ఫోన్‌లో ఆ గేమ్ ఆడి.. ఆత్మహత్యలు
ప్రపంచవ్యాప్తంగా ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ పిల్లల ఉసురు తీస్తోంది. గంటల కొద్దీ గేమ్‌ను ఆడి మానసికంగా దానికి బానిసై.. చివరకు ఓడి.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ గేమ్ మహమ్మారి కేరళలోని పాఠశాల విద్యార్థులపై పడింది. దాదాపు రెండు వేల మందిపైగా కేరళ విద్యార్థులు ఈ గేమ్‌ను ఆడుతూ మానసికంగా కుంగిపోతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పేర్కొనడం గమనార్హం.
అసలేంటి గేమ్
అపార విజ్ఞాన, వినోదాలకు కేంద్రమైన ఇంటర్నెట్‌లో కొందరు సాంకేతిక నిపుణులు శాడిస్టులుగా మారి తయారు చేసినదే బ్లూ వేల్ గేమ్. యువతను ముఖ్యంగా హైస్కూలు విద్యార్థులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడానికి ఈ గేమ్‌ను అభివృద్ధిపరిచారు. విదేశాల్లో ఇప్పటికే వేలాది మంది పిల్లలు ఈ గేమ్ బారినపడి ప్రాణాల వదిలారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్‌కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లూవేల్ గేమ్ లేదా బ్లూవేల్ ఛాలెంజ్‌గా దీనిని పిలుస్తారు.
సోషల్‌మీడియా వేదికగా కొందరు ఈ గేమ్‌ను నిర్వహిస్తుంటారు. దాదాపు 50 రోజుల పాటు పలు విధాలైన సవాళ్లను ఎదుర్కొంటు ఆట ఆడటానికి ఉంచుతారు. చివరగా భవనం పైనుంచి దూకమని లేదా ఇతరత్రా ఆత్మహత్యా మార్గాలను సూచిస్తారు. అప్పటికే ఆట మజా చూసిన వారు ఏ మాత్రం ఆలోచించకుండా సవాల్ స్వీకరించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐరోపా, అమెరికాల్లో ఈ గేమ్‌పై విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వాలు ఆటను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ ఆటలో చేరిన వారికి మొదట సులభమైన సవాళ్లను ఉంచుతారు. తెల్లవారుజామున నిద్ర లేయడం, హర్రర్ సినిమా చూడటం, చేతులపై తిమింగలం బొమ్మను గీసుకోవడం.. తదితర సవాళ్లతో ఆసక్తిని పెంచుతారు. ప్రతి సవాల్‌ను అధిగమించినవారు తమ గెలుపును గ్రూప్‌లోని ఇతర సభ్యులు తెలుసుకునేందుకు వీలుగా ఫోటోల రూపంలో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి ఆటలోని మజాను రుచి చూపిస్తారు.
ఎవరు తయారు చేశారు?
ఈ ఆటను 2013లో రష్యాకు చెందిన ఫిలిప్ బుడెయ్‌కిన్ అనే మానసిక శాస్త్ర విద్యార్థి కనిపెట్టినట్టు తెలుస్తోంది. కొద్దికాలం క్రితం అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సమాజాన్ని శుద్ధి చేయాలన్న ఆలోచనతోనే ఈ గేమ్‌ను ప్రవేశపెట్టినట్టు అతను ప్రకటించడం గమనార్హం.
పినరాయి విజయన్ ఫిర్యాదు
కేరళలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు బ్లూ వేల్ గేమ్ బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గేమ్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులు బ్లూవేల్‌కు బానిసలైనట్లు సమాచారం ఉంది.