లాలని.. అక్కడే ఒంటరిగా కూర్చోవాలని.. ఇలా రకరకాల టాస్క్‌లు ఇస్తాడు. శరీరంపై సిరంజీలతో గుచ్చుకోమంటాడు. ఏదైన బ్రిడ్జిపై అంచున నిలబడి, సెల్ఫీ తీసి అప్లోడ్ చేయమంటాడు. సరదాగా నగ్నంగా ఫొటోలు తీసుకుని, షేర్ చేయాలని చెప్తాడు. ఇలా తప్పులపై తప్పులు చేయిస్తున్నా.. టీనేజర్లు అంతా ఆటలో భాగమేనన్న భ్రమల్లోనే ఉంటారు. ఇలా ఈ గేమ్ పూర్తిగా హిప్నటైజ్ చేస్తుంది. 49 రోజుల పాటు టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా బిల్డింగ్ పైనుంచి దూకాలని, వంతెనపై నుంచి నది నీటిలో దూకాలని ఆదేశిస్తాడు. అలాగైతేనే గేమ్ పూర్తయినట్లని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. ఎక్కడ ప్రారంభమైంది..? రష్యాలో 2013లో ఈ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ప్రారంభమైంది. కోంటక్టే (వీకే) అనే రష్యా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో ఇది ఊపిరిపోసుకుంది. రష్యాకే చెందిన ఫిలిప్ బుడెకిన్ (22) అనే సైకాలజీ విద్యార్థి దీనిని సృష్టించాడు. ఈ గేమ్ కారణంగా 2015లో మొదటి ఆత్మహత్య వెలుగుచూసింది. ఆ తర్వాత రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోవడంతో రష్యాలో ఓ జర్నలిస్టు దీనిపై ఓ కథనం రాశాడు. దీంతో ఈ గేమ్ ప్రభావం అందరికి తెలిసింది. ముఖ్యంగా ఈ గేమ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. బ్లూవేల్ గేమ్‌ను సృష్టించినందుకు ఫిలిప్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బతికే హక్కు లేనివారిని ప్రపంచంలో లేకుండా చేసి సమాజాన్ని క్లీన్‌గా చేయడమే తన ఉద్దేశమని అరెస్టు సందర్భంగా ఫిలిప్ వాదించాడు. పైగా మరణించిన వారంతా వారి ఇష్ట పూర్వకంగానే ఆత్మహత్య చేసుకున్నారని సమర్థించుకున్నాడు. ఫిలిప్ అరెస్టైనా బ్లూవేల్ గేమ్ కొనసాగుతుండడం, పర్యవసానాలు వెలుగుచూస్తుండడంతో దీని వెనుక ఏదైనా గ్రూప్ పనిచేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. మొదట రష్యాలో తర్వాత దుబాయ్‌లో అరాచకాన్ని కొనసాగించిన బ్లూవేల్ చాలెంజ్... తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ దేశాల్లోకి ప్రవేశించింది. చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, బల్గేరియా, కొలంబియా, అమెరికా ఇలా చాలా దేశాలకూ వ్యాపించింది. ఇటీవల భారత్‌లోనూ ప్రవేశించింది. అయితే బ్లూవేల్ సంబంధిత వెబ్సైట్లను చైనా పూర్తిగా నిషేధించింది. -
పెను సవాల్: 'బ్లూ వేల్'ను ఆపడం సాధ్యమేనా?
ప్రాణాంతక ఆన్లైన్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్'ను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ గేమ్‌లో భాగంగా ముంబైకి చెందిన టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. గేమ్ సర్వర్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు. అయితే, సైబర్ భద్రతా నిపుణులు మాత్రం ఈ గేమ్‌ను నిషేధించడం లేదా బ్లాక్ చేయడం ప్రభుత్వానికి సైతం పెద్ద సవాలేనని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అత్యంత సంక్లిష్టమైన, మిస్టరీతో కూడిన ఈ గేమ్ ఒక యాప్ కాదు. ఈ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోగానీ, ఇతర యాప్ స్టోర్లలోగానీ సులభంగా డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. ఇదొక కమ్యూనిటీ. అంతర్జాతీయంగా సోషల్ మీడియా వెబ్సైట్లను వేదికగా చేసుకొని టీనేజర్లు ఆత్మహత్య చేసుకొనేలా పురికొల్పుతుంది. ఈ చాలెంజ్‌ను నియంత్రించేవారు వివిధ చాట్‌రూమ్స్ వేదికగా ఒకరినొకరు సంప్రదించుకుంటారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకమైన అభిరుచులు గల టీనేజర్లను గుర్తించి.. వారు ఈ గేమ్ ఆడేలా ఎర వేస్తారు. 'పలు సోషల్ మీడియా యాప్స్ వేదికగా చేసుకొని ఈ కమ్యూనిటీ సంప్రదింపులు జరుపుతున్నట్టు రష్యా టీనేజర్ ఆత్మహత్య కేసులో తేలింది. ఈ చాలెంజ్‌ను నిషేధించి.. దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే.. యువత అధికంగా ఫాలో అయ్యే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియంత్రించాల్సి ఉంటుంది. ఐఎస్పీల ఆధారంగా సెర్చ్లన్నింటినీపై కన్ను వేయాలి. ఈ చాలెంజ్‌కు దారితీసే వెబ్సైట్లు, లింకులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. ప్రభుత్వం ఇవన్నీ చేయగలదు. అదేసమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది' అని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. నిజానికి ఇది ఆన్లైన్ గేమ్ కూడా కాదు. కానీ ఈ చాలెంజ్ నిర్వాహకుడు లేదా కంట్రోలర్ సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన టీనేజర్‌కు పలు టాస్క్‌లు (సాహస కార్యాలు) అప్పజెప్తాడు. దీని గురించి మరో నిపుణుడు స్పందిస్తూ.. 'గత ఆరు నెలలుగా బ్లూవేల్ చాలెంజ్ గురించి నేను చదువుతున్నాను. రష్యాలో పలువురు టీనేజర్లు దీనిబారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గేమ్‌కు ఇతర పేర్లు కూడా ఉన్నాయని తెలుసుకున్నాను. డార్క్ రూమ్, వేక్ మి అప్ ఎట్ 4.20 ఏఎం వంటి పేర్లు చెలామణిలో ఉన్నాయి. ఈ చాలెంజ్‌ను ఒకరు స్వీకరిస్తే.. సొంతంగా హింసించుకుంటూ చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకులు, కమ్యూనిటీ పేజీలన్నింటినీ గుర్తించి టీనేజర్లకు ఇవి చేరకుండా బ్లాక్ చేయాలి. ఇది కష్టమైన పని. ఎందుకంటే ఏ సోషల్ మీడియా పేజీ దీనిని నిర్వహిస్తుందో మనకు తెలియదు' అని చెప్పారు. 'ఈ చాలెంజ్‌ను పూర్తిగా నిషేధించడం అసాధ్యం. కానీ దీని మూలాలను గుర్తించడం ద్వారా నియంత్రించవచ్చు. దీనికి సంబంధించిన గేట్‌వే లేదా ఐఎస్‌పీలను గుర్తిస్తే బ్లాక్ చేయడం సాధ్యమే. ఈ చాలెంజ్ రష్యాలో మొదలైనట్టు తెలుస్తోంది. దీని మూలాలను గుర్తించి మరింత విస్తరించకుండా దేశాల మధ్య సమాచారాన్ని అందించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. ఇది కష్టసాధ్యమైనా ప్రభుత్వాలకు అసాధ్యమైతే కాదు' అని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు.