చట్టం బలపడితేనే అడవి నిలబడేది | Dileep Reddy Guest Column On Forest Protection In India | Sakshi
Sakshi News home page

చట్టం బలపడితేనే అడవి నిలబడేది

Published Fri, Oct 15 2021 12:16 AM | Last Updated on Fri, Oct 15 2021 4:06 AM

Dileep Reddy Guest Column On Forest Protection In India - Sakshi

అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు ‘అటవీ సంరక్షణ చట్టం’ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నించేస్తున్నారు. పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా.... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది.

అడవి అమ్మలాంటిది. అన్నీ తనలో ఇముడ్చుకుంటుంది. యుగాలుగా మనిషి మను గడ అడవితో ఎంత గాఢంగా పెనవేసుకుందో వేద–వేదాంగాలు, పురాణ–ఇతిహాసాలు, సంస్కృతీ సంప్రదాయాలు చెప్పకనే చెబుతాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాల నుంచి నైమి«శారణ్య బోధనలూ, పంచతంత్రం వరకు ఎన్నో గాథలకు వేదిక అడవి! కోట్ల ఏళ్లుగా మానవేతిహాసం అడవితో–సకల జీవరాశితో సహజీవన యానం (సింబయాసిస్‌ లివింగ్‌) చేస్తోంది. నింగి, నేల, గాలి, నీరు, ఆకాశం.... పంచభూతాలే ఇందుకు సాక్ష్యం! స్వార్థంతో మనిషి ప్రకృతికి చేసిన విఘాతాలే నేడు ఉగ్రరూపంతో మానవాళిని వేధిస్తున్న విపత్తులకు, ఉపద్రవాలకు కారణం. ఆ వరుసలో.. తాజాగా ఇపుడు అడవికి ముప్పు తెస్తున్నారు. భూతాపోన్నతి పెరిగి వాతావ రణ విపత్తులు ముంచుకు వస్తున్న వేళ, అడవుల్ని కాపాడుకొని, విస్తీర్ణం పెంచుకోవాల్సిన సమయంలో... ఉన్న చట్టానికి కేంద్రం తల పెట్టిన సవరణ ప్రతిపాదనలు మేలు చేయకపోగా కీడు చేసేవిగా ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు, ఉద్దేశపూర్వకం! పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్లకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అటవీ భూముల్ని అటవీయేతర అవసరాలకు వాడే భూబదలాయింపులకు ఇక తలుపులు బార్లా తెరచినట్టే! కీలకాంశాల్ని చట్ట పరిధి నుంచి తప్పించనున్నారు. అప్పుడిక ఏ ముందస్తు అనుమతులూ తీసుకునే పనిలేదు. గిరిజనులకు, అడవి బిడ్డలకు తీరని కష్టాలే! గ్రామీణులు, వనవాసీల సహకారంతో చేపట్టే వనసంరక్షణ స్ఫూర్తి గాలికే! ప్రతి పాదనల్లోని కొన్ని అంశాలు 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. కేంద్ర అధికారాల్ని మరింత కేంద్రీకృతం చేసేవే! చట్టం చేసే ముందరి సంప్రదింపుల విధాన (పీఎల్‌సీపీ) ప్రక్రియలో భాగంగా సంబంధీకుల వ్యాఖ్యలు, సూచ నల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక (ఎఫ్‌.నం. ఎఫ్సీ–11/61/2021– ఎఫ్సీ) పత్రం విడుదల చేసింది. వాటిపై రాష్ట్ర–కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలే కాకుండా పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, హక్కుల కార్య కర్తలు.... ఆసక్తిగల పౌరులెవరైనా తమ అభిప్రాయాల్ని, అభ్యంత రాల్ని తెలుపవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు గడువుంది.

పయనం ఎటు?
మార్పు ఏదైనా మంచికి జరగాలి. 1980లో వచ్చిన ‘అటవీ సంరక్షణ చట్టం’ ముందుగా ఒక అత్యవసర ఆర్డినెన్స్‌! ఆ తర్వాత చట్టమైంది. అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు (42వ రాజ్యాంగ సవరణలో భాగంగా) ఈ చట్టాన్ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. సుప్రీంకోర్టు 1996 (గోదావర్మన్‌ తిరుముల్పాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు)లో సంచలన తీర్పిచ్చింది. అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా... ఏ ప్రాజెక్టు–కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవేనని, అవన్నీ సదరు చట్ట పరిధిలోకే వస్తాయని, అలాంటి ఏ భూవినియోగ మార్పిడికైనా అను మతులు తప్పనిసరి అంది. అప్పట్నుంచి భూయాజమాన్య హక్కు లతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చ దనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా పచ్చదనం పెరిగింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నం చేస్తున్నారు. కానీ, పైకి ‘చట్టంలోని పలు అంశాలను చక్కదిద్దడానికి’ అని చెబుతున్నారు. ‘ఒకవైపు అడవుల రక్షణ, మరో వైపు అభివృద్ధిని వేగంగా సమీకృత పరచటానికే ఈ చట్ట సవరణ’ అనేది సర్కారు వాదన. సమాచార హక్కు చట్టాన్ని సవరించేప్పుడూ ఇదే చెప్పారు. చివరికేమైంది అందరికీ తెలుసు. అటవీ చట్టానికే గతి పట్టనుందో! ఎవరు ప్రస్తుత మార్పు కోరారు? ఏమడిగారు? ఎందు కడిగారు? వంటి విషయాల్లో పారదర్శకతే లేదు. ఈ 40 ఏళ్లలో చట్టం ఎలా అమలయింది? అందులో మంచి–చెడు ఎంత? అధ్యయనాలేవీ లేవు. మార్పులు చేస్తే... ఎక్కడ? ఎందుకు? దానికో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం తలపోసింది, అధికారులు పత్రం రూపొందించారు, అంతే! ప్రస్తుత చట్టంలో ఉన్న రక్షణ వ్యవస్థను పలుచన చేయడం, విలువైన అటవీ భూముల్ని చట్టం ఛత్రచ్ఛాయ నుంచి తప్పించడం, ‘అభివృద్ధి’ ముసుగులో సహజవనరుల్ని కొల్లగొట్టేవారికి చేయూతే పాలకుల రహస్య ఎజెండా అని పర్యావరణవేత్తల ఆందోళన! కార్పొ రేట్‌ వ్యాపారాల్ని సులభం చేసే చర్యల్లో ఇదొక భాగమన్నది విమర్శ.

రోగం కన్నా చికిత్స ఘోరమైతే....?
అటవీ చట్ట సవరణకు పద్నాలుగంశాలు ప్రతిపాదించారు. వివిధ రకాల రక్షిత అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడమో, భూబదలాయింపుల్ని సులభం చేయటమో, నియంత్రణ పట్టు సడలిం చడమో, నిబంధనల్ని నీరుగార్చడమో.. ఇలాగే సాగింది. ప్రయివేటు అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం, రైల్వేలు, హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస–ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మా ణాలు అనుమతించడం... వంటివి ప్రతిపాదించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత–వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే... అనుమతులు అక్కర్లేదంటు న్నారు. స్థలయాజమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ –రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించాలంటున్నారు. ఇలాంటి భూమి, ఒక్క తెలంగాణలోనే అయిదారు లక్షల ఎకరాలుంది. దేశమంతటా కనీసం 150 లక్షల ఎకరాలు చట్టపరిధి నుంచి బయటపడి, అటవీయేతర అవసరాలకు దారి మళ్లుతుంది. అడవుల విస్తరణపై ఇది ప్రతికూల ప్రభావమే! పోడు వ్యవసాయం చేసుకునే వనవాసీలకు హక్కులు కల్పించడం ఇప్పుడొక పెద్ద వివాదాస్పదాంశం, దాన్ని తేల్చరు. కానీ, ఖనిజాలు తవ్వే కార్పొరేట్లకు ఎర్రతివాచీ స్వాగతాలు ఇక సులభం.

అడవి పెరిగేనా? తరిగేనా?
సర్కారుది ఇంకో విచిత్ర వాదన. అడవులుగా ఉన్న అటవీయేతర, ప్రయివేటు భూముల్ని ఈ చట్టపరిధి నుంచి తప్పించి, భూయజమా నుల్లో భయాల్ని తొలగించాలట! నిర్భయంగా వారు ముందుకు వస్తారు కనుక, ఇప్పుడు 24.5 శాతంగా ఉన్న అడవుల వాటాను మొత్తం భూభాగంలో మూడో వంతుకు పెంచాలనే లక్ష్యం సాధ్యమౌ తుందట! అడవికి ఏ నష్టం కలిగించని ఆధునిక సాంకేతికత వచ్చింది కనుక.. చమురు, సహజవాయువు కోసం అడవుల కింద, ఏ ముందస్తు అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుకోవచ్చని ప్రతి పాదించారు. ఖనిజాలు, ఇతర వనరుల తవ్వకాలకు జరిపే సర్వేలను కూడా అటవీ చట్ట పరిధి నుంచి మినహాయించాలన్నారు. అంటే, మన అమ్రాబాద్‌ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వంటి సర్వేలు ఏ అనుమతులు లేకుండా చేసుకోవచ్చు! అంటే, ఏ అటవీ భూమి ఏ ఇతర అవసరాలకు దారి మళ్లుతుందో ఎవరికీ తెలియదు. నిశ్శబ్దంగా అంతా జరిగిపోతుంటుంది. తెలియనపుడు ప్రజాందోళనలుండవ్‌! న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించే సందర్భాలుండవు. ప్రస్తుత ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పర్యా వరణ సంస్థలు, నిపుణులు, కార్యకర్తలు ఇతర బాధ్యతకలిగిన పౌరులు ఎలా స్పందిస్తారు? అన్నదాన్ని బట్టే దేశంలో అడవులు, పర్యావరణ భవిత ఆధారపడి ఉంది. అడవి ఎవరికీ శత్రువు కాదు. ఆయుధమెప్పుడూ అలీనం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రా యమే ఆయుధం. శమీ వృక్షంపైనుంచి దించి, జరిపే ఆయుధపూజకు వేళైంది. చెడుపై మంచి గెలుపే విజయదశమి!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement