పొదుపే గతి..!
- జూలై మొదటివారం నుంచి నగరంలో 10 శాతం నీటి కోత
- రెండో వారం కూడా వరుణుడు కరుణించకుంటే 20 శాతానికి పెంపు
సాక్షి, ముంబై: నగరవాసులు పొదుపు మంత్రం జపించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఇది పెరిగిన నిత్యావసరాల భారాన్ని తగ్గించుకునేందుకు మాత్రం కాదు. వరుణుడు కరుణించనందుకు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల కావస్తోంది. అయినా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. ఇక నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి.
మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే చుక్క నీటిని కూడా వృథా చేయకుండా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే జూలై మొదటి వారం నుంచే నగరవాసులకు సరఫరా చేసే నీటిలో 10 శాతం కోత విధించాలని బీఎంసీ నిర్ణయిం చింది. రెండో వారం కూడా వర్షాలు పడకపోతే ఈ కోతను 20 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇలా కోతలు పెరిగితే ముంబైకర్లకు నీటిని పొదుపుగా వాడుకోవడం మినహాయించి మరో గత్యంతరం ఉండదు.
నగరానికి నీటిని సరఫరా చేసేఏడు జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోయినందునే కోతలు విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారి చెప్పారు. ముఖ్యంగా మిడిల్, అప్పర్ వైతర్ణాలో నీటి నిల్వలు కనిష్టస్థాయికి చేరాయన్నారు. ఈ ఏడు జలాశయాలన్నింటిలో కలిపి మంగళవారంనాటికి 1.43 లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూన్ 24వ తేదీ వరకు ఈ జలాశయాల్లో మూడు లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలుండగా ప్రస్తుతం అందులో సగం కంటే తక్కువగా ఉన్నాయి.
అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై మాసాంతం వరకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నగరానికి ఏడాది నీటి కోతలు విధించకుండా ఉండాలంటే 12 నుంచి 13 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. రోజుకు 4,200 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉన్నప్పటికీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 3,450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది.
మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే ముఖం చాటేస్తే నీటి కోత మరింత పెంచాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్పొరేషన్ కూడా త్వరలో ‘సేవ్ వాటర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుందని చెప్పారు. ప్రతికా ప్రకటనలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసుల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించనున్నారు.