బ్లూహె(వే)ల్: మరోసారి అఘాయిత్యం
జోధ్‌పూర్: ‘బ్లూవేల్’ భూతం సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రమాదకర బ్లూవేల్ ఇంటర్నేట్ గేమ్ యువత ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీని సవాల్‌కు స్పందించి ఇప్పటికే పలువురు చిన్న పిల్లలు, యువత ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి రెండోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోబోయింది. సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచింది. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
బీఎస్‌ఎఫ్ జవాను కూతురైన ఈ అమ్మాయి ‘బ్లూవేల్’ టాస్క్ పూర్తి చేసేందుకు సోమవారం అర్ధరాత్రి ఆమె చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడటంతో ఆపద తప్పింది. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ఈ ఉదంతం తర్వాత కూడా ‘బ్లూవేల్’ నుంచి ఆమె పూర్తిగా బయట పడకపోవడంతో తాజాగా మరోసారి ఆత్మహత్యకు యత్నించింది.