చట్టమే నీరుగారితే... భద్రతకు ముప్పే! | public security will be danger, if act loses | Sakshi
Sakshi News home page

చట్టమే నీరుగారితే... భద్రతకు ముప్పే!

Published Fri, Apr 3 2015 12:24 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

చట్టమే నీరుగారితే... భద్రతకు ముప్పే! - Sakshi

చట్టమే నీరుగారితే... భద్రతకు ముప్పే!

చట్టాల తీరు, శిక్షల అమలు అధ్వానంగా ఉండటం వల్లే మన రోడ్లపై అరాచకం రాజ్యమేలు తోందని సుప్రీంకోర్టు మందలిస్తున్న సమయంలోనే ఓ కొత్త చట్టం ఊపిరి పోసుకొంటోంది. రోడ్డు భద్రత చట్టం ముసాయిదాను కేంద్రం వెలువరించింది. ప్రతిపాదిత శిక్షల్ని, కఠిన నిబంధనల్నీ తాజాగా సరళతరం చేసి, చట్టం పుట్టక ముందే దాన్ని నీరుకార్చేస్తోంది. సరిగ్గా సుప్రీం హెచ్చరించిన ‘చట్టమంటే భయం లేనితనాన్ని’ అది మరింత పెంచేట్టుంది. ఇక పౌర సమాజం చైతన్యంతో నియంత్రణ వ్యవస్థల్ని అంకుశంతో అదిలిస్తే గాని భద్రతకు హామీ లేదు.
 
 
 ఏడాదికోసారి వారోత్సవాలు నిర్వహించడం తప్ప రోడ్డు భద్రతపై మన ప్రభుత్వాలు చేపడుతున్న కార్యాచరణేదీ లేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించి నిండు ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పైనా, అందుక్కావాల్సిన భద్రతా చర్యలపైనా సామాజిక చైతన్యం మన దేశంలో అంతంత మాత్రమే! ‘నిండు ప్రాణాలు బలి’,‘ నెత్తురోడుతున్న రహదారులు’, ‘అసువులు బాసిన కుటుంబం’ అని టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం చూస్తూనే ఉంటాం. నిండు జీవితాలు అలా గాల్లో కలిసిపోవ డం... ఒక రోజు వార్తగానో, నాలుగు రోజుల దర్యాప్తుగానో, కారకులైన వారికి కొన్నాళ్ల శిక్షలుగానో మారి రికార్డుల్లో జమవుతున్నాయి. అంతేగానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. మళ్లీ అవే ప్రమాదాలు, మరణాలు. వాహనాలు నడిపేవారి అలవిమాలిన అలక్ష్యం, అస్తవ్యస్థమైన రోడ్లు, నిద్రాణమైన వ్యవస్థలు, నీరుగారుతున్న దర్యాప్తులు, ప్రభావమే చూపక పలుచబారుతున్న చట్టాలు-శిక్షలు... వెరసి రోడ్డు భద్రత కేవల నినా దంగా మిగిలిపోతోంది. పైగా, కాలానుగుణంగా చట్టాలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు పదునెక్కించుకోవాల్సిందిపోయి, ప్రభుత్వాలే నీరుగారుస్తు న్నాయి. ఫలితంగా తప్పు చేసే వారికి భయమే లేకుండా పోతోంది. చట్టాల తీరు, శిక్షల అమలు ఇంత అధ్వానంగా ఉండటం వల్లే మన రోడ్లపై అరాచకం రాజ్యమేలుతోందని అత్యున్నత న్యాయస్థానం సోమవారం మందలిస్తున్న సమయానికే... ఒక కొత్త చట్టం ఊపిరి పోసుకోవడం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత చట్టం ముసాయిదా ప్రతిని ప్రకటించింది. ఈ  పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని చట్టంగా తీసుకురానున్నారు.
 
 దురదృష్ట మేమంటే, సరిగ్గా సుప్రీంకోర్టు మందలించిన ‘భయం లేకుండా పోవడాన్ని’ ప్రతిపాదిత చట్టం మరింతగా పెంచడానికి ఉద్దేశించినట్టుంది. ముందు ప్రతిపాదించిన శిక్షల్ని, కఠిన నిబంధనల్నీ ఈ తుది ముసాయిదాలో మరింత సరళతరం చేసి, చట్టం పుట్టకముందే ప్రభుత్వం దాన్ని నీరుకార్చేసిన తీరు దుర్మార్గం. శిక్షల్ని తగ్గించి ప్రభావమే లేకుండా చేశారని నిపుణుల అభిప్రా యం. డ్రైవర్లు ఒక్కొక్కరికీ నీతులు నేర్పి రోడ్డు ప్రమాదాల్ని నివారించలే మని, తప్పు చేస్తే శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయనే సంకేతాల వల్ల కలిగే భయం మాత్రమే పరిస్థితిని నియంత్రించగలదని వారి భావన. ఇది ఇలాగే ఆమోదం పొందితే... నిర్లక్ష్యంతో, మితిమీరిన వేగంతో, నిద్రావస్థలో, మత్తులో జోగుతూ  వాహనాల్ని నడిపి ప్రమాదాలకు కారకులవుతున్న వారికి ఇక చట్టమన్నా, శిక్షలన్నా భయమే ఉండదనే భావన వ్యక్తమౌతోంది.
 
 సుప్రీం ఆగ్రహాన్ని పట్టించుకోరా?
 
 తాగి వాహనాలు నడిపేవారు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ల ఇష్టారాజ్యమైపో యింది. వాళ్లు రోడ్ రాజాలయ్యారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 304 ఎ, కోర్టుల ఉదాసీన వైఖరి కలిసి చట్టమంటే భయమే లేని స్థితిని తీసుకు వచ్చా యని సుప్రీం ధర్మాసనం ఆగ్రహించింది. ప్రస్తుత చట్టాన్ని వెంటనే మార్చి, శిక్షల్ని మరింత కఠినతరం చేయాలని, శిక్షా కాలాన్ని పెంచాలనీ ఆదేశించింది. ‘మేమెంతో వేదనతో ఈ మాటలంటున్నాం. చట్టాలు చేసే పాలకులు లోతుగా ఆలోచించాలి, ఆ మేరకు చట్టాన్ని సవరించాలి. చట్టమంటే భయంలేని విచ్చలవిడితనమే ప్రమాదాలకు ప్రధాన కారణం...’ అని ధర్మాసనం పేర్కొంది. రోడ్డు ప్రమాదంతో ఇద్దరి మరణానికి కారణమయ్యాడని సౌరభ్ భక్షికి పాటియాలా కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను నష్టపరిహారం చెల్లించాడనే కారణంతో హైకోర్టు 24 రోజులకు తగ్గించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. కోర్టు అభిప్రాయాల స్పూర్తికి పూర్తి విరుద్ధంగా కొత్త చట్టపు ముసాయిదా సిద్ధమైంది. మితిమీరిన వేగానికి అంతకు ముందరి ప్రతిపాదన ల్లోని రూ. 5,000 నుంచి రూ. 12,500 వరకు ఉన్న జరిమానాను తాజాగా రూ. 1,000 నుంచి 6,000 కు పరిమితం చేశారు. తాగి వాహనం నడిపి ప్రమాదం చేస్తే, రూ 30 వేల జరిమానా, 12-18 నెలల జైలు శిక్ష, 18 నెలల వరకు డ్రైవింగ్ లెసైన్సు రద్దు శిక్షను మొదట్లో ప్రతిపాదిస్తే, దాన్ని రూ.10,000-రూ.20,000 వరకు జరిమానా, 6 మాసాల వరకు జైలు, 6 మాసాల వరకు డ్రైవింగ్ లెసైన్సు రద్దుకు తగ్గించారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి పిల్లల మృతికి కారణమైన వారికి రూ. 3 లక్షల వరకు జరి మానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదనను రూ. 50 వేల వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్షగా సరళతరం చేశారు. చట్టాల్ని కఠినతరం చేసి శిక్షల్ని పెంచమని సుప్రీం పార్లమెంటును ఆదేశిస్తే, పూర్తి విరుద్ధమైన ముసా యిదాను పార్లమెంటు ముందుకు తేవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి.
 
 నరకానికి నకళ్లు మన రోడ్లు
 
 అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం 90% పైగా రోడ్డు ప్రమాదాలు మితి మీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. ఇవిగాక మానవతప్పిదాలకు దారితీస్తున్న ఇతరేతర అంశాల్లో రోడ్ల పరిస్థితి, వాహన దుస్థితి, చట్టాలు-నియంత్రణ వ్యవస్థలు ప్రభావశీ లంగా లేకపోవడం వంటివి కారణాలు. గత దశాబ్దకాలంలో పరిస్థితి కొంత మెరుగైనా దేశంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల పరిస్థితి దయనీ యంగానే ఉంది. నాలుగు, ఆరు లేన్ల రోడ్లుగా అభివృద్ధి పరచిన జాతీయ రహదారులను, కొన్ని రాష్ట్ర ప్రధాన రహదారులు మినహాయిస్తే మెజారిటీ రోడ్లు ప్రమాదరహిత స్థితిలో లేవు. అవిభక్త రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ రహదారి (హైదరాబాద్-కరీంనగర్)ని విస్తరించినా... పట్టణాలు, పెద్ద గ్రామాల్ని తప్పించే బైపాస్‌లు లేకపోవడం ప్రమాదాలకు కారణమౌతోంది. ఆరు లేన్ల రోడ్డుగా (హైదరాబాద్-రామగుండం) అభివృద్ధి పరిచాక తగ్గాల్సిన రోడ్డు ప్రమాదాలు ఈ కారణంగానే ఇక్కడ గణనీయంగా పెరిగాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ఇటీవల ద్విచక్రవాహనాలు మాత్రమే తిరగడానికి పనికివచ్చే మట్టి రోడ్డులో ఆర్టీసీ బస్సు గోతిలో పడి 16 మంది మరణించారు. అభివృద్ధి గురించి ఊదరగొట్టిన తర్వాత కూడా, ఏపీ లోని 13 జిల్లాల్లో 29%  గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సదుపాయం లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే అంగీకరించింది.  రెండేళ్ల కింద ప్రపంచ బ్యాంకొక మంచి ప్రతిపాదన చేసింది. హైదరాబాద్-బిజాపూర్, రేణి గుంట-కడప అనే రెండు రహదారుల్ని ప్రయోగాత్మకంగా చేపట్టి, 50 కిలో మీటర్లకొక ప్రమాద చికిత్సా (ట్రామా) కేంద్రం ఏర్పాటు, తరచూ ప్రమా దాలు జరిగే బ్లాక్‌స్పాట్లలో ప్రత్యేక చర్యలు, నిరంతర మొబైల్ పెట్రోలింగ్, ఆర్టీయే, పోలీస్, ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల మధ్య సమన్వయం, ప్రపంచ ప్రమాణాలతో రోడ్లు ఏర్పాటు చేసి నిర్వహించాలని అది ప్రతిపాదించింది. ప్రమాదాలు తగ్గి పరిస్థితి ఆశావహంగా ఉంటే, ఈ పద్ధతిని విస్తరించాలని యోచన. కొంత వ్యయాన్ని భరించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినా, మన ప్రభుత్వాలు ఇంకా ఈ పథకానికి ఓ స్వరూపం తేలేదు. ప్రమాదాలకు గురైన వారి కోసం ట్రామా సెంటర్ల ఏర్పాటు, డ్రైవర్లకు శిక్షణ, వాహనాలపై అదుపు, నిఘా, నియంత్రణ వ్యవస్థల్ని సక్రమంగా నడపడం వంటి విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం తారస్థాయిలో ఉంటోంది.
 
 లోపాలతో మొదలై...లోపంతోనే ముగుస్తుంది!
 
 దేశంలో ఏటా లక్షన్నర మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న దుస్థి తికి రోడ్ల తర్వాత డ్రైవర్లు ప్రధాన కారణం. వృత్తి నైపుణ్య లోపం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన లేమి, తగిన విశ్రాంతి లేకుండా, విపరీతమైన ఒత్తిళ్ల మధ్య పనిచేయడం వంటివి ప్రమాదాలు చేయడానికి కారణం. లెసైన్సుల జారీ విధానమే అత్యంత లోపభూయిష్టంగా ఉంది. సరైన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండానే లెసైన్సులు పొందుతున్న డ్రైవర్లకు లెక్కే లేదు. రెండు వేలో, మూడు వేలో ఇస్తే డ్రైవింగ్ ట్రాక్‌కు వెళ్లకుండాబ్రోకరే ఇంటికి లెసైన్స్ తెచ్చిచ్చే పరిస్థితి ఉంది. దీనికి తోడు డ్రైవర్ల జీతభత్యాలు అంతంత మాత్రం, పనిగంటలు విపరీతం! డ్రైవర్లకు సంబంధించి మోటారు వాహన చట్టం నిబంధనలు గాలికి పోతాయి. సల్మాన్‌ఖాన్ కేసులో లాగా ‘సల్మాన్ కాదు, నేనే వాహనాన్ని నడిపాన’ని కొత్త డ్రైవర్ తెర మీదికి వచ్చినా ఏమీ చేయలేని దుస్థితి. చట్టప్రకారం డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు అదీ కూడా మధ్యలో రెండు గంటల విశ్రాంతితో మాత్రమే పనిచేయాలి.  కానీ, పది, పన్నెండు, ఇరవై గంటలు ఏకబిగిన వాహనాలు నడిపే డ్రైవర్లు, నడిపించే యజమానులున్నారు. వారానికి 48 గంటలకు మించి డ్రైవింగ్ చేయొద్దనే నిబంధన ఉన్నా అదీ అమలు కాదు. ప్రమాదాలకు కారణాలు, డ్రైవర్  మాన సిక, శారీరక స్థితిగతులపై శాస్త్రీయ అధ్యయనాలే ఉండవు. ప్రమాదాలకు కారకులైన వారి స్థితిని విశ్లేషించి తగు నివారణ చర్యలు తీసుకోవాలి. అలా తప్పిదాలకు పాల్పడ్డవారు తిరిగి తప్పు చేయకుండా జాగ్రత్త పడటానికి కఠినమైన నిబంధనలు, శిక్షలుండాలి. అవి సరిగ్గా అమలుకాకకపోవడంతో తిరిగి ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
 
 ట్రామా సెంటర్లు లేకపోవడం ఓ పెద్ద లోపం
 
 నిజమైన నరకం ప్రమాదం జరిగిన తర్వాత ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే, తక్కువ తీవ్రమైన ప్రమాదాలు జరిగినా మరణాల సంఖ్య ఇక్కడ ఎక్కువ. ప్రమాదం జరిగిన వెంటనే, అక్కడ హెలికాప్టర్లలో కూడా బాధితుల్ని దగ్గర్లోని ప్రమాద చికిత్సా కేంద్రాలకు చేరుస్తారు. సత్వర వైద్యం ద్వారా బాధితుల ప్రాణాల్ని కాపాడగలిగే అవకాశాల్ని మనం చేజార్చుకుంటున్నాం. లేకుంటే, మరణాల సంఖ్యను బాగా తగ్గించవచ్చని నిపుణులంటారు. ప్రమాదం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందితే, ఎన్నో ప్రాణాల్ని కాపాడొచ్చు. కానీ, మన పరిస్థితి పూర్తి భిన్నం. పట్టించుకునే వారే ఉండరు. ప్రమాదస్థలి నుంచి రవాణాగానీ, సమీపంలో వైద్యశాలలుగానీ ఉండవు, ఉన్నా ఎమర్జెన్సీ విభాగాలు ఉండవు. పైగా ప్రమాదపు కేసులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. 2014లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 23,512 రోడ్డు ప్రమాదాల్లో 7,862 మంది అసువులు బాసారు. 29,791 మంది క్షతగాత్రులయ్యారు. ఏ కోణంలో చూసినా ఇవి కంటతడి పెట్టించే గణాంకాలే! ఇన్ని లోపాల మధ్య పౌరుల ప్రాణాలు అకాల మర ణంతో  ముగుస్తుంటే, ప్రభుత్వాలు నిస్సిగ్గుగా చట్టాల్ని నీరుగార్చి, అమ లును గాలికొదుల్తున్న ఈ తీరునే సుప్రీం తప్పుబట్టింది. ఇక పౌర సమాజం చైతన్యమై నిర్వహణ-నియంత్రణ వ్యవస్థల్ని అంకుశంతో అదిలిస్తే గాని... రోడ్డు భద్రతకు అర్థం లేదు, సగటు పౌరుల ప్రాణాలకు రక్షణ లేదు.

దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
  ఈమెయిల్: dileepreddy@sakshi.com                          
                                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement