బ్లూవేల్‌ గేమ్‌.. ఓ మృత్యు క్రీడ | A dead sport is killing Hundreds of students | Sakshi
Sakshi News home page

బ్లూవేల్‌ గేమ్‌.. ’ఓ మృత్యు క్రీడ’

Published Sun, Aug 13 2017 1:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

బ్లూవేల్‌ గేమ్‌.. ఓ మృత్యు క్రీడ

బ్లూవేల్‌ గేమ్‌.. ఓ మృత్యు క్రీడ

అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ‘బ్లూవేల్‌ చాలెంజ్‌’ గేమ్‌
- ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తున్న డేంజర్‌
ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్య
10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ప్రభావం
తాజాగా భారత్‌లోనూ పంజా విసురుతున్న మృత్యు క్రీడ
గేమ్‌ ఆడుతూ ముంబైలో భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి
షోలాపూర్, ఇండోర్‌లలో మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
గేమ్‌ సృష్టికర్త రష్యాకు చెందిన ఓ సైకాలజీ విద్యార్థి
పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్న నిపుణులు  
 
ముంబైలోని అంధేరీలో మన్‌ప్రీత్‌ సహాన్‌ అనే 14 ఏళ్ల విద్యార్థి ఓ భవనంపై నుంచి దూకేశాడు.. షోలాపూర్‌లో మరో 14 ఏళ్ల విద్యార్థి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి సుధీర్‌ స్కూల్‌ భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.. మూడూ వేర్వేరు ఘటనలు.. వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కారణం మాత్రం ఒకటే.. అదే ‘బ్లూవేల్‌ చాలెంజ్‌’.. ఓ సోషల్‌ మీడియా గేమ్‌.. సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ ఇది.. 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట చిన్నారులను హిప్నటైజ్‌ చేస్తుంది. భావోద్వేగాలతో పిల్లలను మృత్యుఒడిలోకి తోసేస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో ఇప్పటికే వందలాది మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న ఈ ఆట.. ఇప్పుడు భారత్‌లో పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ ప్రమాదకరమైన గేమ్‌ నుంచి రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ ఏమిటి, పర్యవసానాలు, ప్రమాదాలు, జాగ్రత్తలపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్‌..                                  
-సాక్షి, ముంబై/తెలంగాణ డెస్క్‌
 
ముంబైలోని అంధేరీకి చెందిన మన్‌ప్రీత్‌ సహాన్‌ అనే 14 ఏళ్ల బాలుడు బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ ఆడుతూ జూలై 30న బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఈ గేమ్‌ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా శనివారం పశ్చిమబెంగాల్‌లో అంకన్‌ డే అనే విద్యార్థి తలకు ప్లాస్టిక్‌ బ్యాగ్‌ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
 
నిషేధించాలని ప్రధానికి లేఖ..
అత్యంత ప్రమాదకరమైన బ్లూవేల్‌ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అమాయక పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం లేఖ రాశారు. రాజ్యసభలోనూ పలువురు సభ్యులు బ్లూవేల్‌ అంశాన్ని లేవనెత్తారు. అందులోని టాస్క్‌లను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముంబైలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని ఎంపీ అమర్‌ శంకర్‌ సబ్లే వివరించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి డెత్‌ గేమ్స్‌ మరిన్ని ఉన్నాయని, వాటన్నింటినీ నిషేధించాలని మరో ఎంపీ వికాశ్‌ మహాత్మా పేర్కొన్నారు. బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా మహారాష్ట్రలో ఓ విద్యార్థి మరణించడం, మరో విద్యార్థి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. దాంతో ఆ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో జూలై 31న చర్చ కూడా జరిగింది. ఆ గేమ్‌ వివరాలు పూర్తిగా సేకరిస్తామని.. దాన్ని నిలిపేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.
 
వందల మంది పిల్లలు బలి
బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ వల్ల రష్యాలో 130 మంది, అమెరికాలో ఇద్దరు టీనేజర్లు మృతిచెందారు. అర్జెంటీనా ఎంటర్‌ రోస్‌ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్‌ 27న బెంజమన్‌ (16)అనే టీనేజర్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను మే 31న బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ ఆసుపత్రి పాలైనట్లు విచారణలో వెల్లడైంది. లాప్లాటాలో 12 ఏళ్ల బాలిక బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ చేతిపై బ్లేడుతో కోసుకుందని ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాన్‌జాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఈ గేమ్‌ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక బూర్కడీ మెసీడో బ్రిడ్జిపై నిలబడి దూకుతుండగా.. అక్కడే ఉన్న కొందరు గమనించి పట్టుకున్నారు. ఓ 17 ఏళ్ల బాలుడు తన ఫేస్‌బుక్‌ టైమ్‌లైన్‌లో ‘బ్లేమ్‌ ఇట్‌ ఆన్‌ ది వేల్‌’అని రాసి నీటిలో దూకేశాడు. ఇలాంటివి చాలా దేశాల్లో చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
 
పిల్లల్ని కాపాడుకోండి..
బ్లూవేల్‌ చాలెంజ్‌ లాంటి ప్రాణాంతక ఆటల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి. అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. ఈ గేమ్‌ జోలికి పిల్లల్ని వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రుల్ని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లు కూడా తమ యూజర్లను ఈ గేమ్‌ బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశాయి. ఫేస్‌బుక్‌లో టీనేజ్‌ యూజర్‌ ఎవరైనా బ్లూవేల్‌ చాలెంజ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో వెతికితే వెనువెంటనే.. ‘మీరు ఓకే కదా? మీకేమైనా సహాయం కావాలా?’అనే ప్రశ్న తెరమీద ప్రత్యక్షమవుతుంది. ఇక ఇన్‌స్ట్రాగామ్‌లో టంబ్లర్లో బ్లూవేల్‌ చాలెంజ్‌ అని టైప్‌ చేయగానే ఓ నీలిరంగు పేజీ ప్రత్యక్షమై అంతా ఓకేనా? అని అడుగుతుంది.
 
చెప్పి మరీ దూకేశాడు
జూలై 31న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి మన్‌ప్రీత్‌ సహాన్‌ బ్లూవేల్‌ చాలెంజ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ గేమ్‌ గురించి తెలుసుకుని ఆడిన మన్‌ప్రీత్‌.. ఎలాగైనా గేమ్‌ గెలవాలని భావించి.. చివరి టాస్క్‌గా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అసలు జూలై 31న తాను పాఠశాలకు రావడం లేదని 28వ తేదీనే సహాన్‌ తన స్నేహితులకు చెప్పాడు. గేమ్‌ చివరి రోజు (31వ తేదీ)న భవనంపై కూర్చుని.. తాను దూకేయబోతున్నానంటూ స్నేహితులకు వాట్సాప్‌లో సందేశాలు పెట్టాడు. దానిని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాసేపటికే సహాన్‌ కిందికి దూకేశాడు. అంతకు రెండురోజుల ముందు నుంచే ‘భవనం పైనుంచి దూకడం ఎలా?’అని గూగుల్‌లో సెర్చ్‌ చేశాడని పోలీసులు గుర్తించారు.
 
స్కూల్‌ భవనంపై నుంచి దూకబోయి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చదువుతున్న పాఠశాల భవనంలో మూడో అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు. సమయానికి తోటి విద్యార్థులు గమనించి ఆ విద్యార్థిని పట్టుకుని వెనక్కి లాగారు. అలా దూకేందుకు కారణమేమిటని పరిశీలిస్తే.. బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ కారణమని తేలింది. ఆ విద్యార్థి తన తండ్రికి చెందిన స్మార్ట్‌ఫోన్‌లో కొద్దిరోజులుగా బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతున్నాడు. ఒక్కో టాస్క్‌ పూర్తి చేస్తూ.. ఆట చివరి 50వ టాస్క్‌కు వచ్చాడు. అందులో ఏదైనా భవనం పైనుంచి దూకేయాలని ఉండడంతో.. స్కూల్‌ భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. 
 
గేమ్‌ ఆడుతూ పారిపోయాడు
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సుధీర్‌ భోస్లే అనే 14 ఏళ్ల విద్యార్థి కొద్దిరోజులుగా సరిగా నిద్రపోకుండా ముభావంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్‌ పట్టుకుని కనిపించాడు. ఏదో స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇటీవల సుధీర్‌ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, వెతికే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిపెట్టాడు. దీంతో సుధీర్‌ తల్లిదండ్రులు హతాశులై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుధీర్‌ సెల్‌ఫోన్‌ తీసుకుని వెళ్లడంతో.. పోలీసులు ఆ ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసి షోలాపూర్‌ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో అతడిని పట్టుకున్నారు. ఎందుకిలా వెళ్లావని ప్రశ్నిస్తే.. అంతా ‘బ్లూవేల్‌ గేమ్‌’ఆడడం వల్లేనని బయటపడింది. 
 
తలకు ప్లాస్టిక్‌ బ్యాగు తొడుక్కుని..
పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమమిడ్నాపూర్‌ జిల్లా ఆనంద్‌పూర్‌లో 15 ఏళ్ల వయసున్న మరో విద్యార్థి కూడా ‘బ్లూవేల్‌’కు బలైపోయాడు. తలపై నుంచి ప్లాస్టిక్‌ బ్యాగు తొడుక్కుని.. దానికి నైలాన్‌ తాడు చుట్టుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అంకన్‌ డే.. శనివారం స్కూలు ముగించుకుని ఇంటికి వచ్చాడు. టిఫిన్‌ చేయడానికని తల్లి పిలిస్తే.. స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్లాడు. చాలా సేపయినా బయటికి రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా చనిపోయి కనిపించాడు. బ్లూవేల్‌ గేమ్‌లో భాగంగానే అంకన్‌ డే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
 
ఏమిటీ బ్లూవేల్‌ చాలెంజ్‌..?
బ్లూవేల్‌ చాలెంజ్‌.. ఓ సైకో గేమ్‌. 50 రోజులపాటు రోజుకో టాస్క్‌ (ఏదైనా పని) ఇచ్చి చేయమంటుంది. మెల్లమెల్లగా పిల్లల భావోద్వేగాలను లొంగదీసుకుంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆడడం ప్రారంభించాక మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసినట్లు రుజువుగా సంబంధిత టాస్క్‌ల ఫొటోలను గేమ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్‌ స్థానంలో మెంటార్‌ (అడ్మినిస్ట్రేటర్‌) ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది! ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని.. భయం గొలిపే హర్రర్‌ సినిమాలను చూడాలని.. చేతిపై బ్లేడుతో గానీ, కత్తితో గానీ ఏమైనా బొమ్మల ఆకారాలను గీయాలని.. అర్ధరాత్రి లేచి బిల్డింగ్‌పైకి వెళ్లాలని.. అక్కడే ఒంటరిగా కూర్చోవాలని.. ఇలా రకరకాల టాస్క్‌లు ఇస్తాడు. శరీరంపై సిరంజీలతో గుచ్చుకోమంటాడు. ఏదైన బ్రిడ్జిపై అంచున నిలబడి, సెల్ఫీ తీసి అప్‌లోడ్‌ చేయమంటాడు. సరదాగా నగ్నంగా ఫొటోలు తీసుకుని, షేర్‌ చేయాలని చెప్తాడు. ఇలా తప్పులపై తప్పులు చేయిస్తున్నా.. టీనేజర్లు అంతా ఆటలో భాగమేనన్న భ్రమల్లోనే ఉంటారు. ఇలా ఈ గేమ్‌ పూర్తిగా హిప్నటైజ్‌ చేస్తుంది. 49 రోజుల పాటు టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా బిల్డింగ్‌ పైనుంచి దూకాలని, వంతెనపై నుంచి నది నీటిలో దూకాలని ఆదేశిస్తాడు. అలాగైతేనే గేమ్‌ పూర్తయినట్లని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు.
 
ఎక్కడ ప్రారంభమైంది..?
రష్యాలో 2013లో ఈ బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌ ప్రారంభమైంది. కోంటక్టే (వీకే) అనే రష్యా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లో ఇది ఊపిరిపోసుకుంది. రష్యాకే చెందిన ఫిలిప్‌ బుడెకిన్‌ (22) అనే సైకాలజీ విద్యార్థి దీనిని సృష్టించాడు. ఈ గేమ్‌ కారణంగా 2015లో మొదటి ఆత్మహత్య వెలుగుచూసింది. ఆ తర్వాత రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోవడంతో రష్యాలో ఓ జర్నలిస్టు దీనిపై ఓ కథనం రాశాడు. దీంతో ఈ గేమ్‌ ప్రభావం అందరికి తెలిసింది. ముఖ్యంగా ఈ గేమ్‌ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. బ్లూవేల్‌ గేమ్‌ను సృష్టించినందుకు ఫిలిప్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

బతికే హక్కు లేనివారిని ప్రపంచంలో లేకుండా చేసి సమాజాన్ని క్లీన్‌గా చేయడమే తన ఉద్దేశమని అరెస్టు సందర్భంగా ఫిలిప్‌ వాదించాడు. పైగా మరణించిన వారంతా వారి ఇష్ట పూర్వకంగానే ఆత్మహత్య చేసుకున్నారని సమర్థించుకున్నాడు. ఫిలిప్‌ అరెస్టైనా బ్లూవేల్‌ గేమ్‌ కొనసాగుతుండడం, పర్యవసానాలు వెలుగుచూస్తుండడంతో దీని వెనుక ఏదైనా గ్రూప్‌ పనిచేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. మొదట రష్యాలో తర్వాత దుబాయ్‌లో అరాచకాన్ని కొనసాగించిన బ్లూవేల్‌ చాలెంజ్‌... తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ దేశాల్లోకి ప్రవేశించింది. చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, బల్గేరియా, కొలంబియా, అమెరికా ఇలా చాలా దేశాలకూ వ్యాపించింది. ఇటీవల భారత్‌లోనూ ప్రవేశించింది. అయితే బ్లూవేల్‌ సంబంధిత వెబ్‌సైట్లను చైనా పూర్తిగా నిషేధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement