ఆడితే జీవితం అంధకారమే
► చెడు అలవాట్లకు దగ్గరయ్యేలా ఉంటున్న మొబైల్ గేమ్స్
►పిల్లల్లో అవాంఛనీయ మానసిక మార్పులకు అవకాశం
►తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్న నిపుణులు
►జిల్లాలో శ్రుతి మించితున్న విష సంస్కృతి
తిరుపతి : బ్లూవెల్ చాలెంజ్.. ప్రపంచాన్నే వణికిస్తున్న ఆన్‌లైన్ క్రీడ ఇది. చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడేలా ఉసిగొలుపుతున్న మృత్యువల ఇది. అందులో లీనమైతే బ్లేడ్‌తో శరీర భాగాలను కోసుకోవడంతో పైత్యం ప్రారంభమై.. బలవర్మణానికి పాల్పడే వరకు ఎన్నో ఘోరాలు చేయిస్తుంది. ‘‘ఆ భవనంపై మీద నుంచి దూకు ..’’, ‘‘ ఈ నీళ్లల్లో మునుగు’’, .. ‘‘ఆ వంతెన చివర నిలుచుకుని సెల్ఫీ తీసుకుని పంపు’’.. అంటూ పిల్లలను మానసికంగా మెలిపెడుతూ టాస్క్‌లను నిర్వాహకులు (క్యూరేటర్లు) ఇస్తుంటారు.
చివరగా ‘‘ నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ .. అంటూ ఆఖరు టాస్క్‌ను నిర్దేశిస్తా రు. అంతే ఆ చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిపే ఘోరమైన ఆట ఇది. ప్రపంచవ్యాప్తంగా వెల్తువెత్తుతున్న నిరసనతో ప్రస్తుతం దీనికి అడ్డుకట్టపడిందనే చెప్పవచ్చు. కానీ పిల్లల మనస్సులను ఇంచుమించు ఇదే స్థాయిలో కలుషితం చేస్తున్న మిగతా క్రీడల మాటేమింటి?, అసలు మన పిల్లలు ఆడాల్సింది ఇలాంటి ఆటలా..?, వారు నేర్చుకోవాల్సింది ఇంతటి ప్రమాదకరమైన విషయాలా? ఇంతకంటే ఆనందాలను ఇచ్చే క్రీడలు లేవా? ఇప్పుడు అందరి తల్లిదండ్రులను తొలిచివేస్తున్న ప్రశ్న ఇది.
జిల్లాలోని పిల్లలు విచ్చలవిడిగా ఈ గేమ్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పాఠశాలల్లో, ఇంటి పరిసరాల్లో ఈగేమ్‌లకు సంబంధించిన మాటలే వినిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు మిత్రులను జూసి ఈ జాడ్యానికి అలవాటు పడుతున్నారని చెబుతున్నారు.
→ పిల్లలను ఆకట్టుకునేలా ఆటను డిజైన్ చేయడం, గ్రాఫిక్స్‌తో కట్టిపడేయడం,ఒక లెవల్ ఆడగానే మరో లెవల్‌పై ఉత్సాహం పెరిగేలా చేయడం.. ఇలా మానసికంగా పిల్లలు గేమ్‌ల వలలోకి లాగుతున్నారు.
→ రైళ్ల మీద పరుగులు పెట్టడం, కత్తులతో ఎదుటవా రిపై దాడిచేయడం, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చి వేయడం, రాక్షసుల్లాంటి వారితో పోరాటాలు చేసి వారిని తుదిముట్టించడం, బాంబులు విసరడం వం టి అసంబద్ధ చర్యలవైపు పిల్లలను పురిగొల్పుతున్నారు.
→పెద్దల కోసం ఉన్న రమ్మీలాంటి ఆటలను ఇప్పుడు పాఠశాల పిల్లలు కూడా ఆడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎదుటి ముఠాను తుదముట్టించి దొరికినవి దోచుకెళ్లడం వంటి వికృత ఆటలను పిల్లలు ఆడేస్తున్నట్టు చెబుతున్నారు.
జీవితం పక్కదారి: మొబైల్‌లో ఏఆట ఆడారో దానిని ఎక్కువగా తలచుకోవడం, నిద్ర సమయంలో బాగా కలవరించడం, కలలోకూడా గేమ్‌ల పాత్రలనే ఊహించుకోవడం దీని చర్యల ద్వారా పిల్లల ధ్యాస చదువు నుంచి పక్కదారి పడుతుందంటున్నారు.
ఎలాంటి ధ్రువీకరణ ఉండడం లేదు
మొబైల్ గేమ్‌ల్లో ఏవి మంచివి, ఏవి ఇబ్బంది కలిగించేవి, ఇందులో పిల్లలకు ఉపయోగపడేవి ఏవి అనేవి అంశాలకు సంబంధించి గూగుల్‌ప్లేస్‌స్టోర్‌లో ఎలాంటి ధ్రువీకరణ ఉండడంలేదని నిపుణులు అంటున్నారు. ఈ తరహా పద్ధతిని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవరసం ఉంటుందంటున్నారు.
చేటును ఎలా గుర్తించాలి
మొబైల్ గేమ్‌తో 15 నుంచి 20 నిమిషాలు పిల్లలు నిర్విరామంగా మునిగి తేలుతుంటే కచ్చితంగా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. ఇంట్లోవారితో కాకుండా బయటి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడం మరో కారణంగా భావించవచ్చు. పిల్లల అలవాట్లను మార్చేలా ఉండే ఆటలను కచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించాలి. ఇటీవల కాలంలో పాఠశాలలకు మొబైల్ తీసుకురావడం పెరిగిపోతోంది.
► తరగతి మధ్యలో విరామ సమయంలో ఆడటాన్ని ఆపాల్సిన అవసరం ఉంది.
► నగరంలోని పాఠశాలల్లో ప్రతి తరగతిలోని మొబైల్ గేమ్‌లును ఆడే వారి 5 నుంచి 10 శాతం
► గేమ్‌తో మానసిక వ్యాధుల బారిన పడుతున్న పిల్లల సంఖ్య 2 శాతంగా ఉంది.
తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి
పిల్లలు చెడుబాట పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ముందు తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువ వాడకూడదు. అంతేగాక పిల్లలు ఎలాంటి గేమ్‌లు ఆడుతున్నారో, అందులో మంచి చెడులు ఏమిటో గుర్తించాలి. వాటిని పూర్తిగా ఒకేసారి మాన్పించడానికి ప్రయత్నించకుండా మంచి మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులే కౌన్సిలర్లుగా వ్యవహరించాలి. మొబైల్‌గేమ్‌లు శృతిమించితే వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి.
– డాక్టర్ ఎన్‌ఎన్ రాజు, మానసిక నిపుణులు