కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: బాలలు, యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రమాదకరమైన ఆన్‌లైన్ గేమ్ ‘బ్లూవేల్ చాలెంజ్’ ను పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మూడువారాల్లోగా 'బ్లూవేల్'ను నిషేధించే విషయమై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 'బ్లూవేల్' గేమ్‌పై న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్ ప్రతిని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు అందజేసింది. బ్లూవేల్ ఆట దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ వ్యక్తి బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్‌లైన్ గేమ్‌ను రూపొందించాడు. ఈ ఆటలో పాల్గొనే వారు 50 రోజుల పాటు వివిధ టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి టాస్క్‌గా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు బాలలు ఈ ఆట ప్రభావానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
'బ్లూవేల్' నిషేధంపై మీ వైఖరేంటి?
Published Fri, Sep 15 2017 4:23 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement