
ఎట్టకేలకు బాంబు నాగ పట్టివేత
బెంగళూరు: పాతనోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న బెంగళూరు మాజీ రౌడీషీటర్ బాంబ్‌నాగ అలియాస్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాష్ట్ర పోలీసులు తమిళనాడు వేలూరు జిల్లాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గత నెల మూడోవారంలో బెంగళూరు శ్రీరామపురలోని అతని నివాసంపై పోలీసులు దాడులు చేయగా రూ.14.80 కోట్ల పాతనోట్లు దొరికిన విషయం తెలసిందే. అతడు మాత్రం తప్పించుకు పారిపోయి.. అజ్ఞాతంనుంచి సీడీలు విడుదల చేస్తూ సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు గుప్పించాడు. తాను చనిపోతే అందుకు ముఖ్యమంత్రే కారణమని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో వేలూరు జిల్లాలో బాంబ్‌నాగ తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న నగర పోలీసులు అక్కడ మాటు వేశారు. గురువారం వేలూరు జిల్లాలోని ఆర్కాట్ సమీపంలోని మంబాకం ప్రాంతంలో బాంబ్‌నాగ కారులో వెళుతున్నట్లు గుర్తించి వెంబడించగా పోలీసులను గమనించిన బాంబ్‌నాగ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాంబ్‌నాగను అరెస్ట్ చేశారు.
బాంబ్‌నాగను తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. కాగా పట్టుకునే క్రమంలో పోలీసులు బాంబ్‌నాగపై కాల్పులు జరపగా అతని కాలుకు గాయాలయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. బాణసవాడి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.