ఆలయానికి ఆదాయపన్ను నోటీసులు
బుద్ధగయలోని మహాబోధి ఆలయానికి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన బౌద్ధక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయం.. విరాళాల ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నా, వార్షిక ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. రిటర్నులు ఎందుకు దాఖలు చేయలేదంటూ ఆలయ పాలక మండలికి నోటీసు ఇచ్చినట్లు ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ సౌరవ్ రాయ్ తెలిపారు.
ఈ నోటీసులు తమకు అందినట్లు పాలకమండలి సభ్య కార్యదర్శి ఎన్ దోర్జీ తెలిపారు. కమిటీ రిటర్నులు దాఖలు చేయని మాట కూడా వాస్తవమేనన్నారు. అయితే అందుకు కారణం ఆదాయపన్ను శాఖేనని, ఆ శాఖ ఇంతవరకు ఆలయ కమిటీకి పాన్ కార్డు జారీ చేయలేదని ఆయన చెప్పారు. పాన్ కార్డు లేకుండా అసలు తమ కమిటీ రిటర్నులు ఎలా దాఖలు చేయగలదని ఆయన ప్రశ్నించారు. అయితే.. అనధికారిక సమాచారం ప్రకారం, అసలు ఈ కమిటీ ఇంతవరకు ఎప్పుడూ ఆదాయ వ్యయాల రిటర్నులు దాఖలు చేయనేలేదని ఓ అధికారి చెప్పారు.