భావోద్వేగాలు చిక్కబడినప్పుడు విచక్షణ నీరుగారటం సహజం. తమకో, తమ వారికో అన్యాయం జరిగిందనుకున్నవారు తక్షణ న్యాయం కావాలని ఆశించడం తప్పు కాదు. కానీ ఆ న్యాయం ఫలానా విధంగానే ఉండాలనడం, అది ఫలానా సమయానికల్లా దక్కాలనడం వల్ల ఆ పనిలో ఉండే వ్యవస్థలు సమస్యలెదుర్కొంటాయి. అన్యాయానికి గురైన సాధారణ వ్యక్తులు భావోద్వేగాలకు లోనై ఎలా స్పందించినా వారిని సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు. ఆ స్పందన చట్ట పరిమితులకు లోబడి వున్నంతవరకూ చట్టాలు సైతం మౌనంగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నతంగా ఆలోచించాల్సిన, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన సంఘాలు సైతం అదే మాదిరి ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కశ్మీర్‌కు స్వేచ్ఛనివ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించిన కేసులో కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థినిని రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా అక్కడి బార్ అసోసియేషన్ ఆమె తరఫున న్యాయవాదులెవరూ వాదించకూడదని తీర్మానం చేసింది.
నళిని దేశద్రోహి కనుక, జాతి వ్యతిరేకి గనుక వాదించొద్దని ఆ తీర్మానం సారాంశం. అదే రాష్ట్రంలోని హుబ్లీలోనూ ఈ మాదిరి పరిణామమే చోటుచేసుకుంది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కేసులో ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను ఇలాంటి నేరారోపణలపైనే అరెస్టు చేయగా, అక్కడి బార్ అసోసియేషన్ కూడా వారికి న్యాయ సహాయం చేయరాదంటూ తీర్మానించింది. ఇతరులతో పోలిస్తే న్యాయం గురించి, చట్టాల గురించి న్యాయవాదులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అలా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ రెండుచోట్లా బార్ అసోసియేషన్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. మైసూర్‌లో నళిని తరఫున వాదించడానికి వేర్వేరు జిల్లాలకు చెందిన 170 మంది న్యాయవాదులు వెళ్లారు. హుబ్లీలో నిందితుల తరఫున వాదించడానికెళ్లిన ముగ్గురు న్యాయవాదులను దూషించడం, చంపేస్తామని బెదిరించడం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. ఈ తీరు సరికాదని కర్ణాటక హైకోర్టు హితవు చెప్పడంతో హుబ్లీ బార్ అసోసియేషన్ తన తీర్మానాన్ని సవరించుకుని నిందితుల తరఫున వాదిం చడం న్యాయవాదుల వ్యక్తిగత ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపింది. కానీ ఇది కూడా తప్పేనని హైకోర్టు చెప్పడంతో తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది.
‘రాజు తలచిందేను ధర్మం...రాజు చెప్పిందేను శాస్త్రం’ అన్నట్టు ఎలాంటి చట్టం, న్యాయం లేని మధ్యయుగాల నాటి పరిస్థితులనుంచి మానవ సమూహాలు ప్రజాస్వామ్య సమాజాలకు ఎలా పరివర్తన చెందాయో, ఏ పరిణామాలు అందుకు దోహదపడ్డాయో తెలిసున్నవారు ఇలాంటి అపరిపక్వ ఆలోచనలకు తావీయరు. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజ్యాంగాలు, చట్టాలు అక్కడి సమాజాల సమష్టి వివేకానికి దర్పణాలు. అన్యాయానికి లోనైనవారికి న్యాయాన్ని అందించటం, సమాజానికి హానికరంగా పరిణమించినవారిని ఆ సమాజం నుంచి దూరంగా వుంచి, వారిని సంస్కరించటం చట్టాల మౌలిక ఉద్దేశం. రాజ్యాంగం రచించిననాటికి ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కావొచ్చు, చట్టాలు రూపకల్పన చేసినప్పటి ఆలోచనల పర్యవసానంగా కావొచ్చు...ఆచరణలో సమస్యలెదురవుతుంటాయి. మారిన పరిస్థితులు, ఆలోచనల ఆధారంగా వాటికి సవరణలు చేసుకోవటం ఎక్కడైనా ఉండేదే.
ఒక సమాజం న్యాయాన్ని మరింత చురుగ్గా, మరింత మెరుగ్గా అందించదల్చుకుని ఈ సవరణలు చేసిందా లేక తిరోగమన దృక్పథంతో వ్యవహరించిందా అన్నది ఆ సవరణల సారాంశం తేటతెల్లం చేస్తుంది. మన దేశంలో చట్టాలు ఏమేరకు ఆసరాగా నిలు స్తున్నాయో సాధారణ ప్రజానీకానికి నిత్యానుభవం. ఎడాపెడా దుర్వినియోగమవుతున్న చట్టాల జాబితాను రూపొందిస్తే మాత్రం అందులో రాజద్రోహ చట్టం మొట్టమొదట ఉంటుంది. 1962లో కేదార్‌నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం దీన్ని గుర్తించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధమేనని చెబుతూనే, దాని దుర్వినియోగం మాత్రం అధికంగానే వున్నదని అభిప్రాయపడింది. చిత్రమేమంటే ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంటే ఏళ్లు గడుస్తున్నా మన సమాజం తీరు తెన్నులు పెద్దగా మారలేదన్నమాట.
ఇలా దుర్వినియోగమవుతున్న చట్టంలో చిక్కుకున్నవారికి కనీసం న్యాయస్థానాల్లో కూడా ఉపశమనం దక్కనీయకుండా నివారించే ప్రయత్నం చేయడం ధర్మం కాదని మైసూరు, హుబ్లీ బార్ అసోసియేషన్లకు తట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని సంగతలావుంచి వృత్తిపరంగా ఎలా వ్యవహరించాలో, ఎలాంటి సంప్రదాయాన్ని పాటించాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిబంధనలు చెబుతున్నాయి. తీవ్రమైన నేరం చేశాడని మొత్తం సమాజం భావించిన వ్యక్తి సైతం తన తరఫున వాదించమని ఆశ్రయించినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఏ న్యాయవాదీ అందుకు నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పార్లమెంటు చేసే చట్టాలు మాత్రమే కాదు...వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చే ఆదేశాలు కూడా చట్టాలతో సమానమే. ఏ పౌరుడైనా తెలియక తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. చట్టానికి సంబం ధించినంతవరకూ తాను అజ్ఞానినని మొత్తుకున్నా అంగీకరించదు. నిత్యం ఆ చట్టాలకు సంబంధిం చిన పనిలోనే నిమగ్నమై వుండేవారికి ఇది తెలియదనుకోగలమా? తెలియక చేశారనుకున్నా అది కోర్టు ధిక్కారం కాదా? దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించేవారిపట్ల కోపావేశాలుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అలాంటివారిని సైతం చట్టబద్ధంగా విచారించి శిక్షించాలని కోరుకోవాలి తప్ప అన్నిటినీ బేఖాతరు చేసి, వారికి అన్ని దారులూ మూసేయాలన్న వితండవాదనకు దిగ కూడదు. ఇలా కోరుకోవడం ద్వారా తాము నాగరిక సమాజం మౌలిక పునాదులనే ప్రశ్నార్థకం చేస్తు న్నామని, న్యాయపరమైన ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకోవడంతోపాటు అసలు ఆ ప్రక్రి యనే సందేహాస్పదంగా మారుస్తున్నామని వారు గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment