బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధి కుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశాచికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యో గుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం!
సమకాలీనం
మనిషికి జ్వరం రావడం మంచిదే, శరీరంలో వచ్చిన తేడాలు గుర్తించి సరిదిద్దుకునేందుకు అదొక సంకేతం, హెచ్చరిక అని సంప్రదాయ వైద్యులంటారు. ఆధునిక వైద్యులూ కొంతవరకు ఆమోదిస్తారు. సరిదిద్దుకునే పని ఎంత సమర్థంగా చేస్తామనే దాన్ని బట్టి భవిష్యత్ ఆరోగ్యం ఆధార పడుతుంది. ఆన్‌లైన్ ఆట ‘బ్లూ వేల్ చాలెంజ్’ అటువంటిదే అనుకుంటే! మనం, మన ప్రభుత్వాలు, వ్యవస్థలు ఏ మేరకు అప్రమత్తమై ఈ ఆధునిక జాడ్యాన్ని వదిలించుకునే చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రధానం. ఈ ఆట మర్మమేంటి? ఎందుకు యువతను ఆకట్టుకుంటోంది? చివరకు ఆత్మ హత్యలకు ఎలా పురిగొల్పుతోంది? ఏం చేసి ఈ సమస్యను పరిష్క రించవచ్చు? ఇదేకాక, ఇటువంటివి మున్ముందు మరో పేరుతో తలెత్తితే ఏమిటి పరిస్థితి? ఈ దిశలో తగిన ఆలోచనలు సాగటం లేదు. సరైన అడు గులూ పడటం లేదు. సమస్య తీవ్రత, మూలాల్ని సరిగ్గా అర్థం చేసుకున్న దాఖలాలే కనిపించడం లేదు! ఆటలో పాల్గొనే వారికి సదరు గేమ్ విసిరిన సవాళ్ల కన్నా, ఈ వ్యవహారం మన వ్యవస్థకు విసిరిన సవాలే పెద్దది.
శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి తగు నివారణ చర్యలు తీసుకోకుండా పైపై చర్యలతో సరిపెడితే ఫలితం శూన్యం! సైబర్ లోకానికి సంబంధించైనా, మరోటైనా... సమస్య రాగానే హడావుడి చేయడం, కాస్త సద్దుమణిగిన తర్వాత అన్నీ మరచి మామూలు స్థితికి చేరడం మనకు అలవాటే! బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది యువతీయువకులు ఈ ఆటాడి, అజ్ఞాత మారీచు(గ్రూప్ అడ్మిన్)ల పైశాచికత్వానికి బలైనట్టు కథనాలు వస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ, కచ్చితంగా వారి మరణం ఈ ఆట వల్లే అని ధృవపడలేదని ప్రభుత్వ వర్గా లంటున్నాయి. ఇంతకీ బ్లూవేల్ చాలెంజ్ ఆటా? మాస్ హిస్టీరియానా? భ్రమా–భ్రాంతియా? యువత తెలీక ఇరక్కుపోతున్న ‘నెట్’ వ్యసనమా? రకరకాల చర్చ జరుగుతోంది. ఇదసలు ఓ సాధారణ ఆట కాదు, మృత్యుక్రీడ అనే వారున్నారు.
ఇదొక్కటే కాకుండా, యువతరం జీవితాల్ని బుగ్గి పాల్జేస్తున్న ఆన్‌లైన్, నెట్ ఆధారిత క్రీడలెన్నో ఉన్నాయి. తాజా డిజిటల్ యుగంలో... సైబర్ నేరాల్ని పసిగట్టే, నియంత్రించే, పౌరులకు భద్రత కల్పించే వ్యవస్థ మనదేశంలో ఇంకా బలపడలేదు. సమాచార విప్లవం ఫలితంగా స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాల రూపంలో ‘ఇంటర్‌నెట్’ సామాన్యుల జీవితాల్లోకి సహితం చొచ్చుకొచ్చింది. ఆన్‌లైన్ ఆటలు, ప్రాణాల్ని బలి తీసుకునే వికృత క్రీడలూ ఇందులో భాగమయ్యాయి. ఈ ఆన్‌లైన్ సదుపాయం సగటు మనిషి జీవన విధానాన్ని, ముఖ్యంగా ఎదిగే యువతరం అలవాట్లని సమూలంగా మార్చేసింది. దీనికి తోడు ఇక్కడ మారిన కుటుంబ వ్యవస్థ, జీవనశైలి, విలువలు నశించిన విద్యావిధానం, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం... వెరసి సమస్యను జటిలం చేస్తున్నాయి. సమస్య మూలాల్ని శోధించి, శస్త్ర చికిత్స జరపడం అవసరమైన చోట పైపై లేపనాలు రుద్ది సరిపెట్టాలనుకోవడం ఓ పెద్ద లోపం. దీన్ని సరిదిద్దడమే తక్షణ కర్తవ్యం.
అబ్బే! ఈ చర్యలు సరిపోవు
అమెరికా, యూరప్, రష్యా, కొరియా తదితర దేశాల్లో చేదు అను భవాల్ని చవిచూపిన తర్వాత ఈ మాయా క్రీడ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగతా ఆన్‌లైన్ క్రీడల్లాగే ‘చాలెంజ్’ పేరిట కొన్ని టాస్క్‌లు ఇవ్వడం, వాటిల్లో కొన్ని అసాధారణ–ప్రమాద భరిత చర్యలుండటం, అవి సాధించేలా యువతను పురికొల్పడం ఈ ఆట లక్షణం. అది సాధించే క్రమంలో కొన్నిసార్లు తెలిసీ, చాలాసార్లు తెలియకుండానే బడిపిల్లలు, యువతరం ప్రమాదంలో ఇరుక్కుంటున్నారు. ఇక బ్లూవేల్ క్రీడ విషయానికొస్తే, యాౖభై రోజులు యాభై టాస్క్‌లుండటం, ఆఖరున ఆటాడే వారే ఆత్మహత్య చేసుకోవాలనడం దుర్మార్గమైన ముగింపు. ఈ ఆట ఆచూకీ తెలిసేలా, ఈ విషవలయంలో యువత చిక్కుకోకుండా నియంత్రించేలా ఓ హాట్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ‘నాస్కామ్’, ఐటీ లాబీలు కోరాయి.
ఆటనే రద్దు చేయాలని కేరళ సర్కారు, కేంద్ర మాతా–శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ తదితరులు కోరిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం నిజంగానే నిషేధించింది. తమ సైట్లలో ఈ ఆట లింకులు కూడా అందుబాటులో ఉండరాదని పలు సామాజిక మాధ్యమాలకు హెచ్చరిక నోటీసులిచ్చింది. ఢిల్లీ హైకోర్టు కూడా పలు సంస్థలకు ఇటువంటి తాఖీ దులిచ్చింది. అయినా ఈ తప్పుడు లింకులు, యాప్‌లు అందుబాటులోనే ఉన్నాయి. హరియాణాలో పిల్లల సంరక్షణ కమిషన్ వారు బడులు, ఇతర విద్యా సంస్థలకు ఈ విషయంలో ఏం చేయాలో/చేయకూడదో మార్గదర్శ కాలిచ్చారు. తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ పూనుకొని తల్లిదండ్రుల కమిటీలకు, ప్రయివేటు బడుల యాజమాన్యాలకు అవగాహన కలిగించే ఓ ఉన్నతస్థాయి సమావేశాన్నే గతవారం నిర్వహించింది. విద్యాసంస్థల్లో యాజ మాన్యాలు, బోధకులు, తల్లిదండ్రులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కేరళలో ఇదివరకే పలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఈ చర్యలు సరిపోవడం లేదు.
ఇంతకీ, ఎందుకు ఇరుక్కుంటున్నారు?
ఇదే కీలకమైన ప్రశ్న! ఇటువంటి క్రీడల్ని నిర్వహిస్తూ, ప్రోత్సహించే అత్యధిక సంస్థలు అధికారికమైనవి కావు. దొంగచాటుగా ఈ ఆన్‌లైన్ క్రీడా ప్రక్రియను నడిపే సంస్థలు (క్రాక్ వెర్షన్స్) యథేచ్ఛగా లింక్‌లు, యాప్‌లు తాము లక్ష్యంగా చేసుకున్న వారికి అందుబాటులోకి తెస్తున్నాయి! పైగా ఏ దర్యాప్తు సంస్థకూ ఈ మారీచులు అంత తేలిగ్గా దొరకరు! వారికి నేటి యువతరం బలహీనతలు తెలుసు. ముఖ్యంగా బ్లూవేల్ ఆట నడిపే గ్రూప్ నిర్వహకుల్లో కొందరు దారితప్పిన ఇంజనీర్లున్నారు. అత్యధికుల్ని ఈ ఆట పరిధిలోకి తెచ్చి, ఆఖరి టాస్క్ (ఆత్మహత్య) కూడా వారితో చేయించి, ఏదో పైశా చికానందం పొందడమే వీరి లక్ష్యమనేది సమాచారం. బడిపిల్లల నుంచి గాలివాటు చదువుల కాలేజీ విద్యార్థుల వరకు, తాడూ బొంగరంలేని పోరంబోకుల నుంచి నిరుద్యోగుల వరకు దుర్బల యువత వీరి లక్ష్యం! హేతువేమీ లేకుండానే కొత్త పోకడల వైపు అర్రులు చాచేవారు, ఇప్పుడు చేసే కోర్సుల్లో, ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి పారిపోయే మార్గాలు వెతికేవాళ్లు, మంచి మిత్రుల సాంగత్యాలు లేనివారు, తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడి ఒంటరితనంతో కుమిలేవాళ్లు వీరికి లక్ష్యం! ఇందులో ఒకటి లేదా పలు కారణాల వల్ల నెట్‌కు అతుక్కుపోయే వ్యసనపరులు తేలికగా ఈ వికృత క్రీడలో సమిధలవుతున్నారు.
ఇదొక బలహీనత, ఇందుకు కారణాలనేకం! సమిష్టి నుంచి వ్యష్టికి, ఆపై పరిమిత కుటుంబాలకు, చివరకు క్యూబికల్ ఫ్యామిలీస్‌కి, అక్కడక్కడ ఒంటరి (తల్లో, తండ్రో...) పేరెంట్స్‌గానూ విచ్ఛిన్నమైన మన కుటుంబ వ్యవస్థ కూడా కొంత కారణమే! ఇంటిల్లిపాదీ కలిసి కూర్చొని, మంచీ–చెడూ మాట్లాడుకొని, ఒకరికొకరు భరోసా కల్పించుకొని, పరస్పరం మానసిక స్థయిర్యాన్ని అందిం చుకునే పరిస్థితులు మన సమాజంలో సన్నగిల్లాయి. చిన్న కుటుంబాల్లో తల్లీ,తండ్రీ ఉద్యోగమో, వ్యాపార తదితర వ్యాపకాల్లోనో మునిగితేలే వారయితే, పిల్లలకు కేటాయించే సమయమే తగ్గిపోతోంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో, నెట్‌కు అతు క్కుపోతున్నారో, చెడు సావాసాలు చేస్తున్నారో గమనించే సమయం తల్లిదండ్రులకుండటం లేదు. చిన్నపిల్లల చేతికి తమ అత్యాధునిక స్మార్టు ఫోన్లు స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు.
వారితో సమయం వెచ్చించలేని తమ అశక్తతను కప్పిపుచ్చుకుంటూ వారిని అనునయించడానికి దాన్కొక తాయిలంలా ఇచ్చేవారూ ఉన్నారు. కొంచెం పెద్దయితే చాలు అడిగీ అడక్కుండానే సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్, నిరంతర ఇంటర్‌నెట్ సదుపాయం పిల్లలకు అందించే తల్లిదండ్రులు కోకొల్లలు! చిన్నపిల్లలే కాకుండా కాస్త ఎదిగిన యువత కూడా ఫోన్‌ను సమాచార అవసరాలకు కాకుండా క్రీడా వస్తువుగా వాడటానికే ప్రాధాన్యం ఇస్తారు. బడి, కళాశాల వాతావరణంలో వేర్వేరు కారణాల వల్ల విద్యాపరంగా ఇతర విద్యార్థులతో పోటీ పడలేనివారు, అక్కడ తమ ఓటమిని అధిగమించడానికి ఇటువంటి క్రీడల్లో ‘గెలుపు’ని ప్రత్యామ్నాయ విజయంగా గర్విస్తున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ నేటి యువతను ఈ ఆన్‌లైన్ వికృతక్రీడల్లో బలయ్యే దుర్బలులను చేస్తున్నాయి.
విద్యేతర తపన, సృజనకు ప్రోత్సాహమేది?
విలువల పరంగానే కాకుండా ఆచరణ పరంగా కూడా మన విద్యావిధానం దిగజారిపోవడం యువత తప్పుదోవ పట్టడానికి కారణమౌతోంది. వారి ఇతరేతరమైన ప్రతిభను సానపెట్టుకునే అవకాశాలే కనుమరుగయ్యాయి. ఎదిగే విద్యార్థిగా విద్యేతరమైన తన సహజ సృజన, తపన, ఆసక్తుల్ని తీర్చుకునే దారులన్నీ మూసుకుపోయాయి. క్రీడా ప్రోత్సాహం లేదు. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 15 వేల బడుల్లో క్రీడా మైదానాల్లేవు. ఇంకా ఎక్కువ చోట్ల క్రీడా ఉపాధ్యాయులు లేరు. కళాశాలల పరిస్థితి మరింత ఘోరం. ఇక ప్రయివేటు విద్యా సంస్థల గురించి మాట్లాడకపోవడమే మంచిది. పుస్తక పఠనం దాదాపు నిలిచిపోయింది. నాటకాలు, సాహిత్యం వంటి ప్రక్రియల ఊసు లేదు! నదులు, కాలువలు, వాగులు–వంకలు, బావులకు వెళ్లి ఈదులాడే పరిస్థితులు లేవు.
ఇవేవీ లేకుండా కెరీరిజం ముసుగులో బడులు, కాలేజీల్లో మనమంతా సృష్టిస్తున్న ఒత్తిడి నడుమ... వారికి స్మార్టుఫోనుల్లో దొరికే ఇంటర్‌నెట్ ఏడారిలో ఒయా సిస్సులాంటిదే అంటే అతిశయోక్తి కాదు! విద్యా వికాసానికి ఈ సదు పాయాన్ని ఉపయుక్తంగా వాడుకునేలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయ డానికి ఉపాధ్యాయులు, లెక్చరర్లు మేధోపరంగానే కాక సాంకేతికంగా ఎంతో ఎదగాల్సి ఉంది. ఒత్తిడిలో, బాహ్య ప్రేరకాలతో విద్యార్థులు దారి తప్పి నపుడు మానసిక పరిస్థితిని సరిదిద్దేలా కౌన్సిలింగ్‌కు ప్రతి విద్యాసంస్థలో మానసిక నిపుణులుండాలని నిబంధనలు మాత్రమే ఉన్నాయి తప్ప, వారు లేరు. ఈ పరిస్థితులు మారాలి. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటున్న, పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి విషయాల్లో మాత్రం మన పాలకులు కిమ్మనకుండా ఉండటం నిజమైన దౌర్భాగ్యం! ఈ పరిస్థితుల్ని ఇలా కొనసాగనివ్వొద్దు. వీడని నెట్ వ్యసనాలతో, అశ్లీల వెబ్‌సైట్ల అంటకాగుతూ, ఆన్‌లైన్ వికృత క్రీడల్లో అలమటించి ఈ దేశపు యువత నిర్వీర్యమై నీరుగారకముందే వ్యవస్థలు మేల్కొనాలి, సరిదిద్దుకోవాలి. సమస్య మూలాల్ని గుర్తించి పరిష్కరించుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో అత్యధిక యువశక్తి దేశంగా ఇప్పుడున్న మన కీర్తి మంటగలసి, అశక్తుల అడ్డాగా మారే ప్రమాదముంది. ‘‘ మానవ సంబంధాలను శాస్త్ర సాంకేతికత అధిగమించే ఓ రోజు వస్తుంది, అప్పుడీ జగత్తంతా ఒఠ్ఠి మూర్ఖులతో నిండి నదై ఉంటుంది’’ అన్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ అంచనాల దిశలో అడుగులు పడ తాయి. తస్మాత్ జాగ్రత్త!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
బ్లూవేల్ భూతాలను ఆపలేమా!
Published Fri, Sep 22 2017 12:39 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM
Advertisement