బ్లూ వేల్ దెబ్బ.. అమ్మాయిలు పారిపోయారుగా...
బ్లూవేల్ దెబ్బ.. అమ్మాయిలు పారిపోయారుగా...
Published Thu, Sep 14 2017 11:52 AM | Last Updated on Wed, Apr 3 2019 9:25 PM
సాక్షి, భోపాల్: మోస్ట్ డేంజరస్ గేమ్ బ్లూవేల్ మరోసారి భారత్‌లో తన ప్రభావాన్ని చూపించింది. అయితే ఈసారి అదృష్టవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. పోలీసులు అప్రమత్తం కావటంతో ఇద్దరు యువతులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆగ్రాలో తొమ్మిదో తరగతి ఇద్దరు విద్యార్థినిలు (14 ఏళ్లు) గత కొంతకాలంగా బ్లూవేల్ ఛాలెంజ్‌కు బానిసలయ్యారు. ఇప్పటికే రెండు లెవెల్స్ పూర్తి చేసిన ఆ ఇద్దరు.. తరువాతి లెవల్‌లో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. అదే ఇంటి నుంచి పారిపోవటం. మంగళవారం ఇద్దరు ఎంచక్కా తమ బ్యాగులు సర్దుకుని ఉదయం 8 గంటలకు పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ను ఎక్కేశారు. సెల్ ఫోన్ ట్రేస్ చేయటానికి వీల్లేకుండా స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారు. సాయంత్రం స్కూల్ సమయం ముగియటంతో తల్లిదండ్రులు కంగారుపడిపోతారని భావించిన ఓ యువతి తన ఫోన్ ను ఆన్ చేసి సోదరుడికి అసలు విషయం చెప్పేసింది. వెంటనే అతను వారిద్దరిని తర్వాతి స్టేషన్‌లో దిగిపోవాలని సూచించాడు.
దీంతో ఇద్దరు బాలికలు మధ్యప్రదేశ్ లోని హోషంగబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో వారిని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్‌కి సమాచారం అందించారు. వెంటనే శిశు సంరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని తమ వెంట తీసుకెళ్లి అసలు విషయాలను ఆరాతీశారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చాక వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేస్తామని సీడబ్యూసీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. గత నెలలో జైపూర్‌కు చెందిన ఇలాగే బ్లూవేల్ దెబ్బకు ఇంటి నుంచి పారిపోగా.. అతని సెల్ ఫోన్ ఆధారంగా ముంబై పోలీసులు అతన్ని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement