పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులు అది పసిగడుతున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేందుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటగింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో... ‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. ఇది దారుణం.
‘‘నీ వాదనను నేను తిరస్కరించవచ్చు గాక! కానీ, అది వినిపించే నీ హక్కును... నా ప్రాణాలు పణంగా పెట్టయినా కాపాడుతా’’
– వాల్తేర్ (ఫ్రాన్స్ రచయిత, తాత్వికుడు)
దేశంలో సాగుతున్న ఓ ప్రమాదకర అణచివేత పరి స్థితికి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య అద్దం పట్టింది. ‘భిన్నాభిప్రాయం, నిరసనని వ్యక్తం చేయడం ప్రజా స్వామ్యంలో భాగం. అణచివేత సరికాదు. ఈ హక్కు ప్రజాస్వామ్యానికే సేఫ్టీ వాల్వ్‌లాంటిది, కాదని మీరు దాన్ని అణగదొక్కితే, ఏదో రోజు ప్రజాస్వామ్యం ఫ్రెషర్ కుక్కర్‌లా పేలిపోతుంది’ అని ప్రభుత్వ నిర్వాకంపై న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హింసకు కుట్ర పన్నారంటూ దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న అయిదు గురు పౌరహక్కుల నేతల్ని ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారందరినీ గృహనిర్బంధానికే పరిమితం చేయాలని ఆదేశిస్తూ, వచ్చే బుధవారం లోపు ఈ కేసులో ప్రతివా దన తెలుపాలని ప్రభుత్వాల్ని నిర్దేశించింది. హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసిన ఇది దుందుడుకు చర్య అని సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు, పుణె కోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కొంత కాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని చెప్ప కనే చెబుతున్నాయి.
కక్ష సాధిస్తారనే భయం లేకుండా పౌరులు తమ అభిప్రాయాల్ని, నిరసన చట్టపరిధిలో స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగడం వల్లనే ప్రజాస్వామ్య పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే మన దేశంలో ఆ హక్కును ప్రభుత్వాలు కాలరాయడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ తీర్పు వెలువడు తున్న సమయానికి, ఇక్కడ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజా స్వామ్య నిరసనను సర్కారు కర్క శంగా అణచి వేసింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ సభలో దూరంగా నిలబడి, ప్లకార్డులు చూపుతూ తమకు న్యాయం చేయండని గొంతెత్తిన పలువురు ముస్లీం యువకుల్ని పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియనీకుండా గోప్యంగా ఉంచి, మీడియా ఎండగట్టడంతో 24 గంటలకు అరెస్టు చూపించారు. విచిత్రంగా వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసనకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభు త్వాన్ని నిలదీస్తారనుకుంటే చాలు సభలు, సమా వేశాలకూ అనుమతి లభించదు. ముందస్తు అరె స్టులు, నిర్బంధకాండ. తర్వాత కక్షసాధింపులు ఇవన్నీ మామూలే!
హక్కుల చేతనను అంగీకరించరా?
సామాజిక మాధ్యమాల్లో చెడు పరివ్యాప్తం చేయొ ద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. తన నియోజకవర్గ (వారణాసి) పార్టీ కార్యకర్తలను ద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ప్రేరణ ఏమై ఉంటుంది? నిజమే! అడ్డూ అదుపూ లేకుండా సామా జిక మాధ్యమాలు వేదికగా ఇటీవల ఏదేదో ప్రచారం లోకి వస్తోంది. దృవీకరణ లేకున్నా, విశ్వసనీయత కొరవడినా... సదరు సమాచారం రేపుతున్న దుమా రం ఇంతంత కాదు. ముఖ్యంగా మత, కుల, ప్రాంతీయ, సామాజిక వర్గ భావనలను రెచ్చగొట్టి పలు విపరిణామాలకు ఇది కారణమవుతున్న సంద ర్భాలెన్నో! వీటిని తప్పక నియంత్రించాల్సిందే! ‘ఫేస్‌బుక్’ ‘వాట్సాప్’ వంటి వేదికల్ని నిర్వహించే సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది. చెడు, తప్పుడు సమాచారం సృష్టిస్తున్న మూలాల్ని పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది.
అదే సమయంలో ఈ మాధ్యమాల వల్ల పౌరు లకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. తమ హక్కుల గురించిన స్పృహ, ప్రభుత్వాల బాధ్య తకు సంబంధించిన చైతన్యం పౌరుల్లో పెరుగు తోంది. పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులది పసిగడు తున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేం దుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటకింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో...‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. తమ ఈ తప్పుడు పంథాను హేతుబద్దం చేసుకోవడానికి, నియంతృత్వపు పోకడల్ని కప్పిపుచ్చడానికి దేశభక్తి, జాతీయత వంటి భావనల ముసుగు తొడుగు తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారనో, ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రోద్బలంతో సాగుతున్న కుట్ర అనో ప్రజా నిరసన గళాన్ని చిన్నబుచ్చే యత్నం చేస్తున్నారు.
ఎవరిది టెర్రర్ చర్య?
పాలకుల నిర్లక్ష్యం వల్ల కడుపు కాలిందనో, కొంప కూలిందనో, బతుకు చెడిందనో, భవిష్యత్తు అంధ కారమౌతోందనో... ఆక్రందనలు చేసే వారిని అనున యించకపోగా తీవ్రవాదులని ముద్ర వేస్తున్నారు. ఉగ్రవాదులని, దేశద్రోహులని, జాతి వ్యతిరేకులనీ, అర్బన్‌నక్సల్స్ అనీ... ఇలా కొత్త కొత్త పదజాలం వాడుతూ ప్రభుత్వాలు నిష్కర్షగా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిం చేవారు ‘టెర్రరిస్టులే’ అంటూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి రాధాకృష్ణన్ గత నెల్లో చెన్నైలో చేసిన ప్రకటన ఇటువంటిదే! తమిళనాడు తూటుకుడిలో వాయుకాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపుతున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనపెట్టుకోవడం కన్నా టెర్రరిస్టు చర్య ఏముంటుంది? పైగా, ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ సాగిన స్టెరిలైట్ వ్యతిరేకపోరా టంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న కార్య కర్తలు, న్యాయవాదులు, వార్తా కథనాలిచ్చిన జర్నలి స్టుల్ని కూడా ప్రభుత్వం నిర్బంధించింది.
ముంబయి –అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణను వ్యతి రేకిస్తున్న రైతులపై మహారాష్ట్ర ప్రభుత్వం దమన కాండ కొనసాగిస్తూనే ఉంది. అటవీచట్టాల సాక్షిగా తమ హక్కుల పరిరక్షణ కోసం ఒడిశాలోని నియమ్ గిరి గిరిజన తెగలు అక్కడి వేదాంత–బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యయుత మైన వారి పోరాట పటిమ, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తినిస్తే, స్వయంగా కేంద్ర హోమ్‌మంత్రి, ‘నియ మ్‌గిరి సురక్షా సమితి’కి మావో యిస్టులతో సంబం ధాలు అంటగట్టారు. సర్దార్ సరో వర్ వంటి బారీ ప్రాజెక్టులు పర్యావరణానికి, స్థానిక గిరిజనుల మను గడకు ప్రమాదకరమని నర్మదా బచావో ఆందో ళన్(ఎన్బీయే) చేసిన పోరుపై సుదీర్ఘ కాలం సాగిన ప్రభుత్వ నిర్బంధ కాండ తెలిసిందే!
తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పంథా!
విభజనతో రెండుగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోనూ పౌర నిరసను çసర్కార్లు సహించే పరిస్థితుల్లేవు. అడుగడుగున అణచివేస్తు న్నారు. ముస్లీమ్ యువకుల్ని చెరబట్టి ముప్పతిప్పలు పెడుతున్న కర్నూలు తాజా ఘటన ఏపీ ప్రభుత్వ దాష్టీకాలకు మచ్చుతునక. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కినప్పుడు తమకు చాకిరీ తప్పించమని ఆశా వర్కర్లు గొంతెత్తినప్పుడు, సమస్యలు పరిష్కరించమని ఉపాధ్యాయ సంఘాలు శాంతి ర్యాలీ జరిపినప్పుడు, సీపీఎస్ రద్దు కోరి ఉద్యోగులు ఉద్యమించినప్పుడు... పోలీసులను మోహరించి ఏపీ సర్కారు ఈ నిరనలన్నింటినీ నిర్భీతిగా ఉక్కుపాదంతో అణచివేసింది.
తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. నిరసనలు తెలుపుకొనే వేదికగా ఇందిరాపార్కు వద్ద నున్న ధర్నాచౌక్‌ను ఎత్తేయించారు. సర్కారు ఏర్పడ్డ తొలినాళ్లలోనే, ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ ఏర్పాటుకు జరిగిన యత్నాన్ని భగ్నం చేసి నాయ కులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ ఇళ్లలోనే నిర్బంధించి ప్రభుత్వం దమనకాండకు తలపడింది. మల్లన్నసా గర్‌ను వ్యతిరేకించి నిరసన తెలిపిన వారికీ అదే గతి పట్టించింది. విద్యార్థి ఉద్యమాల్నీ ఎక్కడికక్కడ అణ చివేస్తోంది.
మౌనం పంపే తప్పుడు సంకేతాలు
కర్ణాటకకు చెందిన హేతువాది, రచయిత కె.ఎస్. భగవాన్ తనను చంపదలచుకున్నవారికి ఓ సవాల్ విసిరారు. ఒక తేదీ ఖరారు చేస్తే తాను బెంగళూరు లోని విధానసౌధ ముందుకు వస్తానని, ముఖ్య మంత్రి, పోలీసుల సమక్షంలో తనను చంపి హీరో లుగా కీర్తి పొందొచ్చన్నారు. సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యకేసు దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం భగవాన్ కూడా హంతకులు లక్ష్యంచేసు కున్న ‘బుద్దిజీవుల’ జాబితాలో ఉన్నారు. నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సరే, ఎమ్మెమ్ కల్బుర్గి లను హతమార్చినవారే పథకం ప్రకారం గౌరీ లంకేష్‌నూ హత్య చేశారని వెల్లడవడం తెలిసిందే! సహనంతో నిరసనల్ని అనుమతించే ప్రజాస్వామ్య వాతావరణ మైనా, అసహనంతో సాగించే నియంతృత్వపు అణచి వేతయినా.... అధికారంలో శీర్షస్థానంలోని వారిచ్చే సంకేతాల్ని బట్టే ఉంటుంది.
బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిన సీనియర్ సంపాదకుడు, రాజకీయవేత్త చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సందర్బోచితమనిపి స్తుంది. పథకం ప్రకారం సాగిన బుద్దిజీవుల హత్య లైనా, దేశంలో పలుచోట్ల ఉన్మాదపు అల్లరిమూకలు జరిపిన కొట్టిచంపడాలయినా మన సమాజంలో బలపడుతున్న ఛాందసవాదానికి, మితిమీరిన అస హనానికి పరాకాష్ట! సదరు హంత కులకు వత్తాసుగా కొన్ని హిందూ మత సంస్థలవారు, పాలకపక్ష ఎంపీలు, కేంద్ర మంత్రులు చేసిన వాఖ్యల్ని ఆయా ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని గట్టిగా నియంత్రించి ఉండాల్సిందని రెండుసార్లు రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహించిన చందన్ మిత్ర మరో సీనియర్ జర్నలిస్టు బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ఈ వ్యాఖ్యలు సగటు పౌరుల్లోనూ ఆలోచనలు రేపు తాయి. నిరసనను కర్కశంగా అణచి వేయడం అప్రజాస్వామికమన్న సుప్రీం వ్యాఖ్యలు పాలకులకు కర్తవ్య బోధ చేస్తాయి.
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment