
27 రోజులు.. 20 మొబైళ్లు.. 20 సిమ్‌లు
► అలా ముగిసిన బాంబ్ నాగ పరారీ కథ
సాక్షి, బెంగళూరు: మాజీ కార్పొరేటర్, పాతనోట్ల దందాలో నిందితుడైన బాంబ్ నాగ అలియాస్ నాగరాజు పోలీసుల కళ్లుగప్పేందుకు రోజుకొక మొబైల్ ఫోన్, సిమ్‌కార్డును వినియోగించేవాడని తెలిసింది. ఆ సిమ్‌లన్నీ అతని బంధువులే సమకూర్చేవారు. పాతనోట్ల దందా ఆరోపణలపై ఏప్రిల్ 14న ఇక్కడి శ్రీరామపురలో నాగరాజు ఇంటిపై పోలీసులు దాడి చేయడం, ఆ సమయంలో రూ.14.80 కోట్లు పాతనోట్లు దొరకడం, అతడు తన ఇద్దరు కొడుకులైన గాంధీ, శాస్త్రీలతో సహా పరారవ్వడం తెలిసిందే. ఈ నెల 11న పోలీసులు ఈ ముగ్గురిని తమిళనాడులోని వేలూరు జిల్లా మానంబాకం వద్ద అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ఇన్నీ రోజులు ఎక్కడెక్కడ ఉన్నాడు? పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు? అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాయి.
బంధువుల సాయంతో గుట్టుగా
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వేలూరు చుట్టుపక్కల ఉన్న తొమ్మిది తాలూకాల్లో నాగరాజు బంధువులు ఉన్నారు. గతంలో వీరిలో చాలా మంది ఏదో ఒక విధంగా లబ్ధి పొందిన వారే. దీంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రాంతాన్ని నాగరాజు ఎన్నుకున్నాడు. ఓమ్నీ కారును సమకూర్చుకుని నిత్యం అందులోనే ప్రయాణించేవాడు. నాగరాజు కారును ఎవరైనా వెంబడిస్తున్న విషయం, లేదా తానున్న చోటుకు ఎవరైనా కొత్తవారు ముఖ్యంగా కన్నడ మాట్లాడే వారు వస్తే బంధువులు వెంటనే అతన్ని హెచ్చరించేవారు. రోజుకు ఒక ఊరిలో మకాం పెట్టేవాడు. ఇక మొదటి పదిరోజుల వరకూ కాయిన్ బాక్స్‌ల నుంచి తన లాయర్‌కు ఫోన్ చేసే నాగరాజు తర్వాత రోజుకొక సిమ్, సెల్‌ఫోన్ ఉపయోగించడం ఆరంభించాడు. దీంతో పోలీసులకు బాంబ్ నాగ ఆచూకీ కనిపెట్టడం కష్టమైంది.
గుడిలో ప్రసాదం, మకాం
మొదటి నుంచి దైవభక్తి కలిగిన నాగరాజు కారులోనే తిరుగుతూ మార్గమ«ధ్యలో వచ్చే దేవస్థానాలకు వెళ్లి పూజలు చేసేవాడు. కొన్నిసార్లు దేవాలయాల్లోని ప్రసాదాలు తిని అక్కడే పడుకునేవాడు. అక్కడి నుంచే లాయర్‌కు ఫోన్‌చేసేవాడు. చాలాసార్లు నాగరాజు మాట్లాడిన స్థలం దగ్గర్లో దేవాలయం ఉన్నట్లు పోలీసులు గమనించారు. దీంతో దేవాలయాల వద్ద తమదైన శైలిలో నిఘా ఉంచారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు నాగను పట్టుకోవడానికి ప్రయత్నించగా రెండుసార్లు తృటిలో తప్పించుకున్నాడు. ఇక గత గురువారం నాగరాజు వేలూరు సమీపంలోని అమ్మాన్ దేవాలయానికి వెళ్లి ఆర్కాట్ వెలుతున్నట్టు సమాచారం అందింది. దీంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నాగరాజు అతని ఇద్దరు కుమారులు ప్రయాణిస్తున్న కారును మూడు బృందాలుగా విడిపోయి నాగను వెంబడించారు.
హైడ్రామా నడుమ చిక్కాడు
పోలీసులు తమ వాహనాన్ని వెంబడిస్తున్న విషయం గమనించిన నాగరాజు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాదాపు 25 కిలోమీటర్లు చేజ్ సాగింది. దీంతో పోలీసులు విధిలేక కొండావర గ్రామం సమీపంలో బాంబ్ నాగ వాహనాన్ని తమ వాహనంతో ఢీ కొట్టించి ఆపారు. తరువాత ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నాగరాజు ‘నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రక్షించండి.’ అని కేకలు వేశాడు. దీంతో స్థానికులు పోలీసులను చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇంతలో అదనపు పోలీస్ కమిషనర్ అరవింద్ నింబాల్కర్ తమిళనాడు పోలీసులతో మాట్లాడి అక్కడికి స్థానిక పోలీసులను పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉండగా పోలీసు కష్టడిలో ఉన్న నాగరాజు కొంతమంది పోలీసులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యే అవుతానని అప్పుడు తన తడాఖా చూపిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక నాగరాజును అరెస్టు చేసిన బృందానికి హోంశాఖ రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.