MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ | Siddaramaiah Wife Parvathi Surrender Their 14 Plots To Muda | Sakshi
Sakshi News home page

MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్

Published Tue, Oct 1 2024 1:29 PM | Last Updated on Tue, Oct 1 2024 3:45 PM

Siddaramaiah Wife Parvathi Surrender Their 14 Plots To Muda

బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. 

ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.

అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు ముడా స్కామ్‌ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement