కోల్‌కతా: సోషల్ మీడియాలో మరో ప్రాణాంతక ఛాలెంజ్ హల్‌చల్ చేస్తోంది. బ్లూ వేల్ తరహాలోనే ఈ ఛాలెంజ్ కూడా పలు దేశాలకు తలనొప్పిగా మారింది. గత వారం అర్జెంటీనాకు చెందిన 12 ఏళ్ల బాలిక మోమో ఛాలెంజ్ కారణంగానే ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాజాగా భారత్‌లో కూడా మోమో ఛాలెంజ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురికి చెందిన కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ యువతి వాట్సప్‌కు మోమో ఛాలెంజ్‌కు సంబంధించి సందేశం రావడంతో ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తనకు ఓ గుర్తు తెలియని నంబరు నుంచి మోమో ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సందేశం వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారు తనతో మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. దీంతో భయపడి ఈ విషయం తన అన్నకు తెలుపగా.. ఆయన హెచ్చరికలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మోమో ఛాలెంజ్:
గతేడాది ప్రపంచవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు బలిగొన్న బ్లూ వేల్ తరహాలోనే మోమో ఛాలెంజ్ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిచేత ప్రాణాంతక టాస్క్‌లు చేయించడం ఈ గేమ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్ తొలుత ఫేస్‌బుక్‌లో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గుర్తు తెలియని నంబర్ నుంచి సోషల్ మీడియా ఉపయోగించే యువతను సంప్రదిస్తారు. ఒకసారి మోమో ఛాలెంజ్ స్వీకరించాక వారి చేత పలు ప్రాణాంతక టాస్కులు చేయిస్తారు. చివరి దశ ఆత్మహత్యకు పాల్పడటంతో ముగుస్తుంది. ఆ విధంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న వారిని ప్రేరేపిస్తారు. ఒకవేళ టాస్క్‌లను వ్యతిరేకిస్తే వారికి భయంకరమైన వీడియోలు, చిత్రాలు పంపుతు బెదిరింపులకు దిగుతారు. ఈ ఛాలెంజ్ విసురుతున్న కొన్ని నంబర్లను గుర్తించినప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారనే విషయాలు తెలియరాలేదు. సదురు నంబర్లు మాత్రం జపాన్, మెక్సికో, కొలంబియాల నుంచి ఆపరేట్ అవుతున్నట్టుగా గుర్తించారు.
ఈ ఛాలెంజ్ కోసం ఒక బోమ్మ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ బొమ్మకు పెద్ద కళ్లు, వెడల్పు నోరు కలిగి ఉంటుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని జపాన్‌కు చెందిన ఓ కంపెనీ రూపొందించింది. జపాన్ ఆర్టిస్ట్ మిడోరి హయాషి దీనిని సృష్టించినప్పటికీ అతనికి ఈ గేమ్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ గేమ్ ద్వారా వ్యక్తిగత డేటాను దొంగిలించి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతారని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వారి చర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల వచ్చిన కికి ఛాలెంజ్ ద్వారా కూడా పలువురు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment