మళ్లీ పంజా విసిరిన బ్లూవేల్..!
సాక్షి, చెన్నై: ప్రమాదకరమైన ఆన్‌లైన్ గేమ్ 'బ్లూవేల్ చాలెంజ్' ఈసారి తమిళనాడులో పంజా విసిరింది. చెన్నై తిరుమంగళానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి విగ్నేష్ బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మదురైలోని మన్నార్ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్న అతని చేతిపై వేల్ (తిమింగళం) గుర్తువేసి ఉంది. దానికింద బ్లూవేల్ అని రాసి ఉందని పోలీసులు ధ్రువీకరించారు. సాయంత్రం 4. 30 గంటల సమయంలో ఉరేసుకొని కనిపించిన విగ్నేష్ రాసిన లేఖ కూడా సంఘటనాస్థలంలో దొరికింది. 'బ్లూ వేల్.. ఇది గేమ్ కాదు ప్రమాదం. ఒక్కసారి ఎంటరైతే.. నువ్విక బయటపడలేవు' అని రాసి ఉంది.
విగ్నేష్ తన ఫోన్‌లో బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం ప్రయత్నిస్తూ కనిపించేవాడని అతని స్నేహితులు తెలిపారు. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం యాప్‌కానీ, వెబ్‌సైట్ కానీ లేని నేపథ్యంలో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా అతను బ్లూవేల్ ఆడేందుకు ప్రయత్నించాడని, క్యూరేటర్ ద్వారా అతని టాస్కులు అందేవని స్నేహితులు అంటున్నారు. ఈ సమాచారాన్ని బట్టి తమిళనాడు తొలి బ్లూవేల్ మరణమని అనుమానిస్తున్నారు.
బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌పై తమిళనాడు పోలీసులు ఇప్పటికే తల్లిదండ్రులను హెచ్చరించారు. కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు వాడే పిల్లలపై ఓ కంట నిఘావేసి ఉంచాలని సూచించారు.
ఏమిటీ బ్లూవేల్!
బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఓ ఆన్‌లైన్ గేమ్. దీన్ని రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు.
చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. క్రమంగా యూరప్, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
చదవండి: ‘బ్లూ వేల్ ఛాలెంజ్’కు బలవుతున్నారా?
చదవండి: వామ్మో.. బ్లూ వేల్.!
చదవండి: పెను సవాల్: 'బ్లూ వేల్'ను ఆపడం సాధ్యమేనా?