ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన ముందు ఆ రాష్ట్రంలో పోలీసులు శక్తివంతమైన బాంబును స్వాధీనం చేసుకున్నారు.
గువహాటి: ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన ముందు ఆ రాష్ట్రంలో పోలీసులు శక్తివంతమైన బాంబును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గువహాటి సమీపంలోని కెండుకొన రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలులో 7 కిలోల బరువున్న బాంబును గుర్తించారు.
బాంబును టవల్తో చుట్టి ప్లాస్టిక్ సంచిలో ఉంచారు. రైలు కంపార్ట్మెంట్లో దీన్ని దాచారు. భద్రత సిబ్బంది బాంబును గుర్తించిన వెంటనే రైలును ఆపివేశారు. నిపుణులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. ఆదివారం అసోంలో బాంబు పేలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. ఈ నెల 29న ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోం పర్యటనకు రానున్న నేపథ్యంలో బాంబు ఉదంతం సంఘటనలను భద్రత సిబ్బంది సీరియస్గా పరిగణిస్తున్నారు.