blue whale game
-
బ్లూ వేల్ గేమ్ నేపథ్యంలో సినిమా, హీరోయిన్గా అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: దావణగెరెలో గతనెల 23న ఇంటిపైనుంచి పడి మృతి చెందిన పీయూసీ విద్యార్థి మిథున్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. అతను ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందలేదని, బ్లూవేల్ తరహాలో యానిమేషన్ గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ రిష్యంత్ బుధవారం మీడియాకు తెలిపారు. తన చావుకు తానే కారణమంటూ గణితం పుస్తకంలో స్వయంగా రాసి అనంతరం చేతికి గాయం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి అనంతరం ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థి చేతిరాతను తల్లిదండ్రులు నిర్ధారించారన్నారు. అయితే ఆ విద్యార్థి రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అధికారికంగా నిర్ధారణ చేస్తామన్నారు. చదవండి: ('ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది') -
యువతి ఫిర్యాదుతో వెలుగులోకి ‘మోమో ఛాలెంజ్’
కోల్‌కతా: సోషల్ మీడియాలో మరో ప్రాణాంతక ఛాలెంజ్ హల్చల్ చేస్తోంది. బ్లూ వేల్ తరహాలోనే ఈ ఛాలెంజ్ కూడా పలు దేశాలకు తలనొప్పిగా మారింది. గత వారం అర్జెంటీనాకు చెందిన 12 ఏళ్ల బాలిక మోమో ఛాలెంజ్ కారణంగానే ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాజాగా భారత్‌లో కూడా మోమో ఛాలెంజ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి వాట్సప్‌కు మోమో ఛాలెంజ్‌కు సంబంధించి సందేశం రావడంతో ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తనకు ఓ గుర్తు తెలియని నంబరు నుంచి మోమో ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సందేశం వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారు తనతో మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. దీంతో భయపడి ఈ విషయం తన అన్నకు తెలుపగా.. ఆయన హెచ్చరికలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మోమో ఛాలెంజ్: గతేడాది ప్రపంచవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు బలిగొన్న బ్లూ వేల్ తరహాలోనే మోమో ఛాలెంజ్ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిచేత ప్రాణాంతక టాస్క్‌లు చేయించడం ఈ గేమ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్ తొలుత ఫేస్బుక్లో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గుర్తు తెలియని నంబర్ నుంచి సోషల్ మీడియా ఉపయోగించే యువతను సంప్రదిస్తారు. ఒకసారి మోమో ఛాలెంజ్ స్వీకరించాక వారి చేత పలు ప్రాణాంతక టాస్కులు చేయిస్తారు. చివరి దశ ఆత్మహత్యకు పాల్పడటంతో ముగుస్తుంది. ఆ విధంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న వారిని ప్రేరేపిస్తారు. ఒకవేళ టాస్క్‌లను వ్యతిరేకిస్తే వారికి భయంకరమైన వీడియోలు, చిత్రాలు పంపుతు బెదిరింపులకు దిగుతారు. ఈ ఛాలెంజ్ విసురుతున్న కొన్ని నంబర్లను గుర్తించినప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారనే విషయాలు తెలియరాలేదు. సదురు నంబర్లు మాత్రం జపాన్, మెక్సికో, కొలంబియాల నుంచి ఆపరేట్ అవుతున్నట్టుగా గుర్తించారు. ఈ ఛాలెంజ్ కోసం ఒక బోమ్మ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ బొమ్మకు పెద్ద కళ్లు, వెడల్పు నోరు కలిగి ఉంటుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని జపాన్‌కు చెందిన ఓ కంపెనీ రూపొందించింది. జపాన్ ఆర్టిస్ట్ మిడోరి హయాషి దీనిని సృష్టించినప్పటికీ అతనికి ఈ గేమ్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ గేమ్ ద్వారా వ్యక్తిగత డేటాను దొంగిలించి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతారని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వారి చర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల వచ్చిన కికి ఛాలెంజ్ ద్వారా కూడా పలువురు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. -
రాజంపేటలో బ్లూవెల్‌గేమ్ కలకలం..?
సాక్షి, రాజంపేట :ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యార్థుల చేతులను పరిశీలించిన ఉపాధ్యాయులు వారిని మందలించినట్లు తెలిసింది. వెంటనే ఆ ఇద్దరినీ తల్లిదండ్రులతో ఇంటికి పంపించినట్లు మిగతా పిల్లలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాలు ధృవీకరించడంలేదు. -
బ్లూవేల్ మరొకరిని మింగింది!
టీ.నగర్ (చెన్నై): చెన్నై రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్లూవేల్ క్రీడ ఆడుతూ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పళయఅళమాది శివన్ కోవిల్ వీధికి చెందిన తిరునావుక్కరసు కుమారుడు దినేష్(25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ముంబైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. దీపావళికి ఇంటికి వచ్చిన దినేష్ 10 రోజులుగా మానసిక వేదనకు గురైనట్టు కనిపించాడు. శనివారం బయటికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తానే ఆత్మహత్య చేసుకున్నట్టు దినేష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆడుకుంటూనే రైలు కిందకు దూకేశాడా?
సాక్షి, లక్నో : బ్లూవేల్ భూతం మరో ముక్కు పచ్చలారని ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్లూవేల్ ఆడుకుంటూనే వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి చనిపోయినట్లు సమాచారం. షామ్లికి చెందిన నిశాంత్ గత కొంత కాలంగా బ్లూవేల్ ఛాలెంజ్ ఆడుతున్నాడని.. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితులు చెబుతున్నారు. కాగా, ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం మొబైల్ చేతిలో ఉన్న బాలుడు ఒక్కసారిగా రైలు ముందుకు దూకేశాడని తెలిపారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మిస్టరీని చేధించే పనిలో నిమగ్నమయ్యారు. మరోపక్క మధ్యప్రదేశ్ రాయ్‌గఢ్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తాను బ్లూవేల్ గేమ్ 49వ లెవల్‌కి చేరుకున్నానని.. ఆత్మహత్య చేసుకోవాలంటే భయంగా ఉందంటూ పరీక్ష సమాధాన పత్రంలో రాశాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేయగా.. బాలుడికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. -
బ్లూవేల్ భూతాలను ఆపలేమా!
బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధి కుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశాచికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యో గుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం! సమకాలీనం మనిషికి జ్వరం రావడం మంచిదే, శరీరంలో వచ్చిన తేడాలు గుర్తించి సరిదిద్దుకునేందుకు అదొక సంకేతం, హెచ్చరిక అని సంప్రదాయ వైద్యులంటారు. ఆధునిక వైద్యులూ కొంతవరకు ఆమోదిస్తారు. సరిదిద్దుకునే పని ఎంత సమర్థంగా చేస్తామనే దాన్ని బట్టి భవిష్యత్ ఆరోగ్యం ఆధార పడుతుంది. ఆన్లైన్ ఆట ‘బ్లూ వేల్ చాలెంజ్’ అటువంటిదే అనుకుంటే! మనం, మన ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏ మేరకు అప్రమత్తమై ఈ ఆధునిక జాడ్యాన్ని వదిలించుకునే చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రధానం. ఈ ఆట మర్మమేంటి? ఎందుకు యువతను ఆకట్టుకుంటోంది? చివరకు ఆత్మ హత్యలకు ఎలా పురిగొల్పుతోంది? ఏం చేసి ఈ సమస్యను పరిష్క రించవచ్చు? ఇదేకాక, ఇటువంటివి మున్ముందు మరో పేరుతో తలెత్తితే ఏమిటి పరిస్థితి? ఈ దిశలో తగిన ఆలోచనలు సాగటం లేదు. సరైన అడు గులూ పడటం లేదు. సమస్య తీవ్రత, మూలాల్ని సరిగ్గా అర్థం చేసుకున్న దాఖలాలే కనిపించడం లేదు! ఆటలో పాల్గొనే వారికి సదరు గేమ్ విసిరిన సవాళ్ల కన్నా, ఈ వ్యవహారం మన వ్యవస్థకు విసిరిన సవాలే పెద్దది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి తగు నివారణ చర్యలు తీసుకోకుండా పైపై చర్యలతో సరిపెడితే ఫలితం శూన్యం! సైబర్ లోకానికి సంబంధించైనా, మరోటైనా... సమస్య రాగానే హడావుడి చేయడం, కాస్త సద్దుమణిగిన తర్వాత అన్నీ మరచి మామూలు స్థితికి చేరడం మనకు అలవాటే! బ్లూవేల్ ఆన్లైన్ గేమ్ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది యువతీయువకులు ఈ ఆటాడి, అజ్ఞాత మారీచు(గ్రూప్ అడ్మిన్)ల పైశాచికత్వానికి బలైనట్టు కథనాలు వస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ, కచ్చితంగా వారి మరణం ఈ ఆట వల్లే అని ధృవపడలేదని ప్రభుత్వ వర్గా లంటున్నాయి. ఇంతకీ బ్లూవేల్ చాలెంజ్ ఆటా? మాస్ హిస్టీరియానా? భ్రమా–భ్రాంతియా? యువత తెలీక ఇరక్కుపోతున్న ‘నెట్’ వ్యసనమా? రకరకాల చర్చ జరుగుతోంది. ఇదసలు ఓ సాధారణ ఆట కాదు, మృత్యుక్రీడ అనే వారున్నారు. ఇదొక్కటే కాకుండా, యువతరం జీవితాల్ని బుగ్గి పాల్జేస్తున్న ఆన్లైన్, నెట్ ఆధారిత క్రీడలెన్నో ఉన్నాయి. తాజా డిజిటల్ యుగంలో... సైబర్ నేరాల్ని పసిగట్టే, నియంత్రించే, పౌరులకు భద్రత కల్పించే వ్యవస్థ మనదేశంలో ఇంకా బలపడలేదు. సమాచార విప్లవం ఫలితంగా స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాల రూపంలో ‘ఇంటర్నెట్’ సామాన్యుల జీవితాల్లోకి సహితం చొచ్చుకొచ్చింది. ఆన్లైన్ ఆటలు, ప్రాణాల్ని బలి తీసుకునే వికృత క్రీడలూ ఇందులో భాగమయ్యాయి. ఈ ఆన్లైన్ సదుపాయం సగటు మనిషి జీవన విధానాన్ని, ముఖ్యంగా ఎదిగే యువతరం అలవాట్లని సమూలంగా మార్చేసింది. దీనికి తోడు ఇక్కడ మారిన కుటుంబ వ్యవస్థ, జీవనశైలి, విలువలు నశించిన విద్యావిధానం, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం... వెరసి సమస్యను జటిలం చేస్తున్నాయి. సమస్య మూలాల్ని శోధించి, శస్త్ర చికిత్స జరపడం అవసరమైన చోట పైపై లేపనాలు రుద్ది సరిపెట్టాలనుకోవడం ఓ పెద్ద లోపం. దీన్ని సరిదిద్దడమే తక్షణ కర్తవ్యం. అబ్బే! ఈ చర్యలు సరిపోవు అమెరికా, యూరప్, రష్యా, కొరియా తదితర దేశాల్లో చేదు అను భవాల్ని చవిచూపిన తర్వాత ఈ మాయా క్రీడ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగతా ఆన్లైన్ క్రీడల్లాగే ‘చాలెంజ్’ పేరిట కొన్ని టాస్క్‌లు ఇవ్వడం, వాటిల్లో కొన్ని అసాధారణ–ప్రమాద భరిత చర్యలుండటం, అవి సాధించేలా యువతను పురికొల్పడం ఈ ఆట లక్షణం. అది సాధించే క్రమంలో కొన్నిసార్లు తెలిసీ, చాలాసార్లు తెలియకుండానే బడిపిల్లలు, యువతరం ప్రమాదంలో ఇరుక్కుంటున్నారు. ఇక బ్లూవేల్ క్రీడ విషయానికొస్తే, యాౖభై రోజులు యాభై టాస్క్లుండటం, ఆఖరున ఆటాడే వారే ఆత్మహత్య చేసుకోవాలనడం దుర్మార్గమైన ముగింపు. ఈ ఆట ఆచూకీ తెలిసేలా, ఈ విషవలయంలో యువత చిక్కుకోకుండా నియంత్రించేలా ఓ హాట్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ‘నాస్కామ్’, ఐటీ లాబీలు కోరాయి. ఆటనే రద్దు చేయాలని కేరళ సర్కారు, కేంద్ర మాతా–శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ తదితరులు కోరిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం నిజంగానే నిషేధించింది. తమ సైట్లలో ఈ ఆట లింకులు కూడా అందుబాటులో ఉండరాదని పలు సామాజిక మాధ్యమాలకు హెచ్చరిక నోటీసులిచ్చింది. ఢిల్లీ హైకోర్టు కూడా పలు సంస్థలకు ఇటువంటి తాఖీ దులిచ్చింది. అయినా ఈ తప్పుడు లింకులు, యాప్‌లు అందుబాటులోనే ఉన్నాయి. హరియాణాలో పిల్లల సంరక్షణ కమిషన్ వారు బడులు, ఇతర విద్యా సంస్థలకు ఈ విషయంలో ఏం చేయాలో/చేయకూడదో మార్గదర్శ కాలిచ్చారు. తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ పూనుకొని తల్లిదండ్రుల కమిటీలకు, ప్రయివేటు బడుల యాజమాన్యాలకు అవగాహన కలిగించే ఓ ఉన్నతస్థాయి సమావేశాన్నే గతవారం నిర్వహించింది. విద్యాసంస్థల్లో యాజ మాన్యాలు, బోధకులు, తల్లిదండ్రులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కేరళలో ఇదివరకే పలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఈ చర్యలు సరిపోవడం లేదు. ఇంతకీ, ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఇదే కీలకమైన ప్రశ్న! ఇటువంటి క్రీడల్ని నిర్వహిస్తూ, ప్రోత్సహించే అత్యధిక సంస్థలు అధికారికమైనవి కావు. దొంగచాటుగా ఈ ఆన్లైన్ క్రీడా ప్రక్రియను నడిపే సంస్థలు (క్రాక్ వెర్షన్స్) యథేచ్ఛగా లింక్‌లు, యాప్‌లు తాము లక్ష్యంగా చేసుకున్న వారికి అందుబాటులోకి తెస్తున్నాయి! పైగా ఏ దర్యాప్తు సంస్థకూ ఈ మారీచులు అంత తేలిగ్గా దొరకరు! వారికి నేటి యువతరం బలహీనతలు తెలుసు. ముఖ్యంగా బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధికుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశా చికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యోగుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం! హేతువేమీ లేకుండానే కొత్త పోకడల వైపు అర్రులు చాచేవారు, ఇప్పుడు చేసే కోర్సుల్లో, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి పారిపోయే మార్గాలు వెతికేవాళ్లు, మంచి మిత్రుల సాంగత్యాలు లేనివారు, తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం! ఇందులో ఒకటి లేదా పలు కారణాల వల్ల నెట్‌కు అతుక్కుపోయే వ్యసనపరులు తేలికగా ఈ వికృత క్రీడలో సమిధలవుతున్నారు. ఇదొక బలహీనత, ఇందుకు కారణాలనేకం! సమిష్టి నుంచి వ్యష్టికి, ఆపై పరిమిత కుటుంబాలకు, చివరకు క్యూబికల్ ఫ్యామిలీస్‌కి, అక్కడక్కడ ఒంటరి (తల్లో, తండ్రో...) పేరెంట్స్గానూ విచ్ఛిన్నమైన మన కుటుంబ వ్యవస్థ కూడా కొంత కారణమే! ఇంటిల్లిపాదీ కలిసి కూర్చొని, మంచీ–చెడూ మాట్లాడుకొని, ఒకరికొకరు భరోసా కల్పించుకొని, పరస్పరం మానసిక స్థయిర్యాన్ని అందిం చుకునే పరిస్థితులు మన సమాజంలో సన్నగిల్లాయి. చిన్న కుటుంబాల్లో తల్లీ,తండ్రీ ఉద్యోగమో, వ్యాపార తదితర వ్యాపకాల్లోనో మునిగితేలే వారయితే, పిల్లలకు కేటాయించే సమయమే తగ్గిపోతోంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో, నెట్‌కు అతు క్కుపోతున్నారో, చెడు సావాసాలు చేస్తున్నారో గమనించే సమయం తల్లిదండ్రులకుండటం లేదు. చిన్నపిల్లల చేతికి తమ అత్యాధునిక స్మార్టు ఫోన్లు స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు. వారితో సమయం వెచ్చించలేని తమ అశక్తతను కప్పిపుచ్చుకుంటూ వారిని అనునయించడానికి దాన్కొక తాయిలంలా ఇచ్చేవారూ ఉన్నారు. కొంచెం పెద్దయితే చాలు అడిగీ అడక్కుండానే సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్, నిరంతర ఇంటర్నెట్ సదుపాయం పిల్లలకు అందించే తల్లిదండ్రులు కోకొల్లలు! చిన్నపిల్లలే కాకుండా కాస్త ఎదిగిన యువత కూడా ఫోన్‌ను సమాచార అవసరాలకు కాకుండా క్రీడా వస్తువుగా వాడటానికే ప్రాధాన్యం ఇస్తారు. బడి, కళాశాల వాతావరణంలో వేర్వేరు కారణాల వల్ల విద్యాపరంగా ఇతర విద్యార్థులతో పోటీ పడలేనివారు, అక్కడ తమ ఓటమిని అధిగమించడానికి ఇటువంటి క్రీడల్లో ‘గెలుపు’ని ప్రత్యామ్నాయ విజయంగా గర్విస్తున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ నేటి యువతను ఈ ఆన్లైన్ వికృతక్రీడల్లో బలయ్యే దుర్బలులను చేస్తున్నాయి. విద్యేతర తపన, సృజనకు ప్రోత్సాహమేది? విలువల పరంగానే కాకుండా ఆచరణ పరంగా కూడా మన విద్యావిధానం దిగజారిపోవడం యువత తప్పుదోవ పట్టడానికి కారణమౌతోంది. వారి ఇతరేతరమైన ప్రతిభను సానపెట్టుకునే అవకాశాలే కనుమరుగయ్యాయి. ఎదిగే విద్యార్థిగా విద్యేతరమైన తన సహజ సృజన, తపన, ఆసక్తుల్ని తీర్చుకునే దారులన్నీ మూసుకుపోయాయి. క్రీడా ప్రోత్సాహం లేదు. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 15 వేల బడుల్లో క్రీడా మైదానాల్లేవు. ఇంకా ఎక్కువ చోట్ల క్రీడా ఉపాధ్యాయులు లేరు. కళాశాలల పరిస్థితి మరింత ఘోరం. ఇక ప్రయివేటు విద్యా సంస్థల గురించి మాట్లాడకపోవడమే మంచిది. పుస్తక పఠనం దాదాపు నిలిచిపోయింది. నాటకాలు, సాహిత్యం వంటి ప్రక్రియల ఊసు లేదు! నదులు, కాలువలు, వాగులు–వంకలు, బావులకు వెళ్లి ఈదులాడే పరిస్థితులు లేవు. ఇవేవీ లేకుండా కెరీరిజం ముసుగులో బడులు, కాలేజీల్లో మనమంతా సృష్టిస్తున్న ఒత్తిడి నడుమ... వారికి స్మార్టుఫోనుల్లో దొరికే ఇంటర్నెట్ ఏడారిలో ఒయా సిస్సులాంటిదే అంటే అతిశయోక్తి కాదు! విద్యా వికాసానికి ఈ సదు పాయాన్ని ఉపయుక్తంగా వాడుకునేలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయ డానికి ఉపాధ్యాయులు, లెక్చరర్లు మేధోపరంగానే కాక సాంకేతికంగా ఎంతో ఎదగాల్సి ఉంది. ఒత్తిడిలో, బాహ్య ప్రేరకాలతో విద్యార్థులు దారి తప్పి నపుడు మానసిక పరిస్థితిని సరిదిద్దేలా కౌన్సిలింగ్‌కు ప్రతి విద్యాసంస్థలో మానసిక నిపుణులుండాలని నిబంధనలు మాత్రమే ఉన్నాయి తప్ప, వారు లేరు. ఈ పరిస్థితులు మారాలి. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటున్న, పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి విషయాల్లో మాత్రం మన పాలకులు కిమ్మనకుండా ఉండటం నిజమైన దౌర్భాగ్యం! ఈ పరిస్థితుల్ని ఇలా కొనసాగనివ్వొద్దు. వీడని నెట్ వ్యసనాలతో, అశ్లీల వెబ్సైట్ల అంటకాగుతూ, ఆన్లైన్ వికృత క్రీడల్లో అలమటించి ఈ దేశపు యువత నిర్వీర్యమై నీరుగారకముందే వ్యవస్థలు మేల్కొనాలి, సరిదిద్దుకోవాలి. సమస్య మూలాల్ని గుర్తించి పరిష్కరించుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో అత్యధిక యువశక్తి దేశంగా ఇప్పుడున్న మన కీర్తి మంటగలసి, అశక్తుల అడ్డాగా మారే ప్రమాదముంది. ‘‘ మానవ సంబంధాలను శాస్త్ర సాంకేతికత అధిగమించే ఓ రోజు వస్తుంది, అప్పుడీ జగత్తంతా ఒఠ్ఠి మూర్ఖులతో నిండి నదై ఉంటుంది’’ అన్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ అంచనాల దిశలో అడుగులు పడ తాయి. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చెరువులోకి దూకాలి.. లేదంటే అమ్మ మరణిస్తుంది
► ‘బ్లూవేల్ గేమ్’లో భాగంగా చెరువులో దూకిన యువతి ► రక్షించిన స్థానికులు, పోలీసులు జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి 17 ఏళ్ల అమ్మాయి చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ప్రమాదకర ‘బ్లూవేల్ గేమ్’ ఆడుతూ ఆత్మహత్యకు యత్నించిన యువతి కథ ఇది. ఏడుస్తూ.. నదిలోకి దూకేసింది.. బీఎస్ఎఫ్ జవాను కూతురైన ఈ అమ్మాయి మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి సోమవారం రాత్రి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఇదే సమయంలో చెరువు వద్ద యువతి అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు గుర్తించారు. ‘స్కూటర్‌పై ఓ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. చెరువులోకి దూకేందుకు వెళ్తుండటంతో ఆపేందుకు ప్రయత్నించాను. ఏం జరిగిందని అడిగితే.. ‘మా అమ్మ చనిపోతుందని చెప్పింది. ఎందుకు చనిపోతుందని అడిగాను. నేను ఆడుతున్న బ్లూవేల్ గేమ్ చివరికి వచ్చింది. గేమ్ పూర్తి చేయకపోతే మా అమ్మ చనిపోతుంది. అని ఏడుస్తూ చెప్పింది’ అని ఓం ప్రకాశ్ అనే స్థానికుడు చెప్పాడు. మాట్లాడుతుండగానే చెరువులోకి దూకిందని, వెంటనే యువతిని కాపాడినట్లు చెప్పాడు. యువతి చెరువులోకి దూకినట్లు తమకు సమాచారం వచ్చిందని, అప్పటికే యువతిని స్థానికులు రక్షించారని పోలీసు అధికారి తెలిపారు. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
ఆడితే జీవితం అంధకారమే
► చెడు అలవాట్లకు దగ్గరయ్యేలా ఉంటున్న మొబైల్ గేమ్స్ ►పిల్లల్లో అవాంఛనీయ మానసిక మార్పులకు అవకాశం ►తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్న నిపుణులు ►జిల్లాలో శ్రుతి మించితున్న విష సంస్కృతి తిరుపతి : బ్లూవెల్ చాలెంజ్.. ప్రపంచాన్నే వణికిస్తున్న ఆన్లైన్ క్రీడ ఇది. చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడేలా ఉసిగొలుపుతున్న మృత్యువల ఇది. అందులో లీనమైతే బ్లేడ్‌తో శరీర భాగాలను కోసుకోవడంతో పైత్యం ప్రారంభమై.. బలవర్మణానికి పాల్పడే వరకు ఎన్నో ఘోరాలు చేయిస్తుంది. ‘‘ఆ భవనంపై మీద నుంచి దూకు ..’’, ‘‘ ఈ నీళ్లల్లో మునుగు’’, .. ‘‘ఆ వంతెన చివర నిలుచుకుని సెల్ఫీ తీసుకుని పంపు’’.. అంటూ పిల్లలను మానసికంగా మెలిపెడుతూ టాస్క్‌లను నిర్వాహకులు (క్యూరేటర్లు) ఇస్తుంటారు. చివరగా ‘‘ నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ .. అంటూ ఆఖరు టాస్క్‌ను నిర్దేశిస్తా రు. అంతే ఆ చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపే ఘోరమైన ఆట ఇది. ప్రపంచవ్యాప్తంగా వెల్తువెత్తుతున్న నిరసనతో ప్రస్తుతం దీనికి అడ్డుకట్టపడిందనే చెప్పవచ్చు. కానీ పిల్లల మనస్సులను ఇంచుమించు ఇదే స్థాయిలో కలుషితం చేస్తున్న మిగతా క్రీడల మాటేమింటి?, అసలు మన పిల్లలు ఆడాల్సింది ఇలాంటి ఆటలా..?, వారు నేర్చుకోవాల్సింది ఇంతటి ప్రమాదకరమైన విషయాలా? ఇంతకంటే ఆనందాలను ఇచ్చే క్రీడలు లేవా? ఇప్పుడు అందరి తల్లిదండ్రులను తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. జిల్లాలోని పిల్లలు విచ్చలవిడిగా ఈ గేమ్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పాఠశాలల్లో, ఇంటి పరిసరాల్లో ఈగేమ్లకు సంబంధించిన మాటలే వినిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు మిత్రులను జూసి ఈ జాడ్యానికి అలవాటు పడుతున్నారని చెబుతున్నారు. → పిల్లలను ఆకట్టుకునేలా ఆటను డిజైన్ చేయడం, గ్రాఫిక్స్‌తో కట్టిపడేయడం,ఒక లెవల్ ఆడగానే మరో లెవల్పై ఉత్సాహం పెరిగేలా చేయడం.. ఇలా మానసికంగా పిల్లలు గేమ్‌ల వలలోకి లాగుతున్నారు. → రైళ్ల మీద పరుగులు పెట్టడం, కత్తులతో ఎదుటవా రిపై దాడిచేయడం, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చి వేయడం, రాక్షసుల్లాంటి వారితో పోరాటాలు చేసి వారిని తుదిముట్టించడం, బాంబులు విసరడం వం టి అసంబద్ధ చర్యలవైపు పిల్లలను పురిగొల్పుతున్నారు. →పెద్దల కోసం ఉన్న రమ్మీలాంటి ఆటలను ఇప్పుడు పాఠశాల పిల్లలు కూడా ఆడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎదుటి ముఠాను తుదముట్టించి దొరికినవి దోచుకెళ్లడం వంటి వికృత ఆటలను పిల్లలు ఆడేస్తున్నట్టు చెబుతున్నారు. జీవితం పక్కదారి: మొబైల్లో ఏఆట ఆడారో దానిని ఎక్కువగా తలచుకోవడం, నిద్ర సమయంలో బాగా కలవరించడం, కలలోకూడా గేమ్‌ల పాత్రలనే ఊహించుకోవడం దీని చర్యల ద్వారా పిల్లల ధ్యాస చదువు నుంచి పక్కదారి పడుతుందంటున్నారు. ఎలాంటి ధ్రువీకరణ ఉండడం లేదు మొబైల్ గేమ్‌ల్లో ఏవి మంచివి, ఏవి ఇబ్బంది కలిగించేవి, ఇందులో పిల్లలకు ఉపయోగపడేవి ఏవి అనేవి అంశాలకు సంబంధించి గూగుల్ప్లేస్స్టోర్లో ఎలాంటి ధ్రువీకరణ ఉండడంలేదని నిపుణులు అంటున్నారు. ఈ తరహా పద్ధతిని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవరసం ఉంటుందంటున్నారు. చేటును ఎలా గుర్తించాలి మొబైల్ గేమ్‌తో 15 నుంచి 20 నిమిషాలు పిల్లలు నిర్విరామంగా మునిగి తేలుతుంటే కచ్చితంగా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. ఇంట్లోవారితో కాకుండా బయటి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడం మరో కారణంగా భావించవచ్చు. పిల్లల అలవాట్లను మార్చేలా ఉండే ఆటలను కచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించాలి. ఇటీవల కాలంలో పాఠశాలలకు మొబైల్ తీసుకురావడం పెరిగిపోతోంది. ► తరగతి మధ్యలో విరామ సమయంలో ఆడటాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ► నగరంలోని పాఠశాలల్లో ప్రతి తరగతిలోని మొబైల్ గేమ్లును ఆడే వారి 5 నుంచి 10 శాతం ► గేమ్‌తో మానసిక వ్యాధుల బారిన పడుతున్న పిల్లల సంఖ్య 2 శాతంగా ఉంది. తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి పిల్లలు చెడుబాట పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ముందు తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువ వాడకూడదు. అంతేగాక పిల్లలు ఎలాంటి గేమ్‌లు ఆడుతున్నారో, అందులో మంచి చెడులు ఏమిటో గుర్తించాలి. వాటిని పూర్తిగా ఒకేసారి మాన్పించడానికి ప్రయత్నించకుండా మంచి మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులే కౌన్సిలర్లుగా వ్యవహరించాలి. మొబైల్గేమ్లు శృతిమించితే వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. – డాక్టర్ ఎన్ఎన్ రాజు, మానసిక నిపుణులు -
డేంజర్ గేమ్... నేను మాత్రం బతికిపోయా!
కోల్‌కతా: రష్యాలో మొదలైన బ్లూ వేల్ ఛాలెంజర్.. సూసైడ్ గేమ్‌గా మారి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. మనదేశంలో కూడా ఇప్పటిదాకా అరడజను విద్యార్థులు ఈ భూతానికి బలైపోయారు. అయితే కోల్‌కతాకు చెందిన ఓ స్టూడెంట్ మాత్రం ప్రాణాలతో బయటపడి, ఆ భయానక అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో బ్లూ వేల్ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఓ స్నేహితుడి ల్యాప్ టాప్ నుంచి గేమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఒక్కో లెవల్ దాటుకుంటూ మెల్లిగా 8 లెవల్‌కి చేరుకున్నాడు కూడా. తర్వాతి లెవెల్లో భాగంగా పెదవులను కోసుకోవాల్సి ఉంది. కానీ, భయంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇంతలో అతను బ్లూ వేల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని గమనించిన తోటివిద్యార్థులు విషయాన్ని కాలేజీ రిజిస్ట్రారర్ తపస్ సతాపతి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి అవగాహన కల్పించటంతో తపస్ పోలీసుల సాయం కోరారు. గత బుధవారం ఓ సీఐడీ అధికారి, విద్యార్థిని మరియు అతని తల్లిదండ్రలను కూర్చోబెట్టి ఈ రాకాసి గేమ్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. ఆటలో భాగంగా తన చేతిపై బ్లేడ్‌తో గేమ్ సింబల్‌ను గీసుకున్న బాలుడు ఆ గాయన్ని చూపిస్తూ ‘నేను ప్రాణాలతో బతికిపోయా’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ‘క్రమక్రమంగా బ్లూవేల్‌కు నేను బానిసను అయ్యాను. అందులోని ఒక్కో సూచనలు నాలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే శరీరానికి గాయాలు చేసుకున్న సమయంలో మాత్రం కాస్త వణికిపోయాను’ అని అతను వివరించాడు. తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు మరియు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐడీ ఆఫీసర్‌కు రుణపడి ఉంటానని సదరు విద్యార్థి చెబుతున్నాడు. బ్లూవేల్ గేమ్ దాటికి గత నెలలో ముంబైలో ఓ స్కూల్ విద్యార్థి భవనం నుంచి దూకి చనిపోగా, కేరళలోనూ ఓ ఆత్మహత్య నమోదయ్యింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల పార్థ్ సింగ్ ఉరి వేసుకుని చనిపోయిన విషయం విదితమే. -
‘బ్లూ వేల్ ఛాలెంజ్’కు బలవుతున్నారా?
న్యూఢిల్లీ: దేశంలో ‘బ్లూ వేల్ ఛాలెంజ్’ వీడియో గేమ్ సష్టిస్తున్న అలజడి ఇంతా అంతా కాదు. గత నెలరోజుల్లో ఎంతో మంది టీనేజర్లు ఈ వీడియో గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు వెలువడడం ఎంతో మంది పిల్లల తల్లిదండ్రులను భయకంపితుల్ని చేసిందీ, చేస్తోంది. ఈ విషయమై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కేంద్ర హోం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రుల దష్టికి స్వయంగా తీసుకెళ్లగా ‘బ్లూ వేల్ ఛాలెంజ్’ గేమ్‌కు సంబంధించిన అన్ని లింక్‌లను తీసివేయాల్సిందిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ లాంటి సర్చ్, వెబ్ సంస్థలకు ఉత్తర్వులు అందాయి. రష్యా నుంచి పుట్టుకొచ్చిందని భావిస్తున్న ఈ గేమ్‌కు నిజంగా టీనేజ్ పిల్లలు ఆకర్షితులై అన్యాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? ఇప్పటి వరకు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు భావిస్తున్న పిల్లలు నిజంగా ఈ గేమ్‌ను ఆడారా? వారి మరణానికి మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చిందేమిటీ? ఒక్కో ఆత్మహత్యకు సంబంధించిన కేసును లోతుగా పరిశీలించినప్పుడే అందులోని నిజా నిజాలు వెలుగు చూస్తాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆగస్టు 12వ తేదీన అంకన్ దేవ్ అనే 15 ఏళ్ల బాలుడు ముఖానికి ప్లాస్టిక్ కవరు, మెడకు టవల్‌ను చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతను ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం జరిగిందీ. పత్రికల్లో ఆ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అతని దగ్గరి మిత్రుల వద్దకు పోలీసులు వెళ్లి వాకబు చేయగా, చనిపోవడానికి రెండు, మూడు రోజుల ముందు అంకన్ దేవ్ తాను రాసినట్లుగా ఓ చిన్న ఇంగ్లీషు పోయమ్ వారికి చూపించారట. తీవ్ర మానసిక క్షోభను వ్యక్తం చేస్తున్న ఆ పోయం వాస్తవానికి తాను రాసింది కాదనీ, నెట్లో కనిపిస్తే కాపీ చేశానని, ఎవరు రాశారో కూడా తెలియదని ఆ తర్వాత చెప్పారట. ‘అంకన్ దేవ్ వీడియో గేమ్‌లు ఆడేందుకు ఆయన వద్ద స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. అప్పుడప్పుడు తండ్రి షాప్‌లో ఉన్న కంప్యూటర్‌పై ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంటాడు. ఆ బాలుడు సర్చ్ చేసిన అన్ని సైట్లను క్షుణ్నంగా పరిశీలించాం. బ్లూవేల్ గేమ్ పరిచయం ఉన్న సూచనలు కూడా లేవు. ఈ గేమ్‌కు ఆ బాలుడి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు. ఇంగ్లీషు పోయం కారణంగా ఆ బాలుడు మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని పశ్చిమ మిడ్నాపూర్ ఎస్పీ భారతి ఘోష్ తెలిపారు. మరి గేమ్‌తో లింక్ ఎలా వచ్చింది? అంకన్ దేవ్ ఆత్మహత్యపై కారణాలు కనుక్కొనేందుకు ఆయన మిత్రుల వద్దకు ఓ స్థానిక విలేకరి వెళ్లారు. దేవ్ అప్పుడప్పుడు వీడియో గేమ్ ఆడతాడని చెప్పేవాడని, ఏం వీడియో గేమ్‌లు ఆడుతాడో తమకు తెలియదని మిత్రులు తెలిపారు. అప్పటికే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణంగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు వ్యాప్తిలో ఉండడంతో తాను కూడా బాలుడి ఆత్మహత్యను గేమ్‌కు ముడిపెట్టి రాసినట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సదరు విలేకరి తెలిపారు. ముంబై, ఢిల్లీ నగరంలో కూడా పిల్లల ఆత్మహత్యలకు ఈ గేమ్ కారణమంటూ వార్తొలొచ్చాయి. అయితే వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తూర్పు అంధేరిలో జూలై 29వ తేదీన 14 ఏళ్ల బాలుడు ఏడంతస్థుల మేడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మరుక్షణం నా ఫొటో మినహా మరేమి మిగలదు’ అన్న వ్యాఖ్యానంతో ఆ బాలుడు సెల్ఫీదిగి మేడమీది నుంచి దూకేశాడు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణంగా ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ జూలై 31వ తేదీన పత్రికల్లో వార్తలొచ్చాయి. భారత్‌లో ఇదే తొలి బ్లూ వేల్ ఛాలెంజ్ చావని కూడా ప్రచారమైంది. గేమ్ కారణంగానే బాలుడు ఆత్మహత్య చేసుకున్నారని విశ్వసనీయ పోలీసు వర్గాలు తెలిపాయంటూ, ఇద్దరు టీచర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారని పత్రికల్లో వచ్చిన వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ విషయమై బాలుడి టీచర్లను విచారించగా, ఆ బాలుడు వీడియో గేమ్ ఆడుతాడని తోటి పిల్లల ద్వారా తెల్సిందికానీ, ఏ వీడియో గేమ్‌లు ఆడతారో తెలియదని చెప్పారు. తోటి విద్యార్థులు కూడా ఇదే విషయం చెప్పారు. గేమ్‌కు ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు తమకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేసును దర్యాప్తు చేస్తున్న మెగ్వాడి పోలీసు సీనియర్ ఇనిస్పెక్టర్ పాండురంగ్ పాటిల్ చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ కాస్ ప్రాంతంలో మణిపూర్ మాజీ మంత్రి కుమారుడు, 19 ఏళ్ల యువకుడు ఆగస్టు 12వ తేదీన మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన చావుకు కూడా ఇదే గేమ్ కారణమంటూ వార్తలొచ్చాయి. అది ఆత్మహత్యనే కాదని, ప్రమాదవశాత్తు మేడ మీది నుంచి పడిపోయి మరణించాడని, అందుకే నిర్లక్ష్యం కారణంగా మరణించారని కేసు నమోదు చేశామని కేసును దర్యాప్తు చేస్తున్న అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆగస్టు 10వ తేదీన స్కూల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని, మరో స్కూల్లో 14 ఏళ్ల బాలుడు కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఓ టీచర్ రక్షించాడని వార్తలు వచ్చాయి. వాటికి కూడా బ్లూ వేల్ గేమ్‌ను లింక్ పెట్టారు. వారి ఆత్మహత్య ప్రయత్నాలకు, ఈ వీడియో గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. అసలు కారణాలేమిటో వెల్లడించడానికి వారి తల్లిదండ్రులుగానీ, టీచర్లుగానీ ఇష్టపడలేదు. 2015 నవంబర్ నెల నుంచి 2016, ఏప్రిల్ మధ్య సంభవించిన 130 పిల్లల ఆత్మహత్యలను విశ్లేషించిన ‘నోవయా గెజెట్టా’ వెబ్సైట్, వాటిలో 80 ఆత్మహత్యలకు బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణమంటూ 2016, మే నెలలో ఓ వార్తా కథనం ప్రచురించడంతో ఈ గేమ్ గురించి మొదటి సారి భారత్‌తోపాటు ఇతర ప్రపంచానికి తెల్సింది. ఈ వార్తా కథనంపై అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రేడియో ఫ్రీ యూరప్’ పరిశోధన జరిపి వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. -
బ్లూవేల్ గేమ్.. ఓ మృత్యు క్రీడ
అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్ - ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తున్న డేంజర్ - ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్య - 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ప్రభావం - తాజాగా భారత్‌లోనూ పంజా విసురుతున్న మృత్యు క్రీడ - గేమ్ ఆడుతూ ముంబైలో భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి - షోలాపూర్, ఇండోర్లలో మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం - గేమ్ సృష్టికర్త రష్యాకు చెందిన ఓ సైకాలజీ విద్యార్థి - పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్న నిపుణులు ముంబైలోని అంధేరీలో మన్‌ప్రీత్ సహాన్ అనే 14 ఏళ్ల విద్యార్థి ఓ భవనంపై నుంచి దూకేశాడు.. షోలాపూర్‌లో మరో 14 ఏళ్ల విద్యార్థి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి సుధీర్ స్కూల్ భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.. మూడూ వేర్వేరు ఘటనలు.. వేర్వేరు ప్రాంతాల్లో అయినా.. కారణం మాత్రం ఒకటే.. అదే ‘బ్లూవేల్ చాలెంజ్’.. ఓ సోషల్ మీడియా గేమ్.. సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ ఇది.. 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట చిన్నారులను హిప్నటైజ్ చేస్తుంది. భావోద్వేగాలతో పిల్లలను మృత్యుఒడిలోకి తోసేస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో ఇప్పటికే వందలాది మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న ఈ ఆట.. ఇప్పుడు భారత్‌లో పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ ప్రమాదకరమైన గేమ్ నుంచి రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ఏమిటి, పర్యవసానాలు, ప్రమాదాలు, జాగ్రత్తలపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్.. -సాక్షి, ముంబై/తెలంగాణ డెస్క్ ముంబైలోని అంధేరీకి చెందిన మన్‌ప్రీత్ సహాన్ అనే 14 ఏళ్ల బాలుడు బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ఆడుతూ జూలై 30న బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా శనివారం పశ్చిమబెంగాల్లో అంకన్ డే అనే విద్యార్థి తలకు ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. నిషేధించాలని ప్రధానికి లేఖ.. అత్యంత ప్రమాదకరమైన బ్లూవేల్ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అమాయక పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం లేఖ రాశారు. రాజ్యసభలోనూ పలువురు సభ్యులు బ్లూవేల్ అంశాన్ని లేవనెత్తారు. అందులోని టాస్క్‌లను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముంబైలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని ఎంపీ అమర్ శంకర్ సబ్లే వివరించారు. ఆన్లైన్లో ఇలాంటి డెత్ గేమ్స్ మరిన్ని ఉన్నాయని, వాటన్నింటినీ నిషేధించాలని మరో ఎంపీ వికాశ్ మహాత్మా పేర్కొన్నారు. బ్లూవేల్ గేమ్ కారణంగా మహారాష్ట్రలో ఓ విద్యార్థి మరణించడం, మరో విద్యార్థి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. దాంతో ఆ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో జూలై 31న చర్చ కూడా జరిగింది. ఆ గేమ్ వివరాలు పూర్తిగా సేకరిస్తామని.. దాన్ని నిలిపేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. వందల మంది పిల్లలు బలి బ్లూవేల్ చాలెంజ్ గేమ్ వల్ల రష్యాలో 130 మంది, అమెరికాలో ఇద్దరు టీనేజర్లు మృతిచెందారు. అర్జెంటీనా ఎంటర్ రోస్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 27న బెంజమన్ (16)అనే టీనేజర్ ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను మే 31న బ్లూవేల్ గేమ్ ఆడుతూ ఆసుపత్రి పాలైనట్లు విచారణలో వెల్లడైంది. లాప్లాటాలో 12 ఏళ్ల బాలిక బ్లూవేల్ గేమ్ ఆడుతూ చేతిపై బ్లేడుతో కోసుకుందని ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాన్జాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఈ గేమ్ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక బూర్కడీ మెసీడో బ్రిడ్జిపై నిలబడి దూకుతుండగా.. అక్కడే ఉన్న కొందరు గమనించి పట్టుకున్నారు. ఓ 17 ఏళ్ల బాలుడు తన ఫేస్బుక్ టైమ్‌లైన్‌లో ‘బ్లేమ్ ఇట్ ఆన్ ది వేల్’అని రాసి నీటిలో దూకేశాడు. ఇలాంటివి చాలా దేశాల్లో చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పిల్లల్ని కాపాడుకోండి.. బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రాణాంతక ఆటల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి. అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. ఈ గేమ్ జోలికి పిల్లల్ని వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రుల్ని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా సైట్లు కూడా తమ యూజర్లను ఈ గేమ్ బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. ఫేస్బుక్లో టీనేజ్ యూజర్ ఎవరైనా బ్లూవేల్ చాలెంజ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వెతికితే వెనువెంటనే.. ‘మీరు ఓకే కదా? మీకేమైనా సహాయం కావాలా?’అనే ప్రశ్న తెరమీద ప్రత్యక్షమవుతుంది. ఇక ఇన్‌స్ట్రాగామ్‌లో టంబ్లర్లో బ్లూవేల్ చాలెంజ్ అని టైప్ చేయగానే ఓ నీలిరంగు పేజీ ప్రత్యక్షమై అంతా ఓకేనా? అని అడుగుతుంది. చెప్పి మరీ దూకేశాడు జూలై 31న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి మన్‌ప్రీత్ సహాన్ బ్లూవేల్ చాలెంజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని ఆడిన మన్‌ప్రీత్.. ఎలాగైనా గేమ్ గెలవాలని భావించి.. చివరి టాస్క్‌గా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అసలు జూలై 31న తాను పాఠశాలకు రావడం లేదని 28వ తేదీనే సహాన్ తన స్నేహితులకు చెప్పాడు. గేమ్ చివరి రోజు (31వ తేదీ)న భవనంపై కూర్చుని.. తాను దూకేయబోతున్నానంటూ స్నేహితులకు వాట్సాప్‌లో సందేశాలు పెట్టాడు. దానిని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాసేపటికే సహాన్ కిందికి దూకేశాడు. అంతకు రెండురోజుల ముందు నుంచే ‘భవనం పైనుంచి దూకడం ఎలా?’అని గూగుల్‌లో సెర్చ్ చేశాడని పోలీసులు గుర్తించారు. స్కూల్ భవనంపై నుంచి దూకబోయి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చదువుతున్న పాఠశాల భవనంలో మూడో అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు. సమయానికి తోటి విద్యార్థులు గమనించి ఆ విద్యార్థిని పట్టుకుని వెనక్కి లాగారు. అలా దూకేందుకు కారణమేమిటని పరిశీలిస్తే.. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కారణమని తేలింది. ఆ విద్యార్థి తన తండ్రికి చెందిన స్మార్ట్‌ఫోన్‌లో కొద్దిరోజులుగా బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. ఒక్కో టాస్క్ పూర్తి చేస్తూ.. ఆట చివరి 50వ టాస్క్‌కు వచ్చాడు. అందులో ఏదైనా భవనం పైనుంచి దూకేయాలని ఉండడంతో.. స్కూల్ భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. గేమ్ ఆడుతూ పారిపోయాడు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే 14 ఏళ్ల విద్యార్థి కొద్దిరోజులుగా సరిగా నిద్రపోకుండా ముభావంగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్ పట్టుకుని కనిపించాడు. ఏదో స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇటీవల సుధీర్ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, వెతికే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిపెట్టాడు. దీంతో సుధీర్ తల్లిదండ్రులు హతాశులై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుధీర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లడంతో.. పోలీసులు ఆ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో అతడిని పట్టుకున్నారు. ఎందుకిలా వెళ్లావని ప్రశ్నిస్తే.. అంతా ‘బ్లూవేల్ గేమ్’ఆడడం వల్లేనని బయటపడింది. తలకు ప్లాస్టిక్ బ్యాగు తొడుక్కుని.. పశ్చిమబెంగాల్లోని పశ్చిమమిడ్నాపూర్ జిల్లా ఆనంద్‌పూర్‌లో 15 ఏళ్ల వయసున్న మరో విద్యార్థి కూడా ‘బ్లూవేల్’కు బలైపోయాడు. తలపై నుంచి ప్లాస్టిక్ బ్యాగు తొడుక్కుని.. దానికి నైలాన్ తాడు చుట్టుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడి ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అంకన్ డే.. శనివారం స్కూలు ముగించుకుని ఇంటికి వచ్చాడు. టిఫిన్ చేయడానికని తల్లి పిలిస్తే.. స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్లాడు. చాలా సేపయినా బయటికి రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా చనిపోయి కనిపించాడు. బ్లూవేల్ గేమ్‌లో భాగంగానే అంకన్ డే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏమిటీ బ్లూవేల్ చాలెంజ్..? బ్లూవేల్ చాలెంజ్.. ఓ సైకో గేమ్. 50 రోజులపాటు రోజుకో టాస్క్ (ఏదైనా పని) ఇచ్చి చేయమంటుంది. మెల్లమెల్లగా పిల్లల భావోద్వేగాలను లొంగదీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడడం ప్రారంభించాక మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసినట్లు రుజువుగా సంబంధిత టాస్క్‌ల ఫొటోలను గేమ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటార్ (అడ్మినిస్ట్రేటర్) ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది! ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని.. భయం గొలిపే హర్రర్ సినిమాలను చూడాలని.. చేతిపై బ్లేడుతో గానీ, కత్తితో గానీ ఏమైనా బొమ్మల ఆకారాలను గీయాలని.. అర్ధరాత్రి లేచి బిల్డింగ్‌పైకి వెళ్లాలని.. అక్కడే ఒంటరిగా కూర్చోవాలని.. ఇలా రకరకాల టాస్క్‌లు ఇస్తాడు. శరీరంపై సిరంజీలతో గుచ్చుకోమంటాడు. ఏదైన బ్రిడ్జిపై అంచున నిలబడి, సెల్ఫీ తీసి అప్లోడ్ చేయమంటాడు. సరదాగా నగ్నంగా ఫొటోలు తీసుకుని, షేర్ చేయాలని చెప్తాడు. ఇలా తప్పులపై తప్పులు చేయిస్తున్నా.. టీనేజర్లు అంతా ఆటలో భాగమేనన్న భ్రమల్లోనే ఉంటారు. ఇలా ఈ గేమ్ పూర్తిగా హిప్నటైజ్ చేస్తుంది. 49 రోజుల పాటు టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా బిల్డింగ్ పైనుంచి దూకాలని, వంతెనపై నుంచి నది నీటిలో దూకాలని ఆదేశిస్తాడు. అలాగైతేనే గేమ్ పూర్తయినట్లని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. ఎక్కడ ప్రారంభమైంది..? రష్యాలో 2013లో ఈ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ ప్రారంభమైంది. కోంటక్టే (వీకే) అనే రష్యా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో ఇది ఊపిరిపోసుకుంది. రష్యాకే చెందిన ఫిలిప్ బుడెకిన్ (22) అనే సైకాలజీ విద్యార్థి దీనిని సృష్టించాడు. ఈ గేమ్ కారణంగా 2015లో మొదటి ఆత్మహత్య వెలుగుచూసింది. ఆ తర్వాత రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోవడంతో రష్యాలో ఓ జర్నలిస్టు దీనిపై ఓ కథనం రాశాడు. దీంతో ఈ గేమ్ ప్రభావం అందరికి తెలిసింది. ముఖ్యంగా ఈ గేమ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. బ్లూవేల్ గేమ్‌ను సృష్టించినందుకు ఫిలిప్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బతికే హక్కు లేనివారిని ప్రపంచంలో లేకుండా చేసి సమాజాన్ని క్లీన్‌గా చేయడమే తన ఉద్దేశమని అరెస్టు సందర్భంగా ఫిలిప్ వాదించాడు. పైగా మరణించిన వారంతా వారి ఇష్ట పూర్వకంగానే ఆత్మహత్య చేసుకున్నారని సమర్థించుకున్నాడు. ఫిలిప్ అరెస్టైనా బ్లూవేల్ గేమ్ కొనసాగుతుండడం, పర్యవసానాలు వెలుగుచూస్తుండడంతో దీని వెనుక ఏదైనా గ్రూప్ పనిచేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. మొదట రష్యాలో తర్వాత దుబాయ్‌లో అరాచకాన్ని కొనసాగించిన బ్లూవేల్ చాలెంజ్... తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ దేశాల్లోకి ప్రవేశించింది. చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, బల్గేరియా, కొలంబియా, అమెరికా ఇలా చాలా దేశాలకూ వ్యాపించింది. ఇటీవల భారత్‌లోనూ ప్రవేశించింది. అయితే బ్లూవేల్ సంబంధిత వెబ్సైట్లను చైనా పూర్తిగా నిషేధించింది. -
ఫోన్లో ఆ గేమ్ ఆడి.. ఆత్మహత్యలు
ప్రపంచవ్యాప్తంగా ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ పిల్లల ఉసురు తీస్తోంది. గంటల కొద్దీ గేమ్‌ను ఆడి మానసికంగా దానికి బానిసై.. చివరకు ఓడి.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ గేమ్ మహమ్మారి కేరళలోని పాఠశాల విద్యార్థులపై పడింది. దాదాపు రెండు వేల మందిపైగా కేరళ విద్యార్థులు ఈ గేమ్‌ను ఆడుతూ మానసికంగా కుంగిపోతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పేర్కొనడం గమనార్హం. అసలేంటి గేమ్ అపార విజ్ఞాన, వినోదాలకు కేంద్రమైన ఇంటర్నెట్లో కొందరు సాంకేతిక నిపుణులు శాడిస్టులుగా మారి తయారు చేసినదే బ్లూ వేల్ గేమ్. యువతను ముఖ్యంగా హైస్కూలు విద్యార్థులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడానికి ఈ గేమ్‌ను అభివృద్ధిపరిచారు. విదేశాల్లో ఇప్పటికే వేలాది మంది పిల్లలు ఈ గేమ్ బారినపడి ప్రాణాల వదిలారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్‌కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లూవేల్ గేమ్ లేదా బ్లూవేల్ ఛాలెంజ్‌గా దీనిని పిలుస్తారు. సోషల్‌మీడియా వేదికగా కొందరు ఈ గేమ్‌ను నిర్వహిస్తుంటారు. దాదాపు 50 రోజుల పాటు పలు విధాలైన సవాళ్లను ఎదుర్కొంటు ఆట ఆడటానికి ఉంచుతారు. చివరగా భవనం పైనుంచి దూకమని లేదా ఇతరత్రా ఆత్మహత్యా మార్గాలను సూచిస్తారు. అప్పటికే ఆట మజా చూసిన వారు ఏ మాత్రం ఆలోచించకుండా సవాల్ స్వీకరించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐరోపా, అమెరికాల్లో ఈ గేమ్‌పై విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వాలు ఆటను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆటలో చేరిన వారికి మొదట సులభమైన సవాళ్లను ఉంచుతారు. తెల్లవారుజామున నిద్ర లేయడం, హర్రర్ సినిమా చూడటం, చేతులపై తిమింగలం బొమ్మను గీసుకోవడం.. తదితర సవాళ్లతో ఆసక్తిని పెంచుతారు. ప్రతి సవాల్‌ను అధిగమించినవారు తమ గెలుపును గ్రూప్‌లోని ఇతర సభ్యులు తెలుసుకునేందుకు వీలుగా ఫోటోల రూపంలో ఆన్లైన్లో పోస్ట్ చేసి ఆటలోని మజాను రుచి చూపిస్తారు. ఎవరు తయారు చేశారు? ఈ ఆటను 2013లో రష్యాకు చెందిన ఫిలిప్ బుడెయ్కిన్ అనే మానసిక శాస్త్ర విద్యార్థి కనిపెట్టినట్టు తెలుస్తోంది. కొద్దికాలం క్రితం అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సమాజాన్ని శుద్ధి చేయాలన్న ఆలోచనతోనే ఈ గేమ్‌ను ప్రవేశపెట్టినట్టు అతను ప్రకటించడం గమనార్హం. పినరాయి విజయన్ ఫిర్యాదు కేరళలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు బ్లూ వేల్ గేమ్ బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గేమ్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులు బ్లూవేల్‌కు బానిసలైనట్లు సమాచారం ఉంది.