పుణె : బ్లూవేల్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. స్వేచ్ఛా జీవిగా మారుతున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఉరిపోసుకున్నాడు. ఈ ఘటన పుణెలోని లోనిఖండ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాలు.. లోనిఖండ్‌లో కుటుంబంతోపాటు నివాసముండే దివాకర్ మాలి (20) ఆన్‌లైన్ గేమ్ బ్లూవేల్‌కి అడిక్ట్ అయ్యాడు. గంటల తరబడి గేమ్‌లోనే మునిగిపోయేవాడు. గేమ్‌లో భాగంగా టాస్క్‌ని పూర్తి చేసే క్రమంలో ఉరివేసుకుని బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్‌లో.. ‘బందీగా ఉన్న నల్ల చిరుతను విడిపించాను. దానికిక ఎటువంటి ఆంక్షలు ఉండవు. స్వేచ్ఛగా బతికేయొచ్చు.ఇది ముగింపు’ అని రాసి పెట్టాడు. మరో పేజీలో చిరుత బొమ్మ కూడా గీసి ‘సూర్యుడు మళ్లీ కాంతివంతమవుతాడు’అని మరాఠీ, ఇంగ్లిష్‌లలో రాశాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ‘బ్లూవేల్ చాలెంజ్’పూర్తి చేసే క్రమంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని చెప్పారు. తనను తాను నల్ల చిరుతగా భావించి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు.
ఇంకెవరూ చావొద్దు..
ప్రపంచంతో సంబంధం లేకుండా దివాకర్ గంటల తరబడి మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడని ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు మొబైల్ వాడకానికి బానిసయ్యాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులందరికి విఙ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలు సెల్ ఫోన్ వాడకానికి అడిక్ట్ కాకుండా జాగ్రత్త పడండి. నా కొడుకులా ఇంకెవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దు’అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ‘బ్లూవేల్ చాలెంజ్’లో ఆటగాళ్లకు వివిధ టాస్క్‌లు ఇచ్చి నిర్ణీత సమయంలో పూర్తి చేయమంటారు. ఒంటికి గాయాలు చేసుకోవడం వంటి ప్రమాదకర టాస్క్‌లు కూడా ఉంటాయి. మరికొన్ని టాస్క్‌లు ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రేరేపిస్తాయి. మొబైల్ గేమ్‌లకు అడిక్ట్ అవడం ‘మానసిక రుగ్మత’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment