
నోట్ల దందాలో సీఎం పీఏ హస్తం!
- కన్నడనాట పాతనోట్ల ప్రకంపనలు
- నోట్ల దందాలో సీఎం సిద్ధరామయ్య పీఏ మంజున్నాథ్ హస్తం!!
- మంజునాథ్ ఎవరో తెలియదన్న సీఎం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఇటీవల రౌడీషీటర్ వి.నాగరాజు అలియాస్ బాంబ్ నాగ ఇంట్లో రూ. 14.80 కోట్ల పాత నోట్లు దొరికిన కేసు శనివారం అనూహ్య మలుపు తిరిగింది. బెంగళూరు శ్రీరాంపురలోని అతని ఇంట్లో ఈ నెల 14న పోలీసు దాడుల్లో నోట్లు పట్టుబడగా.. అప్పటినుంచి పరారీలోనున్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు. నాలుగు నిమిషాల వీడియోలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు, సీఎం సిద్ధరామయ్యతో పాటు మంజునాథ్, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు.
వీడియోలో అతడు ఏం చెప్పాడంటే.. ‘నా ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు నేను అక్కడ లేను. పోలీసులే శ్రీరాంపురలో నేను నిర్వహిస్తున్న స్నేహ సమితి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో తాళాలు పగులగొట్టి సొమ్మును పెట్టారు. ఆ సమయంలో నా ఇంట్లో ఉన్న కొత్త నోట్లను పోలీసులు దోచుకున్నారు. ఆ రోజు నన్ను ఎన్‌కౌంటర్ చేయడానికే పోలీసులు వచ్చారు. ఇందుకు రూ. 10 కోట్లు చేతులు మారాయి. ఇందుకు కారణం లేకపోలేదు. పాత నోట్లు మార్చాలంటూ ఫిబ్రవరి 14 నుంచి కిషోర్, మధు, ఉమేష్, నవీన్, గణేష్ అనే వ్యాపారులు, రియల్టర్లు వందసార్లు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఎం సిద్దరామయ్య పీఏ మంజునాథ్‌కు చెందిన కోట్ల రూపాయల సొమ్మును నేను మార్చాను.
ఐపీఎస్‌లకు చెందిన సొమ్మును కూడా మార్చాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి కుదరదని చెప్పడంతో నాపై కక్ష కట్టారు. దీంతో హెణ్ణూరులో నాపై ఉమేష్ ద్వారా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆ స్టేషన్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్, పోలీస్ కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్ల ద్వారా నన్ను ఎన్‌కౌంటర్ చేయడానికి స్కెచ్ వేశారు. నేను తమిళుడిగా పుట్టడమే తప్పయ్యింది’ అని పేర్కొన్నారు.
చట్ట ప్రకారం చర్యలు: హోంమంత్రి పరమేశ్వర్
ఈ వీడియో టీవీ చానెళ్లలో ప్రసారమైన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్, పీసీసీ అధ్యక్షుడు, హోం మంత్రి పరమేశ్వర్‌ను కలసి విషయం వివరించారు. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ... బాంబ్‌నాగ ఎక్కడ ఉన్నాడో తెలియదని, త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తారన్నారు.
పీఏ మంజునాథ్ ఎవరో తెలియదు: సీఎం
బాంబ్‌నాగ ఆరోపణల విషయమై సీఎం సిద్ధు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏ మంజునాథ్ ఎవరో తనకు తెలియదన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు.